ధర్మస్థల కేసు: ఎఫ్ఐఆర్ లేకుండా శవాన్ని ఖననం చేశారు
సిట్ ముందు కొత్త సాక్షి వాంగ్మూలం;
By : The Federal
Update: 2025-08-03 09:26 GMT
ధర్మస్థలం సామూహిక ఖననం కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలోని ఇచ్లంపడి గ్రామానికి చెందిన రెండో సాక్షి శనివారం బెల్తాంగడిలో సిట్ ముందు ఒక కేసు విషయాన్ని వివరించారు.
15 సంవత్సరాల క్రితం 13 నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న టీనేజ్ బాలిక మృతదేహాన్ని తాను చూశానని చెప్పారు. సాక్షి పేరు టీ. జయంత్ అని తెలిసింది. ఆ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని, వారం తరువాత ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు వివరించాడు.
తన ఫిర్యాదు తరువాత మృతదేహాన్ని ఖననం చేసినప్పటికీ పోస్ట్ మార్టం మాత్రం నిర్వహించలేదని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని సిట్ ముందు చెప్పారు.
‘‘హత్య కేసును కప్పిపుచ్చారు’’ అని జాతీయ మీడియాకు చెప్పారు. మృతదేహాన్ని ఎక్కడ ఖననం చేశారో తాను సిట్ కు చూపించగలనని పేర్కొన్నారు. సిట్ కు వాంగ్మూలం ఇచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు. ధర్మస్థలలో చట్టవిరుద్దంగా జరిగిన అనేక ఖననాల గురించి తనకు ప్రత్యక్షంగా తెలుసని జయంత్ పేర్కొన్నాడు.
స్థానికులకు హత్యల గురించి తెలుసు..
వివిధ ప్రదేశాలలో జరిగిన ఈ ఖనన కార్యకలాపాల గురించి తాను గమనించానని, తన ప్రకటనలు మరిన్ని సమాధుల స్థలాలను వెలికి తీయడానికి సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ హత్యల గురించి తనకు మాత్రమే కాకుండా, అనేక మంది స్థానికులకు కూడా తెలుసని, కానీ భయంతో ఎవరూ ముందుకు రావట్లేదని అన్నారు.
‘‘ఇక్కడి భయానక వాతావరణం వల్ల ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఆ భయాన్ని తొలగించింది. ఇప్పుడు నాకు సిట్ పై నమ్మకముంది. అందుకే నేను నా ఫిర్యాదును ఇచ్చాను’’ అని జయంత్ అన్నారు.
ఈ కేసుకు సంబంధించి తన కుటుంబానికి చెందిన పద్మలత అనే అమ్మాయిని కూడా దర్యాప్తు చేయాలని సిట్ ను అభ్యర్థించాడు. ఆ టీనేజ్ బాలిక మరణానికి ఆమె కూడా ఒక సాక్షి అని అతను చెప్పాడు. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ధర్మస్థల లోని నేత్రావతి నదీ ఒడ్డున అనేక ప్రదేశాలలో సిట్ దర్యాప్తును చేపడుతున్న తరుణంలో ఈ వ్యక్తి వచ్చి మరో ఫిర్యాదు చేశాడు.
గతంలో జరిగిన తవ్వకాల్లో కేవలం ఒకే ఒక అస్థిపంజరం లభించింది. మిగిలిన ప్రదేశాలలో ఎటువంటి అవశేషాలు లభించలేదు. అలాగే తొమ్మిది, పదో ప్రదేశంలో కూడా ఫలితాలు నెగటివ్ గా వచ్చాయి. ఉజిరే- ధర్మస్థల- కొక్కడ హైవే పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో నేత్రావదీ నదీ ఒడ్డున మొత్తం 15 ప్రదేశాలను సిట్ గుర్తించింది.
నిన్నటి వరకూ ఎనిమిది ప్రదేశాలలో తవ్వకాలు జరిగాయి. అలాగే గురువారం నాడు ఆరో సైట్ లో అస్థిపంజరం లభించింది కానీ పుర్రే లేదు. ఫొరెన్సిక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అవి పురుషుల శరీర భాగాలు.
ఈ ఘటన జరిగిన తరువాత అటవీ ప్రాంతాలలో భద్రత పెంచారు. ముఖ్యంగా సైట్ నెంబర్ 6 లో మూడు వరుసల్లో భద్రత పెరిగింది. అటవీ, రెవిన్యూ, ఫొరెన్సిక్ విభాగాలు ఆపరేషన్ లో పాల్గొన్నాయి. తవ్వకం జరిగే ప్రదేశాలో సెల్ ఫోన్ లకు అనుమతి ఇవ్వలేదు. కేవలం ఉన్నత స్థాయి అధికారులు మాత్రమే వీటిని వాడుతున్నారు.
పోలీసును ప్రశ్నించనున్న సిట్
ఈ కేసులో ఫిర్యాదుదారుడిని బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారిని సిట్ విచారించబోతోంది. ఈ కేసును సిట్ కు అప్పగించే ముందు ఆ అధికారి సిట్ లో భాగంగా ఉన్నాడు. ఆయన పేరు మంజునాథ గౌడ అని తేలింది.
పోలీసుల కథనం ప్రకారం గౌడ తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని బలవంతం చేసే విధంగా ప్రయత్నించాడు. ఫిర్యాదుదారుడిని మానసికంగా ఫిట్ గా లేడనే విధంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. ఫిర్యాదుదారు తరఫున వాదించే న్యాయవాదీ సైతం మంజునాథ్ పై ఫిర్యాదు చేశాడు.
ప్రస్తుతం తవ్వకాలను వేగంగా కొనసాగించడానికి సిట్ కు రోజువారీ వేతనాలు, యంత్రాలు ప్రభుత్వం అలాట్ చేసింది. కొన్ని ప్రదేశాలలో లోతుగా తవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
సైట్ నెంబర్ 6 నుంచి స్వాధీనం చేసుకున్న అస్థిపంజరాలను ఫొరెన్సిక్ విశ్లేషణకు పంపారు. మిగిలిన ప్రదేశాల నుంచి ఎలాంటి అవశేషాలు లభించలేదు. అయితే మంగళవారం జరిపిన తవ్వకాలలో ఒక పురుషుడి పేరున్న పాన్, ఒక మహిళ పేరున్న డెబిట్ కార్డు స్వాధీనం చేసుకున్నారు.
ఆ డెబిట్ కార్డు బెంగళూర్ సమీపంలోని నేలమంగళవాసి అయిన సిద లక్ష్మమ్మ అనే మహిళకు చెందిందని, పాన్ కార్డు ఆమె కుమారుడు సురేష్ కు చెందిందని తెలిసింది. అతను మద్యపానానికి బానిసై మరణించినట్లు దర్యాప్తులో గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్ ఐదుసంవత్సరాల క్రితం ధర్మస్థలకు వచ్చినప్పుడూ వీటిని పొగొట్టుకున్నాడు. ఇవి తరువాత నేత్రావతి ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు.
అనామక ఫిర్యాదు..
గత రెండు దశాబ్ధాలుగా ధర్మస్థలలో సామూహిక హత్యలు, అత్యాచారాలు, అక్రమ ఖననాలు జరిగాయని ఆరోపణలు వెలువడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. గుర్తు తెలియని ఫిర్యాదుదారుడు, మాజీ పారిశుద్య కార్మికుడు అతని గుర్తింపు ప్రభుత్వం బయటపెట్టలేదు.
అతను 1995- 2014 మధ్య ధర్మస్థలలో ఉద్యోగం చేస్తున్నానని పేర్కొన్నాడు. మహిళలు, మైనర్ల మృతదేహాలతో సహ అనేక మృత దేహాలను ఖననం చేయమని తనను బలవంతం చేశారని అతను ఆరోపించాడు. వాటిలో కొన్ని లైంగిక వేధింపుల సంకేతాలు ఉన్నాయి. ఈ వాదనలకు సంబంధించి అతను మేజిస్టేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.