‘‘ఆల్ ఈజ్ వెల్’’
‘‘మహాయుతి కూటమిలో ఎలాంటి చీలికలు లేవు. దేవేంద్రతో బేధాభిప్రాయాలు లేవు’’- మహా డిప్యూటీ సీఎం షిండే..;
మహారాష్ట్ర(Maharashtra) సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis)తో తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) మరోసారి స్పష్టం చేశారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ఫడ్నవీస్ గౌరవిస్తున్నట్లు.. వినాయక చవితి చివరి రోజు గణేష్‌కు పూజ చేస్తున్నట్లు శనివారం (సెప్టెంబర్ 6) పత్రికల్లో ప్రకటనలు వచ్చాయి. రెండు ప్రకటనల దిగువన మరాఠీలో "దేవభావు" అని రాసి ఉంది. కాని వాటిని ఎవరు స్పాన్సర్ చేశారో బయటకు రాలేదు.
థానేలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి షిండే ఓ విలేఖరి.. ‘‘ఈ ప్రకటనలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముఖ్యమంత్రి తనను తాను మరాఠా రిజర్వేషన్ల రూపశిల్పిగా చూపించుకోవడానికి చేసిన ప్రయత్నమా? అని అడిగారు.
"మరాఠా సమాజమయినా లేదా ఇతర వెనుకబడిన తరగతులు (OBC) సమాజమయినా వారికి న్యాయం చేసే పని మహాయుతి ప్రభుత్వం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో హామీ కూడా ఇచ్చాం. దేవేంద్రజీ, నేను ఒక జట్టుగా మా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాం. రాష్ట్ర అభివృద్ధి, పేదలకు సహాయం చేయడమే అజెండాగా ముందుకు సాగుతున్నాం" అని చెప్పారు.
ముంబైని కుదిపేసిన జరంగే దీక్ష..
మరాఠా రిజర్వేషన్ల అంశం ఇటీవల మహారాష్ట్రను మరోసారి కుదిపేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మరాఠాల తరుపున మనోజ్ జరంగే ముంబైలో ఐదు రోజుల నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
ఆగస్టు 29న నిరసన ప్రారంభించి, మహాయుతి ప్రభుత్వం జరంగే డిమాండ్లకు అంగీకరించాక సెప్టెంబర్ 2న దీక్ష విరమించారు.
షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..
2022 మధ్యలో శివసేనలో తిరుగుబాటుకు దారితీసిన తర్వాత ఫడ్నవీస్ షిండేకు డిప్యూటీగా పనిచేశారు. ఈ తిరుగుబాటులో శివసేన విడిపోయి, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మాజీ మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది. తిరిగి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి అఖండ విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. పాలక మహాయుతి కూటమిలో బీజేపీ, షిండే సేనతో పాటు, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నాయి.