ప్రియాంక నామినేషన్ దాఖలుకు డేట్ ఫిక్స్..
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ ఉప ఎన్నికకు బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరవుతారని సమాచారం. నామినేషన్ దాఖలుకు ముందు ప్రియాంక సోమవారం ఢిల్లీలో పార్టీ చీఫ్ ఖర్గేతో సమావేశమై ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు వయనాడ్ కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్‌షో నిర్వహిస్తారు. అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ ఎదుట ప్రియాక నామినేషన్ దాఖలు చేస్తారు.
గెలిస్తే పార్లమెంటులో అడుగుపెట్టడం ఇదే తొలిసారి..
గత వారం వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికల సంఘం (EC) షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే తమ అభ్యర్థిగా AICC ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (52)ని కాంగ్రెస్ ప్రకటించింది. ఒకవేళ ఎన్నికైతే ప్రియాంక గాంధీ ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఇప్పటికే సోనియా గాంధీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రాహుల్ లోక్‌సభ ప్రతిపక్షనేతగా కొనసాగుతున్నారు. ప్రియాంక గెలిస్తే ముగ్గురు గాంధీ కుటుంబ సభ్యులు పార్లమెంటుకు రావడం కూడా ఇదే తొలిసారి అవుతుంది.
లోక్‌సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందారు. నిబంధనలు ప్రకారం ఒక స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండడంతో ఆయన వయనాడ్‌ను వదులుకున్నారు. దాంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
జూన్‌లో వయనాడ్ ఉపఎన్నికకు తన పేరును ప్రకటించిన తర్వాత ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. "నాకు అస్సలు భయం లేదు.వయనాడ్‌కు ప్రాతినిథ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన (రాహుల్ గాంధీ) లేకపోవడంతో నేను కష్టపడి పని చేస్తాను. అందరినీ సంతోషపెట్టడానికి, మంచి ప్రతినిధిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాను." అని చెప్పారు.
హర్యానాలో ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ ప్రియాంక గాంధీని ప్రత్యక్ష పోరుకు సిద్ధం చేసింది. కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్‌గా పేరున్న ప్రియాంక త్వరలో జరిగే జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలలో కూడా ప్రచారం చేయాల్సి రావచ్చు. వాటితో పాటు వయనాడ్‌లోనూ ప్రచారం చేసుకోగలరా? అన్నది వేచిచూడాలి.