ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం, మరో ఆరుగురు కూడా..
‘‘పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా మహిళలకు రూ. 2,500 గౌరవభత్యాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జమ చేస్తాం’’ - రేఖా గుప్తా;
ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM)గా రేఖా గుప్తా(Rekha Gupta)తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పర్మేష్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ఉన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు.
రేఖాకు Z కాటగిరీ సెక్యూరిటీ ..
రేఖా గుప్తాకు ఢిల్లీ పోలీసులు జడ్ కాటగిరీ భద్రత కల్పించారు. ఇక నుంచి ఆమెకు రక్షణగా 22 మంది పోలీసు సిబ్బంది ఉంటారు. వీరిలో వ్యక్తిగత భద్రతా అధికారులు (PSOs), ఎస్కార్ట్, నిఘా సిబ్బంది, అలాగే ఎనిమిది మంది సాయుధ గార్డులు ఉంటారు. అత్యంత ప్రాముఖ్యత గల రాజకీయ నాయకులకు మాత్రమే ఈ రక్షణ కల్పిస్తారు. గతంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీకి కూడా ఈ తరహా భద్రతే కల్పించారు.
మార్చి 8న నాటికి మహిళల ఖాతాల్లో జమ..
పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా మహిళలకు రూ. 2,500 గౌరవభత్యాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8న) నాటికి అమలు చేస్తామని రేఖా గుప్తా హామీ ఇచ్చారు. ఇక AAP ప్రభుత్వ హయాంలో అమలైన ఉచిత విద్యుత్ (200 యూనిట్ల వరకు), ఉచిత నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతాయని చెప్పారు. ‘ఆయుష్మాన్ భారత్’ ఆరోగ్య బీమా పథకాన్ని ఢిల్లీలో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మొహల్లా క్లినిక్‌లను పునరుద్ధరించడమే కాకుండా.. రోగులకు మెరుగైన సేవలు అందించేలా తీర్చిదిద్దుతామన్నారు. యమునా నది శుద్దీకరణలో భాగంగా ఇప్పటికే 57 కిలోమీటర్ల పొడవునా నదిని శుభ్రపరిచేందుకు ట్రాష్ స్కిమ్మర్లు, వీడ్ హార్వెస్టర్లు, డ్రెడ్జర్లు ఉపయోగిస్తున్నామని చెప్పారు.
ఢిల్లీ రోడ్లను, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. కాలుష్య నియంత్రణ కూడా బీజేపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్. ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా ఉంది. EV విధానాన్ని నవీకరించడం, కాలుష్య నియంత్రణ కోసం సమర్థమైన చర్యలు తీసుకోవడం బీజేపీ ముందున్న అసలు సవాళ్లు.
‘‘అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో పూర్తిచేస్తా’’- పర్వేష్ వర్మ
ఢిల్లీకి తానే సీఎం అవుతానని భావించారు పర్వేష్ వర్మ(Parvesh Verma). ఆయన తండ్రి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కావడం, చాలాఏళ్లుగా పార్టీకి విధేయులుగా ఉండడంతో చాలామంది అలాగే అనుకున్నారు. కాని బీజేపీ అధిష్టానం మహిళను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. దీనిపై పర్మేష్ వర్మ స్పందించారు. తాను పార్టీకి కట్టుబడి ఉండే పనిచేసే కార్యకర్తనని, పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని చెప్పుకొచ్చారు.
"నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. బీజేపీలో చివరి వరకు కొనసాగుతా. పార్టీ మా నాన్నను ఢిల్లీ ముఖ్యమంత్రిని చేసింది. కేంద్రమంత్రిని చేసింది. చివరి వరకూ ఆయన పార్టీకి సేవలందించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తా’’ అని చెప్పారు.
బీజేపీ కార్యకర్తల కృషి వల్ల ఈ విజయం సాధ్యమైంది. 26 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఢిల్లీకి అందమైన రాజధానిగా తీర్చిదిద్దడం మా లక్ష్యం," అని అన్నారు పర్వేష్.