'పులి'వెందులలో టీడీపీది 'కేకేనా'.. జగన్ తీరే కారణమా?

'వైనాట్ పులివెందుల'కు ఇదే సంకేతం అంటున్న మంత్రి సవిత.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-14 07:24 GMT

కడప జిల్లా పులివెందులలో మొదటిసారి టీడీపీ జెండా ఎగరవేసింది. వార్ వన్ సైడ్ అన్నట్లు జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా వైఎస్. జగన్ కు గట్టి సవాల్ విసిరినట్టు భావిస్తున్నారు.

పులివెందుల జెడ్పీటీసీ స్ధానం నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి 6.716 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే దక్కాయి.
పులివెందులకు స్వేచ్ఛ
"ఈ విజయం అద్భుతం. ఓటర్ల చైతన్యానికి నిదర్శనం" అని జెడ్పీటీసీ విజేత లతారెడ్డి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించింది" అని జిల్లా ఇన్ చార్జి మంత్రి ఎస్. సవితమ్మ అభివర్ణించారు.
రానున్నఎన్నికల్లో "వైనాట్ పులివెందుల" అనేది నిరూపించడానికి ఇదే నిదర్శనం అని మంత్రి ఎస్. సవితమ్మ హెచ్చరించారు. ఈ ఎన్నికల నేపథ్యంలో
కడప జిల్లా పులివెందులలో రాజకీయం తిరగబడిందా? వైఎస్. జగన్ కు ఎదురుగాలి ప్రారంభమైందా? క్యాడర్, నేతలను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలు ఆయన స్వయంకృతమే అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ ఎదురు దెబ్బలకు పులివెందుల ప్రాంతంలో కార్యకర్తలు నేతలను పట్టించుకోకపోవడం కూడా కారణంగా భావిస్తున్నారు. అందువల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఆకేపాటి అమరనాథరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీని పరిధిలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇరగంరెడ్డి వెంకటసుబ్బారెడ్డికి 4,632 ఓట్లు దక్కాయి. వైసీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి 1,212 ఓట్లు దక్కాయి. దీంతో ఐదు వేల ఓట్లకు పైగానే టీడీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి వెంకటసుబ్బారెడ్డి విజయం సాధించారు. ఇది వైసీపీ నేతలకు ఊహించని చెంపదెబ్బగా భావిస్తున్నారు.
అంతర్మధనం
పులివెందుల జెడ్పిటిసి ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలను బేరీజు వేసిన పరిశీలకులు ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా ఓటర్లు మాత్రమే కాదు. చివరికి జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమంత్ కుమార్ రెడ్డి కూడా తన ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత చరిత్ర గుర్తుచేసుకుంటున్న వైఎస్సార్ అభిమానులు, పులివెందుల ప్రజలు మధన పడిపోతున్నారు.
ఈ ఎన్నికపై కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి స్పందించారు.
" ఇది అనైతిక ఎన్నిక. కార్యకర్తలు నిరుత్సాహ పడవద్దు" అని ఎంపీ అవానాష్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు.
"మాకు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. కానీ, ఈ తరహాలో ఏకపక్షం పోలింగ్ ఉండదు" అని ఆయన అన్నారు.
వైఎస్ఆర్ కాలంలో..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్. రాజారెడ్డి కాలం నాటి పరిస్థితితో బేరీజు వేయలేం అనేది సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసులురెడ్డి అభిప్రాయపడ్డారు.
1972 నుంచి పులివెందుల నియోజకవర్గంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులదే రాజకీయ ఆదిపత్యం నడిచింది. ఈ ప్రాంత రాజకీయం మొత్తం వారి కుటుంబం చుట్టూనే పరిభ్రమించింది. ఇదంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే వరకే.
"అనుకున్నదే తడవుగా వైఎస్ఆర్ ను సామాన్యుడు కూడా వెళ్లి స్వయంగా కలిసేవారు. వారి పని చేయడంతో పాటు దారి ఖర్చులకు కూడా డబ్బు ఇచ్చి పంపే వారు" అని శ్రీనివాసులు రెడ్డి గుర్తు చేసుకున్నారు.
"సీఎంగా ఉన్నప్పుడు వైఎస్. జగన్ ను తాడేపల్లిలో కాదు. కనీసం పులివెందులకు వచ్చినప్పుడు కలవాలన్నా ఇబ్బంది పడ్డారు" అని మరో వైసీపీ నేతే గుర్తు చేశారు.
తొలినాళ్లలో
వైఎస్. రాజశేఖరరెడ్డి మరణించే నాటికి జగన్ కడప ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేశారు. పులివెందల ఎమ్మెల్యేగా ఉన్న వైఎస్ విజయమ్మ కూడా పదవిని త్యజించారు. మళ్లీ కడప ఎంపీగా జగన్, పులివెందుల నుంచి వైఎస్సార్ భార్య వైఎస్ విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసి అద్వితీయమైన మెజారిటీ సాధించారు.
వైఎస్సార్సీపి ఆవిర్భావం
విభజిత రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ఏర్పాటు చేసుకున్న వైఎస్ జగన్ 2014 ఎన్నికల్లో బరిలోకి దిగారు. 67 సీట్లతో జగన్ ప్రతిపక్షానికే పరిమితమయ్యారు.
2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు సాధించిన వైసీపీ నుంచి జగన్ సీఎం అయ్యారు. దీనికి వైఎస్సార్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతలు, జగన్ అభిమానించే యువత అండగా నిలిచింది. ఆ తరువాత సీన్ మారింది. వైఎస్. జగన్ చుట్టూ చేరిన కోటరి వల్ల ద్వితీయ శ్రేణి నాయకులకు దూరమయ్యారనే అపవాది ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని పక్కన ఉంచితే,
భంగపడిన నేతలు
పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్ కుటుంబానికి ఉన్న ఆదరణ చాలా ఎక్కువ. జెడ్పిటిసి పదవులతోపాటు, ఎంపీపీలు పులివెందుల మున్సిపాలిటీని వైసీపీ దక్కించుకుంది. వైసిపి అధికారంలో ఉండగా పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కౌన్సిలర్ల తోపాటు నియోజకవర్గంలో వైసిపి నాయకులు కోట్ల రూపాయలు వెచ్చించి కాంట్రాక్టు పనులు చేశారు.
వైసిపి అధికారంలో ఉండగా వారందరికీ బిల్లుల చెల్లింపులకు నిధుల కొరత వెంటాడింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోనే కాకుండా ప్రత్యేకంగా పులివెందులలో కూడా అభివృద్ధి పనులు చేసిన పార్టీ నేతలు, కాంట్రాక్టర్లకు సుమారు 400 కోట్ల వరకు బిల్లులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాంట్రాక్టు పనులు చేయడానికి చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించే భారం భరించడం వారికి ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు.
చేదు అనుభవం..
వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి పులివెందుల పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో మకాం వేశారు. బిల్లులు మంజూరు కాని స్థితిలో వడ్డీలు చెల్లించలేకున్నామని కౌన్సిలర్ల తోపాటు, నియోజకవర్గంలోని కొందరు నాయకులు కూడా జగన్ ను దాదాపు నిలదీసినంత పని చేశారు. అంతకుముందే జగన్ భార్య వైఎస్. భారతీరెడ్డిని కూడా కౌన్సిలర్లు, నాయకులు ప్రశ్నించిన వ్యవహారంపై మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిన విషయం.
వారికి సమాధానాలు చెప్పలేని స్థితిలో జగన్ తీవ్ర ఇబ్బంది పడినట్లు ఆయన సన్నిహితుల నుంచి తెలిసిన సమాచారం.
"మీరేం భయపడకండి. అవసరమైతే కోర్టుకు వెళదాం" అని జగన్ చేసిన సూచనను అప్పులు చేసి పనులు చేసిన కాంట్రాక్టర్లు జీర్ణించుకోలేకపోయారని తెలుస్తోంది.
వైసిపి అధికారంలో ఉండగానే పులివెందుల పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా జగన్ కలవడానికి నాయకులు విమర్శలు వచ్చాయి.
"పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తాం" అనే సూచనలను జీర్ణించుకోలేని నాయకులు జగన్ క్యాంప్ కార్యాలయం వైపు వెళ్లడం తగ్గించుకున్నట్లు ఆ ప్రాంత సీనియర్ జర్నలిస్టుల ద్వారా తెలిసిన సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు సీఎం జగన్, పులివెందులలో ద్వితీయ శ్రేణి క్యాడర్ నేతలను స్థానిక నాయకులు సరిగా పట్టించుకోలేదనే అపవాది కూడా వైసిపి నేతలపై ఉంది. ఇందులో పులివెందులలో కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి కోటరీ కింది స్థాయి నేతలు కూడా అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంతోనే జగన్ పై కినుక వహించినట్లు భావిస్తున్నారు. అది కాస్తా పీక్ స్టేజికి చేరినట్లు భావిస్తున్నారు. ఇదిలావుంటే..
వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరుగా నోరు పెగల్చడం ప్రారంభించారు. దీంతో వారందరినీ సముదాయించిన జగన్, తరచూ పులివెందుల పర్యటనకు రావడం ద్వారా పూర్వ స్థితిని మళ్లీ సాధించుకునే దిశగా సర్దుబాటు చర్యలకు దిగారు. ఆ ప్రయత్నాలు ఏవి ఫలితం ఇవ్వలేదని అంచనా వేస్తున్నారు.
ఆ ప్రభావమే ఇది
అధికారంలో ఉండగా చేసిన పొరబాట్ల కారణంగా పులివెందులలో వైఎస్ జగన్ పట్టు మెల్లగా సడలినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావం తాజాగా జరిగిన పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల పోలింగ్లో కనిపించినట్లు భావిస్తున్నారు. పులివెందుల ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ
"వైఎస్ రాజశేఖరరెడ్డి, అంతకుముందు రాజారెడ్డి కాలంతో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని పోల్చలేం" అని వ్యాఖ్యానించారు.
"గతంలో వైఎస్ కుటుంబంలోని వారు జనాలకు దగ్గరగా ఉండేవారు. జగన్ పరిస్థితి దీనికి విరుద్ధంగా మారింది" అని విశ్లేషించారు. దీనికి తోడు జగన్ బాబాయ్ కొడుకు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఆయన వెంట ఉండే వారి తీరు వల్ల చాలా మంది దగ్గరికి రావడం తగ్గించేశారని అంటున్నారు. ఈ పరిణామాలు టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వేసిన ఎత్తులు ఫలించినట్టు కనిపిస్తోంది.
అధికారం ఉంది కదా?
ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించడం అవసరం. వ్యక్తగత చరిష్మా ఉంటే మినహా ఉప ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టం అనేది రాజకీయ పరిశీలకులు చెప్పే మాట. లేదంటే, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం సర్వసాధారణం అనేది గుర్తు చేస్తున్నారు. అది అన్ని వేళలా పని చేయదనే విషయాన్ని కూడా గమనించాలి. అసంతృప్తి, అలకలు తీవ్ర స్థాయికి చేరిన సమయంలో ప్రభుత్వంలో ఉన్నా చేదు ఫలితాలు తప్పదు.
ఇదీ సాక్ష్యం...
వైఎస్ఆర్ మరణం తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ సమయంలో వైఎస్. జగన్ గట్టిగానే సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విబేధించి బయటికి వచ్చాక 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో వైసీపీ అభ్యర్థులుగా జగన్ తోసహా ఆయన వెంట వచ్చిన 15 మంది విజయం సాధించారు. ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే తగిలిందని చెప్పవచ్చు.
వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కడప జిల్లాలో కూడా గట్టి దెబ్బ తగిలింది. ఆ తరువాత నుంచి కూడా జగన్, ఆయన పార్టీ నేతల నోటి దురుసుకు ఏమాత్రం పదును తగ్గలేదు. అంటే ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదనే విషయంపై చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి హామీల అమలులో విఫలమై, మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆయన ప్రగాఢ నమ్మకం.
పులివెందులలో ఎదురైన అనుభవం ఓ శాంపిల్ గా భావించి, దిద్దుబాటు చర్యలు ప్రారంభిస్తారా? లేదంటే ఇదే దూకుడుతో సాగితే ఫలితం ఉంటుదని అనుకుంటారా? ఆయన అడుగులు ఏ ప్రస్ధానం వైపు సాగుతాయనే విషయంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని రాజకీయంగా చక్కగా వాడుకునేందుకు టీడీపీ కూటమి దృష్టి సారించిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.
Tags:    

Similar News