విశాఖ ఉక్కు చరిత్ర ముగిసింది!
ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగార చరిత్ర ముగిసింది. దేశంలోని సముద్ర తీరంలో ఉన్న ఏకైక ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-09-28 10:37 GMT
కాలం మారింది. ప్రభుత్వం తీరు మారింది. ప్రభుత్వ రంగంలోని సంస్థలు ప్రైవేట్ రంగంవైపు వెళుతున్నాయి. ప్రభుత్వాలు కేవలం సీఈవో పాత్ర పోషించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వం భారాన్ని మోయాలనుకోవడం లేదు. ఎవరైనా వాటా ఇస్తామంటే వారికి ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలను అప్పగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. దేశ విదేశాల్లోని పారిశ్రామిక వేత్తలను డప్పుకొట్టి పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వాలు ఆహ్వానిస్తున్నాయి. ఇందు కోసం సమ్మిట్లు నిర్వహిస్తున్నాయి. మేము సమర్థవంతంగా ఈ పరిశ్రమను నిర్వహిస్తున్నామని చెప్పుకునేందుకు ప్రభుత్వం వద్ద ఒక్కటీ కనిపించడం లేదు. విద్యా వైద్యం కూడా ఖరీదైన పరిశ్రమలుగా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఒక చరిత్ర ఉంది. ఎందరో పోరాటాల ఫలితంగా ఇందిరాగాంధీ హయాంలో ఉక్కు పరిశ్రమ స్థాపించారు. అందుకు ఎందరో పోరాటాలు, త్యాగాలు చేశారు. వారి పోరాటాల ఫలితమే నేటి ఉక్కు కర్మాగారం. సుమారు మూడు సంవత్సరాలుగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ వారికి అప్పగించేందుకు ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉంది. ఉద్యమం బలపడుతుందన్న అనుమానం వచ్చినప్పుడల్లా అటువంటిదేమీ లేదని చెబుతూ వచ్చింది. చావు కబురు చల్లగా చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని, దానిని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సెయిల్ ఎంతో గొప్ప సంస్థ అని దాని ఆధ్వర్యంలో నడిచే ఉక్కు కర్మాగారాలన్నీ లాభాల్లో ఉన్నాయన్నారు. అలాగే ఆర్‌ఐఎన్‌ఎల్ కూడా మంచి సంస్థ అని ప్రశంసించారు. ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే సంస్థలు చాలా బాగుంటున్నాయి.
మరి ప్రభుత్వం నిర్వహించే సంస్థలు ఎందుకు బాగుండటం లేదు. దీనిని ఎందుకు మంత్రి ప్రస్తావించడం లేదో అర్థం కావటం లేదు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నాయంటారు పెద్దలు. ఒక కుక్కను చంపాలంటే దానిని పిచ్చికుక్క అని ముద్ర వేసి అందరినీ నమ్మించి చంపేస్తారు. అప్పుడు జనం నుంచి వ్యతిరేకత రాదు. ఒక మంచి సంస్థను చంపేయడానికి ప్రభుత్వాలకు సుమారు 60 సంవత్సరాలు పట్టింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ఎన్నో సంస్థలు ఎంతో మంది పెట్టుబడి దారుల పరమయ్యాయి. ప్రభుత్వం ఎవరికోసం, ఎందుకోసం పనిచేస్తుందనేందుకు ఎవరి వద్దా సరైన సమాధానాలు లేవు. అదేంటి అంత సందేహం ఎందుకు వచ్చింది. ప్రభుత్వాలు ప్రజల కోసమే కదా పనిచేసేది అంటారు అందరూ. నిజమే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు కొందరు ప్రజలు కాస్త మనస్థాపానికి గురవుతారు.
ప్రస్తుతం సంవత్సరానికి రూ. 4వేల కోట్ల నష్టాల్లో విశాఖ ఉక్కు ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. నష్టాలు వచ్చే సంస్థలో ఎంతకాలం ఉద్యోగులను భరించాలి. కొన్నిసార్లు తప్పదు. ఉద్యోగులను తొలగించడం బాధాకరమే. అయితే తప్పదు. అందుకే ఆలోచిస్తున్నాం. ఏ సంస్థలో విలీనం చేస్తే విశాఖ ఉక్కు నష్టాల నుంచి బయట పడుతుందో దాంట్లో విలీనం చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు మంత్రి మాటలను బట్టి అర్థమవుతోంది. సెయిలోనా, ఆర్‌ఐఎన్‌ఎల్‌లోనా అనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. నేను, కుమారస్వామి ఇప్పటికే పలు సార్లు ఉక్కు పరిశ్రమపై చర్చించాము. విధిలేని పరిస్థితుల్లో విశాఖ ఉక్కును పైవేట్ వారికి అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పకనే చెప్పారు. ఆర్థిక మంత్రి కూడా ఈ విషయంలో పలు సూచనలు చేసినట్లు మంత్రి చెప్పటం విశేషం.
విశాఖపట్టణం నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో విశాఖ ఉక్కు ఖర్మాగారం నిర్మించారు. కర్మాగారం ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశ విదేశాలలో పేరు సంపాదించారు. సంస్థ రాబడిలో 80శాతం జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేస్తున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నాయి. 2010 నవంబరు 10న నవరత్న హోదా పొందింది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారతదేశం, ఆసియా లోనే అతి పెద్దది.
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ తమనంపల్లి అమృతరావు ఆమరణ నిరాహారదీక్షతో 1966 అక్టోబరు 15న ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమం మొదలైన పది రోజులకు దివంగత తెన్నేటి విశ్వనాథం అఖిలపక్ష సంఘం ఏర్పాటు చేసారు. తెన్నేటి అమృతరావు దీక్షకు సానుభూతిగా నాడు నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ, నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిచే 1966 నవంబరు 3న ఉద్యమనేత అమృతరావుకు లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. 1970 ఏప్రిల్ 17న విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6,000 ఎకరాలు 1970లో దానం చేసారు. 1970 జూన్‌లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీతో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. 1971 జనవరి 20న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేతులు మీదుగా కర్మాగార శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
1971 ఫిబ్రవరిలో సలహాదారులను ప్రభుత్వం నియమించింది. 1972లో సాధ్యాసాధ్య నివేదిక త్వానికి సమర్పించారు. 1974 ఏప్రిల్ 7న మొదటి దశ స్థల సేకరణ జరిగింది. 1975 ఏప్రిల్ నెలలో సమగ్ర నివేదిక సమర్పంచేందుకు కమిటీ ఏర్పాటు చేయగా, 3.4 ఎంటిపిఏ ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యం గల కర్మాగార ఏర్పాటుకై ప్రతిపాదనలు 1977 అక్టోబరులో ప్రభుత్వానికి చేరాయి. అప్పటి సోవియట్ రష్యా సహకారంతో నివేదికలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. 1980 నవంబరులో కమిటీ నివేదికను సమర్పించింది. కోక్ ఒవెన్, సెగ కొలిమి, సింటర్ ప్లాంట్ల రూపకల్పనకై పూర్వపు రష్యా దేశంతో 1981 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. 1982 జనవరిలో సెగ కొలిమి నిర్మాణానికి, ఉద్యోగుల క్వార్టర్లకు శంకుస్థాపన జరిగింది. 1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ఏర్పడింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్, భారతీయ ఉక్కు సంస్థ (ఎస్‌ఏఐఎల్) నుంచి విడిపోయి ఆర్‌ఐఎన్‌ఎల్‌గా గుర్తింపు పొందాయి..
33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారతదేశంలోని తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. 3.6 ఎంటీవీగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3 ఎంటీవీకి పెంచేందుకు రూ. 8,692 కోట్ల విస్తరణ ప్రాజెక్టుని దేశ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించారు.