‘యూపీవాసులు బీహార్‌లో ఓటర్లా?’

ఈసీని ప్రశ్నించిన భారత కూటమి నేతలు..;

Update: 2025-08-27 06:56 GMT
Click the Play button to listen to article

ఎలక్షన్ కమిషన్‌(EC)పై I.N.D.I.A కూటమి మరోసారి ఆరోపణలు గుప్పించింది. ఉత్తరప్రదేశ్‌(UP)కు చెందిన 5వేల మంది బీహార్‌(Bihar) పొరుగు జిల్లా పశ్చిమ చంపారన్ జిల్లాలోని వాల్మీకి నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు అయ్యారని కాంగ్రెస్(Congress) జాతీయ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా, రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మనోజ్ కుమార్ ఝా ఆరోపించారు. మంగళవారం (ఆగస్టు 26) వారు మధుబని జిల్లాలోని ఫుల్‌పరాస్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

అయితే ఈ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. అదే సమయంలో.. "ఇది ఆగస్టు 1న మేం ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా. తుది ఓటర్ల జాబితా కాదు. నకిలీలు, అభ్యంతరాలను ఆహ్వానించడమే ముసాయిదా ఓటరు జాబితా ఉద్దేశ్యం. అనుమానాస్పద ఓటర్ల గురించి మరిన్ని వివరాలు లేదా ఆధారాలు ఇస్తే పరిశీలిస్తాం. వాల్మీకి నగర్‌లో నదుల గమనంలో మార్పు కారణంగా.. ప్రజలు తమ చిరునామాను మార్చుకోవలసి వస్తుంది. ఫలితంగా ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో నమోదై ఉండవచ్చు. అలాంటి ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా S.I.R చేపట్టాం,’’ అని సమాధానమిచ్చింది ఈసీ.

బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. SIRను వ్యతిరేకిస్తూ లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే రాష్ట్రంలో ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’ చేపట్టిన విషయం విధితమే.

Tags:    

Similar News