TTD| టీటీడీలో 500 మంది అన్యమతస్థులు?
టీటీడీలో తన్యమతస్తుల వివరాలు విజిలెన్స్ విభాగం సేకరిస్తోంది. దేశంలో మొదటిసారి టీడీపీ కూటమి ఈ సాహసం చేస్తోంది.
Byline : SSV Bhaskar Rao
Update: 2024-11-21 07:15 GMT
తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా హిందూత్వ అజెండా అమలు చేయాలని భావిస్తోంది. బీజేపీ, ఆ పార్టీ గొంతుకగా జనసేన కూడా మారింది. తాజాగా,
టీటీడీలో హిందూయేతరులను తప్పించాలనే బోర్డు నిర్ణయం దుమారం రేపింది. ఈ అంశం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం రాజకీయంగా టీడీపీకి శరాఘాతంగా మారుతుందా? ఎందుకంటే దళిత, గిరిజన సామాజిక వర్గాల్లో మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించమనే మాట చెబుతున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ పార్టీ, ప్రభుత్వం సాహసించలేదు. ఈ పరిస్థితుల్లో టీడీపీ కూటమి ముందుకే వెళుతుందా? పర్యవసనాలకు సిద్ధంగా ఉందా? ఇది టీడీపీ స్వీయ నిర్ణయమా? బీజేపీ ప్రేరేపితమా?\
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో వందల సంఖ్యలో హిందూయేతర ఉద్యోగులు ఉన్నట్లు ప్రాధమికంగా తేల్చారు. వారిని తరలించడం సాధ్యమా? మున్ముందు ఎదురయ్యే న్యాయ వివాదాలను ఎలా ఎదుర్కొంటారు? ఇలాంటి ప్రశ్నలెన్నో తెరమీదకి వచ్చాయి.
ఎంతమంది ఉన్నారు?
టీటీడీలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య గత పదేళ్ల కాలంలో 15 వేల నుంచి గణనీయంగా తగ్గిపోయింది. ఉద్యోగవిరమణ చేసిన వారి స్థానంలో ఖాళీలు భర్తీ చేయలేదు. ప్రస్తుతం 6,600 మంది మాత్రమే పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. మిగతా 1,800 మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, సొసైటీలు, మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న వారే పనిచేస్తున్నారు. వారిలో సాధారణ సిబ్బందితో పాటు సెక్యూరిటీ, పారిశుద్ధ్య కార్మికులు, అన్నదాన సత్రంలో పనిచేస్తున్నారు. కాగా,
టీటీడీలో ఇప్పటివరకు పదుల సంఖ్యలో మాత్రమే హిందూయేతరులు ఉన్నారని భావించారు. ఆ సంఖ్య 500 మందికి పైగానే ఉంటుందని అంచనా. టీటీడీ విజిలెన్స్ విభాగం, ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా ఆ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. వారం, పది రోజుల్లో ఆ నివేదిక టీటీడీ ఉన్నతాధికారులకు సమర్పించే అవకాశం ఉంది. దీనిపై
టీటీడీ చైర్మన్ మాటలు స్పష్టత ఇచ్చారు
"సుమారు 300 మంది వరకు హిందూయేతరులు ఉన్నారు. ఇది ప్రాధమిక సమాచారం. నా దగ్గర లిస్టు ఉంది" అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. "చివరికి ఎస్వీబీసీ (Sree Venkateswara Bhakti Channeel- SVBC) లో కూడా ఉన్నారు" అని వెల్లడించారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. నివేదిక వచ్చాక చర్చిస్తాం" అంటున్నారు. "వారందరినీ పిలిపించి మాట్లాడుతాం. అన్ని విషయాలు వివరించి, విల్లింగ్ తీసుకుంటాం. తిరుపతి జిల్లా కలెక్టర్ తో కూడా ఈ విషయం చర్చించా. ప్రభుత్వంతో మాట్లాడి, సమస్య సామరస్యంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటా" అని ఓ ఛానల్ ఇంటర్వ్యలో బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఇదిలావుంటే..
హిందూయేతరులైన సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేయడం? డిప్యూటేషన్ పై పంపించడమా అనే విషయంలో చర్చ జరుగుతోంది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఏమంటున్నారంటే..
"మమ్మల్ని హిందూయేతరులుగా భావిస్తే టీటీడీలోని విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో విధులు కేటాయించండి" అని అంటున్నట్లు ఓ అధికారి 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్'ప్రతినిధికి చెప్పారు. "బోర్డు నిర్ణయం తీసుకున్నా, దీనిపై న్యాయవివాదాలు ఏర్పడే అవకాశం లేకపోలేదు" అనే సందేహాన్నిఆ అధికారి వ్యక్తం చేశారు.
టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు సారధ్యంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయం వెనక బలమైన కారణం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలో ఎవరు చేయని సాహసం టీడీపీ కూటమి ప్రభుత్వం నెత్తికెత్తినట్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయం అమలైతే దళిత సామాజికవర్గంలోని క్రిస్టియన్ల నుంచి టీడీపీ కూటమికి వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రెండు రోజుల కిందట బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి కూడా టీటీడీ బోర్డు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. "అన్ని సంస్థల్లో ఇదే పద్ధతి అమలు కావాలి" అని కూడా ఆయన ఆకాంక్షించారు.
కొన్నేళ్ల కిందట
టీటీడీలో కొన్నేళ్ల వరకు 44 మంది మాత్రమే అన్యమతస్తులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. వారిలో 1989 నుంచి 2007 మధ్య 39 మంది ఉద్యోగులుగా నియమితులయ్యారు. 2007 తర్వాత ఏడుగురు ఉద్యోగులు టీటీడీలో చేరారు. వారిలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయానికి హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్టంలో ఆంక్షలు లేకపోవడమే కారణమని తెలుస్తోంది.
1989 అక్టోబర్ 24వ తేదీ వచ్చిన టీటీడీ సర్వీస్ రూల్స్ ప్రకారం హిందూయేతరులను విధుల్లోకి తీసుకోకూడదని 2007లో తీర్మానించారు. అంతకుముందు నియమితులైన వారు చాలా మంది సర్వీసులో ఉన్నారు. కొందరు పదవీ విరమణ చేశారు.
2017లో డిప్యూటీ ఈఓ స్థాయి మహిళా అధికారి చర్చిలోకి వెళుతుండగా, హిందూ సంఘాలు నిఘా వేసి, ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేయడంతో వివాదం చెలరేగింది. దీంతో విజిలెన్స్ టీటీడీ క్వార్టర్స్ లో ప్రతి ఇంటినీ పరిశీలించి, 44 మంది ఉన్నట్లు నిర్ధారించారు. వారికి నోటీసులు కూడా ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది గ్రేడ్ 4 ఉద్యోగులే ఉన్నట్లు సమాచారం. నోటీసులు అందుకున్న వారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో 2018లో స్టే ఇచ్చింది. ఈ తరువాత ప్రభుత్వం మారింది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ. సుబ్రమణ్యం (ఈయన టీటీడీ ఈఓగా కూడా పనిచేశారు) కూడా హిందూయేతరులను తొలగిస్తామని ప్రకటించారు.
అప్పట్లో నోటీసులు
2019లో టీటీడీ ఈఓగా అశోక్ కుమార్ సింఘాల్ ఉన్న సమయంలో, బీజేపీ తోపాటు కొన్ని హిందూ మత సంస్థలు నిరసనలు, ఆందోళనలకు దిగాయి. శ్రీవారి సన్నిధిలో పనిచేస్తూ చర్చికి వెళ్లడం, టీటీడీ క్వార్టర్స్ లో ఉంటూ కూడా శ్రీవెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి బదులు ఏసుక్రీస్తు ఫోటోలు పెట్టుకున్నారనే విషయం వివాదాస్పదమైంది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. క్వార్టర్స్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నివాసాలను తనిఖీ చేశారు.
ఆ సమయంలో 44 మంది డిప్యూటీ ఈవో నుంచి సాధారణ ఉద్యోగి వరకు హిందూ ఇతరులు ఉన్నట్లు గుర్తించారు. వారికి ఆ రోజుల్లో నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత కాలక్రమంలో ఈ వివాదంసద్దుమణిగింది. కాగా వారిలో కొందరు పదవీ విరమణ చేసిన వారు కూడా ఉన్నారు. దీంతో హిందూ ఇతరుల సంఖ్య తగ్గినట్లు భావించారు.
మళ్లీ తెరపైకి...
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూయేతరుల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీ మొదటి నుంచి హిందూత్వాన్ని మాత్రమే ప్రోత్సాహిస్తోంది. హిందూ మత సంస్థల్లో ఇతర మతస్తులు ఉండకూడదనే పట్టుబడుతోంది. దీంతో, టీటీడీ బోర్డు చైర్మన్ గా బిఆర్. నాయుడు బాధ్యతలు తీసుకోకముందే ఆయన తన విధానాన్ని విస్పష్టంగా ప్రకటించారు. "టీటీడీలో ఉన్న హిందూయేతరులను తప్పిస్తాం. వారిని రాష్ట్ర ప్రభుత్వ శాఖలోకి శాశ్వతంగా పంపించడం. లేదా డి ప్యూటేషన్ పై పంపిస్తాం" అని టీటీడీ చైర్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
రంగంలోకి విజిలెన్స్
టీటీడీ బోర్డు తీర్మానం నేపథ్యంలో అన్యమతస్తుల వివరాలు సేకరించే పనిలో విజిలెన్స్ విభాగం బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అశోక్ కుమార్ సింఘాల్ ఈఓగా ఉన్న సమయంలో ఎంతమందిని గుర్తించారు. వారిలో ఎందరు సర్వీసులో ఉన్నారనే వివరాలతో పాటు తిరుపతి, తిరుమలలో హిందూయేతరుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు కేంద్రాల్లో దాదాపు 500 మందికి పైగానే అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉన్నట్లు సమాచారం . వారు పూర్తిగా క్రిస్టియన్లు అని నిర్ధారించడానికి వీలైన అన్ని రకాల వివరాలను సేకరిస్తున్నట్లు పాలకమండలిలోని ఓ సభ్యుడు స్పష్టం చేశారు.
అదే సమస్య అయిందా?
సాధారణంగా టీటీడీలో ఉద్యోగ నియమాకులకు తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వారికి ప్రాధాన్యత ఉండేది. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలకు చెందిన వారు ఉద్యోగాల్లో నియమితులు కావడానికి నిబంధనలు ఉండేవి. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత రాయలసీమ ఫోర్త్ జోన్ లో ఉండేది. కానీ, టీటీడీ ఈఓగా ఐవైఆర్. కృష్ణారావు కాలంలో ఉద్యోగాల్లో పారదర్శకత కోసం ఏపీపీఎస్సీకి అర్హత పరీక్ష నిర్వహించే బాధ్యతలు అప్పగించారు. అందులో, "హిందువులు మాత్రమే పరీక్షకు అర్హులు" అనే నిబంధన చేర్చారు. దీనికి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ అభ్యంతరం చెప్పింది. మత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేసింది. దీంతో,
బెంగళూరుకు చెందిన సంస్థకు ప్రశ్నాపత్రం తయారు చేసే బాధ్యత ఇవ్వడంతో పాటు, రాష్ట్రం యూనిట్గా తీసుకొని నిర్వహించిన ప్రవేశ పరీక్షకు వేలాదిమంది హాజరయ్యారు. వారు సాధించిన మార్కుల ఆధారంగా 1500 మందిని ఉద్యోగులుగా నియమించారు. ఈ క్రమంలో హిందూ ఇతరులతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు కూడా ఇక్కడ సర్వీసులో ఉన్నారు. "మా ప్రాంతానికి దక్కాల్సిన ఉద్యోగాలు, ఫ్రీ జోన్ చేయడం వల్ల నష్టపోయాం" అని రాయలసీమ ప్రధానంగా చిత్తూరు జిల్లా వాసులు నిరసన వ్యక్తం చేశారు. ఇదంతా గతించిన చరిత్ర.
అందువల్లే ఆలస్యం..
రాయలసీమేతరులు ఆ సమయంలో ఎక్కువ ఉద్యోగాలు సంపాదించినట్లు కనిపిస్తోంది. హిందువులు కాదనే ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో టీటీడీ సర్వీస్ వింగ్ నుంచి వివరాల తీసుకున్న విజిలెన్స్ విభాగం సిబ్బంది ఉద్యోగుల స్వప్రాంతాలకు వెళ్లి విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. అందులో వారి విద్యార్హతల్లో పేర్కొన్న కులం, వాస్తవంగా వారు అనుసరిస్తున్న సాంప్రదాయ పద్ధతులు, పూర్వీకుల నుంచి ఆచరిస్తున్న మతం, తదితర వివరాలను సేకరించే పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
అర్హత పరీక్ష పాస్ అయిన తర్వాత టీటీడీ హిందూ ధార్మిక సంస్థలో పోస్టింగ్ ఇచ్చే సమయంలో రిజర్వేషన్ కేటగిరీలోని అభ్యర్థుల పత్రాలు పరిశీలించడం, వాటిపై పోలీసు విభాగం స్పెషల్ బ్రాంచ్ (SB WING) సిబ్బంది కూడా విచారణ చేస్తారు. దీనికి సంబంధించి టీటీడీలో కూడా విజిలెన్స్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఉన్నారు. ఉద్యోగ నియమాకాలు చేసేటప్పుడు క్షేత్రస్థాయిలో ముందుగానే ఈ వివరాలన్నీ ఎందుకు పరిశీలించలేకపోయారు? ఉదాసీనంగా వ్యవహరించారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. వీటిని కప్పిపుచ్చుకోవడానికి హిందూయేతర ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లోకి పంపించాలని అనుకుంటున్నారా? దీనికి రాష్ట్ర ప్రభుత్వ జీవోలు అనుమతిస్తాయా అనే ప్రశ్న కూడా తెర మీదకు వచ్చింది.
ఇది సాధ్యమా?
టీటీడీలో హిందుయేతర ఉద్యోగులను ధార్మిక నుంచి తప్పించాలని వ్యవహారంపై వాతావరణం వేడిగా మారింది. టీటీడీ తోపాటు ఈ ధార్మిక సంస్థకు పూర్తిగా అనుబంధంగా మారిన స్కీమ్స్ (Sri Venkateswara institute of medical sciences- Svims) తోపాటు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (Shri Padmavati mahila University) లో కూడా కొందరు హిందువుల కానీ వ్యక్తులు ఉద్యోగులుగా ఉండడంతో పాటు, విద్యార్థులు కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ విశ్వవిద్యాలయానికి క్రిస్టియన్ మతానికి చెందిన ప్రొఫెసర్ ను వీసీగా నియమించిన సందర్భంలో కూడా వివాదాలు చెలరేగాయి. ఆనాటి అధికార ప్రభుత్వాలు దీనిని చాలా తేలికగా తీసుకోవడం వల్ల దళితుల్లో హిందూ సంప్రదాయాలను పాటించి ఆమేరకు కట్టుబడిన వారికి అన్యాయం జరిగిందని వేదన కూడా ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే ఈ తప్పిదాలు జరగడానికి ప్రధాన కారణమని చాలామంది అభిప్రాయపడ్డారు.
కూటమికి దెబ్బే..
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ ధార్మిక సంస్థలో హిందూ ఇతర ఉద్యోగులను తప్పించడానికీ టిడిపి కూటమి ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఇది ఒక రకంగా సాహసమే అని చెప్పక తప్పదు. దళిత సామాజిక వర్గంలో ఆయా ప్రాంతాల పరిస్థితులు వారిని మతం మారేందుకు పురిగొల్పాయి. మతాంతీకరణ నివారణలో హిందూ కార్మిక సంస్థలు అందించిన ప్రోత్సాహకాలు, అండగా నిలిచిన వ్యవహారాలు పరిశీలిస్తే చాలా తక్కువే అని చెప్పవచ్చు. దీంతో,
సామాజిక గౌరవం కోసం దళిత, గిరిజన సామాజిక వర్గాల్లో చాలామంది దశాబ్దాలకు పూర్వమే మతం మారడం, ఆ వారసత్వం కొనసాగించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే, ప్రభుత్వ ఉద్యో,గ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ ఫలాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. క్రిస్టియన్లుగా మారిన వారిని బీసీలుగా పరిగణించాలని ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. కానీ ఆ వర్గాల జోలికి వెళ్లడానికి గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాహసించిన దాఖలాలు లేవు. దీనికి ప్రధాన కారణం ఓటు బ్యాంకు దెబ్బతింటుందనేది చెప్పడంలో సందేహం లేదు. కానీ,
టీడీపీ కూటమి మాత్రం టీటీడీలో హిందూ ఇతరులను తప్పించాలనే సాహసోపేతమైన నిర్ణయం వెనక ఉన్న శక్తులు ఏమిటి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారం చిలికి గాలివానగా మారి, రానున్న కాలంలో దళిత సామాజిక వర్గాల్లో ఒక సెక్షన్, టీడీపీ కూటమికి వ్యతిరేకంగా మారే అవకాశం లేకపోలేదు. దీనిని ఎదుర్కోవడానికి ఆ పార్టీలు ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
ఏది ఏమైనా టీటీడీలో అన్యమత ఉద్యోగులను తప్పించాలనే వ్యవహారం రాష్ట్రంలోనే కాదు, దేశంలో ప్రధానంగా దళిత సామాజిక వర్గంలో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ నివేదిక అందిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనేది వేచి చూడాలి.