యూపీలో బీజేపీ వెనకబడటానికి కారణాలివే..
అయోధ్య రామాలయం ఉన్న అమేథీ, ఫైజాబాద్ నియోజకవర్గాలలోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడంతో ఓటమికి కారణాలను తెలుసుకునేందుకు 40 వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు.
ఈ ఏడాది ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. దీనిపై పార్టీ నాయకులు లోతైన విశ్లేషణ చేశారు. సీట్లు తగ్గడానికి ఆరు ప్రధాన కారణాలపై నివేదిక తయారుచేసి పార్టీ అధిష్టానానికి పంపారు.
అయోధ్య రామాలయం ఉన్న అమేథీ, ఫైజాబాద్ కీలక నియోజకవర్గాలలోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడంతో ఓటమికి కారణాలను తెలుసుకునేందుకు 40 వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు.
ఆరు ప్రధాన కారణాలివే..
1. లీకేజీలు.. రిజర్వేషన్లు
గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో కనీసం 15 పేపర్ లీకేజీలు జరిగాయని ఓ పార్టీ నేత పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం కూడా మరో కారణమని ఇంకొకరు ఎత్తిచూపారు. రిజర్వేషన్ విధానాలకు వ్యతిరేకంగా పార్టీ నేతలు చేసిన ప్రకటనలు పరిస్థితిని మరింత దిగజార్చాయి.
2. కార్యకర్తలతో సత్సంబంధాలు కొరవడడం..
ఆర్‌ఎస్‌ఎస్ - బీజేపీ కార్యకర్తలు ఏళ్ల తరబడి ఏర్పాటు చేసుకున్న బలమైన సంబంధాలను పార్టీ కోల్పోతోంది. ఇక నుంచి కార్యకర్తలను పార్టీ గౌరవంగా చూడాలని నివేదిక కోరింది. పాత పెన్షన్ విధానం, అగ్నివీర్, పేపర్ లీక్స్, తదితర ప్రజా సమస్యలను ప్రతిపక్షాలు సమర్ధవంతంగా ఎత్తి చూపాయని రాష్ట్ర శాఖ తన నివేదికలో పేర్కొంది.
3. తగ్గిన ఓటుబ్యాంకు..
కుర్మీ, మౌర్య వర్గాలకు చెందిన ఠాకూర్, యాదవ్ ఓటు బ్యాంకు తగ్గిపోవడం, మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ (BSP)కి ఓట్‌షేర్ తగ్గడంతో కాంగ్రెస్ మెరుగైన పనితీరు కనపరిచిందని నివేదిక పేర్కొంది.
4. పుంజుకున్న ఎస్పీ..
లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్ష భారత కూటమికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాలకు 43 స్థానాలను కైవసం చేసుకోగా, NDA 36 స్థానాలను దక్కించుకుంది. 2019 ఎన్నికలలో 64 స్థానాలను బీజేపీ గెలుపొందగా.. సమాజ్ వాదీ పార్టీ మాత్రమే 37 స్థానాలను కైవసం చేసుకుంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓటమికి ఆయనే కారణమని ఆయన మద్దతుదారులు అంగీకరించడానికి నిరాకరించారు. పరిపాలన, శాంతిభద్రతల పరిరక్షణపై యోగి దృష్టి పెట్టడం వల్లే రాష్ట్రంలో బీజేపీ తన పట్టును కొనసాగించగలిగిందని వారి అభిప్రాయం.
5. అంతర్గత కలహాలు
లక్నోలో జూలై 14న ఆదిత్యనాథ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. చర్చల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. "బిజెపి తన అతి విశ్వాసానికి మూల్యం చెల్లించుకుంది" అని ఆయన చెప్పగా, అతని డిప్యూటీ కేశవ్ మౌర్య "ప్రభుత్వం కంటే సంస్థ పెద్దది" అని అన్నారు. “బీజేపీలో ప్రభుత్వం కంటే సంస్థ ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుంది. కాబట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ పార్టీ కార్యకర్తలను గౌరవించి వారి గౌరవాన్ని కాపాడుకోవాలి. నేను ముందుగా పార్టీ కార్యకర్తను, ఆ తర్వాత డిప్యూటీ సీఎంను’’ అని మౌర్య సీఎంనుద్దేశించి అన్నారు.
6. ఉప ఎన్నికలలో గెలుపు కోసం..
రానున్న ఉప ఎన్నికల నేపథ్యంలో విభేదాలను పరిష్కరించుకుని గెలుపుపై దృష్టి పెట్టాలని పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతలకు సూచించినట్లు సమాచారం.