బీజేపీలో చేరిన మరో రిటైర్డ్ హైకోర్టు జడ్జీ.. విశేషమేమిటంటే..
బెయిల్ పిటిషన్ పై విచిత్రమైన కండీషన్ లు పెట్టి తరుచూ వార్తల్లో నిలిచిన ఓ రాష్ట్ర రిటైర్డ్ హైకోర్టు జడ్డి తాజాగా కమలదళంలో చేరారు.
By : The Federal
Update: 2024-07-14 11:56 GMT
మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ ఆర్య భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. మూడు నెలల క్రితం పదవీ విరమణ చేసిన ఆయన తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. అంతకుముందు ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.
శనివారం (జూలై 13) భోపాల్‌లో రాష్ట్ర కార్యాలయంలో మధ్య ప్రదేశ్ చీఫ్ రాఘవేంద్ర శర్మ సమక్షంలో కమలదళంలో చేరారు. కొద్ది నెలల క్రితమే, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ మార్చిలో బిజెపిలో చేరడానికి న్యాయవ్యవస్థ నుంచి వైదొలిగారు. తరువాత పశ్చిమ బెంగాల్ లోని తమ్లూక్ లోక్ సభ నుంచి ఎంపీగా గెలుపొందారు.
వివాదాస్పద నిర్ణయాలు
జస్టిస్ (రిటైర్డ్) ఆర్య 2021లో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించిన హాస్యనటులు మునావర్ ఫరూకీ, నలిన్ యాదవ్‌లకు బెయిల్ నిరాకరించినందుకు వార్తల్లో నిలిచారు. ఫరూఖీ తరువాత సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందారు, ఇది హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టింది. యాదవ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ నుంచి బెయిల్ పొందారు.
2020లో కూడా, జస్టిస్ (రిటైర్డ్) ఆర్య ఒక మహిళ పరువుకు భంగం కలిగించిన వ్యక్తికి విచిత్రమైన బెయిల్ షరతు విధించి వార్తల్లో నిలిచారు. నిందితుడు వేధించిన మహిళకు రాఖీ కట్టాలని ఆదేశించారు. రక్షా బంధన్ రోజు నిందితుడు బాధితురాలి ఇంటికి రక్షాబంధన్ , స్వీట్ బాక్స్ వెళ్లాలని హుకుం జారీ చేశారు. తద్వారా బాధితురాలు తనకు సోదరీ అవుతుంది. తన సోదరిని ఎల్లవేళలా రక్షించాలని అన్నారు.
ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి, బెయిల్ షరతులపై తీవ్రంగా ఆక్షేపించింది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో బెయిల్ పిటిషన్లను విచారించేటప్పుడు కింది కోర్టులు తమను అనుసరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జస్టిస్ (రిటైర్డ్) ఆర్య ఎవరు?
జస్టిస్ (రిటైర్డ్) ఆర్య 1962లో జన్మించారు. అతను 1984లో న్యాయవాదిగా నమోదు చేసుకుని, 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా మారారు. ఆర్య ఎక్కువగా సివిల్, కమర్షియల్, అడ్మినిస్ట్రేటివ్, సర్వీస్, లేబర్, టాక్స్ చట్టాలు, ఆర్బిట్రేషన్ కేసులపై పట్టు సాధించారు. అతని ఖాతాదారులలో కేంద్రం, SBI, BSNL, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆదాయపు పన్ను శాఖ ఉన్నాయి. 2013లో హైకోర్టు న్యాయమూర్తి అయిన ఆయన 2015లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి.. ఈ ఏడాది ఏప్రిల్ 27న పదవీ విరమణ చేశారు