జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఇద్దరు ఉగ్రవాదులు గుర్తించిన భద్రతా దళాలు;
By : Chepyala Praveen
Update: 2025-05-13 14:38 GMT
జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాద కలకలం రేగింది. దక్షిణ కాశ్మీర్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతమయ్యారని సమాచారం. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తిరుగుతున్నారనే సమాచారం మేరకు భద్రతా దళాల కూంబింగ్ చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు.
దీనితో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. దాదాపు నాలుగు గంటల పాటు సైనికులు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. చనిపోయిన వారిని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ ఏ తయ్యిబాకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. వీరు పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడిన వారు కాదని తేలింది.
అటవీ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు తిరుగుతున్నారని వచ్చిన సమాచారం మేరకు కుల్గాం జిల్లాలోకి భద్రతా బలగాలను మోహరించారు. తరువాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమయ్యాక ఉగ్రవాదులు పారిపోయేందుకు ప్రయత్నించి షోపియాన్ జిల్లాలోకి ప్రవేశించారు.
వారు ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టిన మన బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో మన బలగాలు కూడా ఎదురుదాడికి దిగి ముగ్గురు తీవ్రవాదులని మట్టుబెట్టాయి. దీనికి ‘‘ఆపరేషన్ కెల్లర్ (Operation Keller) అని పేరు పెట్టారు.
చనిపోయిన వారిలో ఉగ్రవాదుల్లో ఒకడు షఫీ అని గత ఏడాది స్థానికేతర కార్మికుడిని చంపినట్లు భద్రతా సంస్థలు తెలిపాయి. మరో ఉగ్రవాది షాహిద్ అని కశ్మీర్ లోని హీరాపుర్ ప్రాంతంలో బీజేపీ నాయకుడిని హత్య చేయడంలో ఇతడి ప్రమేయం ఉందని తెలిపాయి. మరో ఉగ్రవాది ఎవరిని భద్రత దళాలు ఆరా తీస్తున్నాయి.
పహల్గాం ఉగ్రవాదుల ఆచూకీ చెప్తే 20 లక్షలు..
పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఆచూకీ చెప్తే రూ. 20 లక్షలు ఇస్తామని సైన్యం జమ్మూకశ్మీర్ ప్రాంతంలో పోస్టర్లు ఏర్పాటు చేసింది. ఈ పోస్టర్లపై ‘టెర్రర్ ఫ్రీ కశ్మీర్’ అని సందేశం ఉంది. వీరి గురించి ఎవరైన సమాచారం అందిస్తే వారికి భారీ మొత్తంలో నజరానా ఇవ్వడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో వారి వివరాలు బయటకు ఇవ్వమని వెల్లడించింది.
బైసారన్ గడ్డి మైదానంలో జరిగిన ఘోరమైన కలిలో ఉగ్రవాదులు 26 మంది సామాన్య ప్రజలను మతం అడిగి మరీ కాల్చి పారేశారు. ఈ ఘటనతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మే 7 న ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులకు పాల్పడింది. వంద మంది ఉగ్రవాదులను హతం చేసింది. తరువాత పాక్ దళాలు రావడంతో వారిపై కూడా భారత దళాలు విరుచుకుపడ్డాయి. పాక్ లోని ఎయిర్ బేస్ లు, రాడార్ల వ్యవస్థలను కూల్చివేశారు.