వాళ్లకు ఏడాది అంటే 13 నెలలు

ప్రజలందరికీ ఏడాదికి 12 నెలలు అయితే వాళ్లకు మాత్రం 13 నెలలు. ఎవరు వారు. ఏమిటా కథ.

Byline :  The Federal
Update: 2024-05-03 03:00 GMT

ఏడాదికి 12 నెలలని, 365 రోజులనీ అందరికీ తెలుసు. కానీ ఎయిర్‌ టెల్, జియో, విఐతో పాటు బిఎస్‌ఎన్‌ఎల్‌ వంటి నెట్‌ వర్క్‌ కంపెనీలకు మాత్రం సంవత్సరానికి 13 నెలలు. అంటే 395 రోజులు. ఇదేంటబ్బా అని అనుకుంటున్నారా?. అదంతే. నిజం కూడా. ఆ నిజమేంటో ఒక సారి పరిశీలిద్దాం.

వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. వినియోగ దారుడిని నిలువున ఎలా దోపిడీ చేయాలో, మోసం చేయాలో ఆలోచిస్తోంది. నేను మోసపోతున్నానని తెలిసి కూడా వినియోగ దారుడు నోరెత్త లేని పరిస్థితి. మన సిమ్‌ కార్డును ఆయా నెట్‌ వర్క్‌ కంపెనీల నుంచి రీ చార్జీ చేసుకోవాలంటే కాల్స్‌ చేయడానికి కానీ, డేటా ఉపయోగించుకోవడానికి కానీ 28 రోజులకు మాత్రమే అవకాశం ఉంటుంది. జనవరి, మార్చి వంటి కొన్ని మాసాల్లో అయితే మూడు రోజలు లెక్కలోకి రావు. 30 రోజులున్న నెలల్లో అయితే రెండు రోజులు పోతాయి. ఇలా ప్రతి మాసంలో రెండు, మూడు రోజులు మినహాయిస్తే ఆ రోజులన్నీ కలిపి ఒక నెలగా మారుతుంది. ఆ నెల రోజులకు రీచార్జీని ప్రత్యేకంగా వినియోగ దారుడు చేయించుకోవలసిందే. అంటే నెట్‌ వర్క్‌ కంపెనీలు వినియోగ దారుడుని ఏ విధంగా దోచుకుంటున్నాయో ఒక సారి ఆలోచించండి. ఉదాహరణకు జియో నెలవారీ ప్లాన్‌ తీసుకుందాం. ప్యాక్‌ వాలిడిటీ 28 రోజులు. టోటల్‌ నెట్‌ డేటా 42జిబీ. రోజుకు 1.5జీబీ వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎమ్మెస్‌లు పంపుకునేందుకు చాన్స్‌ ఉంటుంది. దీని రీచార్జ్‌ ధర రూ. 269. అంటే ఇక్కడ పేరుకు మన్త్‌లీ ప్యాకేజీ అయినా రెండు రోజులు తగ్గించి అమలు చేస్తున్నారు. అంటే 12 మాసాలకు రూ. 3228 వినియోగ దారుడు చెల్లిస్తున్నారు. అదే కంపెనీ వాళ్లు ప్రతి నెలా మిగుల్చుకున్న రెండు రోజులు కలిపితే 13 మాసాలకు గాను రూ. 3497 అవుతుంది. మనం సంవత్సరానికి ఒకే సారి 365 రోజులకు కలిపి రీచార్జీ చేసుకుంటే రోజుకు 2.5జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కూడా మాట్లాడుకోవచ్చు. రోజు 100 ఎస్‌ఎమ్మెస్‌లు పంపుకోచ్చు. ఏడాది మొత్తమ్మీద 912.5జీబీ డేటాను వాడుకోవచ్చు. ఈ ప్యాక్‌ ఖరీదు రూ. 2999. అంటే సంవత్సరానికి రూ. 498లు అదనంగా వినియోగ దారుడు చెల్లిస్తున్నారు. పైగా నెట్‌ డేటా కూడా రోజుకు 1జీబీ వాడుకునే అవకాశం పోతుంది. చూడండి ఎంత దోపిడీ జరుగుతుందో. తక్కిన ఎయిటెల్, విఐ, బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌ వర్క్‌లన్నీ కూడా ఇంచు మించు ఇదే రకమైన దోపిడీకి పాల్పడుతున్నాయి.
మరో విచిత్రం ఏమిటంటే ఇంటర్నెట్‌ లేకుండా ఎయిర్‌టెల్‌ కానీ, జియో, విఐలు కానీ కేవలం కాల్స్‌ మాట్లాడుకునేందుకు రీచార్జీలు చేసుకునేందుకు అవకాశం లేదు. నాకు ఇంటర్నెట్‌ డేటా అవసరం లేదని, కేవలం ఫోన్‌కాల్స్‌ మాట్లాడుకునేందుకు రీచార్జి చేయాలని వినియోగ దారుడు కోరితే దానికి నెట్‌ వర్క్‌ కంపెనీల నుంచి సమాధానమే ఉండదు. మీరు తప్పనిసరిగా రోజుకు 1జీబీ డేటా వాడకంతోటి కలిపి ఫోన్‌ కాల్స్‌ మాట్లాడటానికి రీచార్జీలు చేసుకోవలసిందే తప్ప కేవలం ఫోన్‌ కాల్స్‌ వరకే రీచార్జీలు లేవని నెట్‌ వర్క్‌ షోర్‌ రూమ్‌ల నుంచి సమాధానాలిస్తున్నారు. వినియోగ దారుడు ఆయా నెట్‌ వర్క్‌ల కంపెనీల యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని పరిశిలీంచినా ఈ వాస్తవాలు తేట తెల్లమవుతుంది. వినియోగ దారుడికి ప్రశ్నించే హక్కును ప్రభుత్వం కల్పించింది. అయినా వినియోగ దారుడి మాటను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నెట్‌ వర్క్‌ కంపెనీల మాటే చెల్లుబాటు అవుతోంది. స్పెక్ట్రమ్‌ కుంభకోణాల్లో ఇరుక్కుని ప్రజలను సెల్‌ ఫోన్‌ సిమ్‌ కంపెనీలను దోపిడీ చేస్తున్న పాలకులు ఏమని మాట్లాడుతారు. ఎంత వరకు వినియోగదారుడికి సపోర్టుగా ఉంటారనేది ప్రశ్న. నెల నెలా రీచార్జీలు చేయించుకునే సెల్‌ వినియోగ దారుడు ఆ నెల కోసం ఏమని వినియోగ దారుల కోర్టు మెట్లు ఎక్కుతారు. ఒక్క సారి ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. వ్యాపారమంటే పెట్టుబడి ఖర్చుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లాభం తీసుకొని చేసేది. అంతే కానీ వినియోగ దారుడిని దోపిడీ చేసేదిగా ఉండకూడదు. జరుగుతున్న దోపిడీని కళ్లారా చూస్తున్న ప్రభుత్వం ఎవరో ఒకరు వచ్చి ఫిర్యాదులు చేస్తే చూద్దాములే అన్న ధోరణిలో ఉండ కూడదు. ముందు పాలకులు దోపిడీ విధానం నుంచి బయటకు రావాలి. ప్రజలను దోపిడీ చేస్తున్న వ్యాపారం నుంచి కాపాడాలి. లేకుంటే వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే వారు పుడుతూనే ఉంటారు. పాలకులు చూస్తూనే కాలం గడుపుతారు. ఇదే సమాజ నేపథ్యం కాకూడదు.


Tags:    

Similar News