‘మతపర ప్రదేశాల పవిత్రతను కాపాడాలి’

తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Update: 2024-09-21 11:32 GMT

తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ చీఫ్ దిగజారుడు ఆరోపణలు చేస్తున్నాడని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు అటుంచితే..తిరుమల పవిత్రతను కాపాడాలన్నది ప్రతి హిందువు మాట. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఇదే చెప్పారు. దేశంలో మతపర ప్రదేశాల పవిత్రతను కాపాడాలంటూనే.. లడ్డూను అపవిత్రం చేశారన్నది వాస్తవమయితే, పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను శిక్షించాలని సూచించారు. కోట్ల మంది భక్తుల విశ్వాసంతో ఆడుకునే వారిని క్షమించకూడదని ఎక్స్‌లో పేర్కొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు గుజరాత్‌లోని పశువుల ల్యాబొరేటరీ నిర్ధారించిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నెయ్యిలో పందికొవ్వు, చేప నూనె ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ లడ్డూల తయారీకి బీఫ్ ఫ్యాట్, చేప నూనె, పందికొవ్వును వాడినట్లు ల్యాబ్ రిపోర్టులో స్పష్టంగా తేలిందని చెప్పారు.

రాజకీయ మైలేజీ కోసమే తిరుపతి లడ్డూలపై నాయుడు అపవిత్ర ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ బి. కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న వివరాలు పంపిస్తే విచారణకు ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబుకు తెలిపారు. హిందూ విశ్వాసాల పట్ల ఇది కుట్ర, ద్రోహం, క్షమించరాని నేరమంటూ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, గిరిరాజ్‌ సింగ్‌, బండి సంజయ్‌, పలువురు ఎన్డీయే, బీజేపీ జాతీయ నేతలు తీవ్రంగా స్పందించారు.

Tags:    

Similar News