'ఉక్కు' పాదమా? ఉపశమనమా?

విశాఖ ఉక్కును సెయిల్లో విలీనమంటూ విస్తృత ప్రచారం. ఈ అంశంపై నోరు మెదపని ముఖ్య నేతలు. సెయిల్, ఎన్ఎండీసీ చైర్మన్లతో ఉక్కు శాఖ సహాయమంత్రి వర్మ భేటీ.

Update: 2024-09-28 12:42 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

'విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊపిరి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఉపశమనం.. సెయిల్లో విశాఖ ఉక్కు విలీనం?.. ఫలించిన కార్మికుల ఉద్యమం.. ఇలాంటి శీర్షికలతో కొన్ని తెలుగు మీడియా ఛానళ్లు, పత్రికలు హోరెత్తిస్తున్నాయి. వాటిని చూసిన వారిలో ఔనా? నిజమేనా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఉన్నపళంగా ఇలాంటి వార్తలు రావడం పలువురిని ఆశ్చర్య చకితులను చేస్తున్నాయి. అయితే ఈ ఉక్కు కర్మాగారం కార్మికులు, కార్మిక సంఘాల నేతల్లో మాత్రం నమ్మకం కుదరడం లేదు. ఒకపక్క సెయిల్లో విలీనం వార్తలు విస్తృతం చేస్తుండగా మరో పక్క ప్లాంట్ లో నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉద్వాసన పలకడం దేనికి సంకేతమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మూడున్నరేళ్ల క్రితం 2021లో విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పట్నుంచి ఆంధ్ర ప్రజలతో పాటు ఉక్కు కార్మికుల్లో అలజడి రేగుతూనే ఉంది. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు, దీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్రం తగ్గేదే లే అంటోంది. కేంద్ర ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంత మొండిగా ఉందో.. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అంతే మొండి వైఖరితో ఉంది. ఎన్డీయేలో కూటమి ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉండడంతో కొద్ది రోజులుగా ప్రైవేటీకరణ జరగదని అధికారంలో ఉన్న కొందరు, ప్లాంటును పరరిక్షిస్తామంటూ మరికొందరు నేతలు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు.

మరింత సంక్షోభంలోకి ప్లాంటు..

ఈ నాలుగన్నరేళ్లలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరింత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ప్రైవేటీకరణ దిశగా ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఒకప్పుడు ఈ ప్లాంట్ లో 20 వేల మందికి పైగా ఉన్న ఉద్యోగులు/కార్మికుల సంఖ్య ఇప్పుడు 12,600 మందికి పడిపోయింది. ఈ ఏడాది ఆఖరుకి 1025 మంది, వచ్చే ఏడాది చివరికి 1200 మంది, 2026 డిసెంబర్కు 1400 మంది పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే డిసెంబర్ నాటికి మరో 2500 మందికి వీఆర్ఎస్తో ఇంటికి పంపనున్నారు. చత్తీసగఢ్ నాగర్నార్ నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్కు ఇక్కడ నుంచి 500 మంది ఎగ్జిక్యూటివ్లను డెప్యుటేషన్పై పంపుతున్నారు. దీంతో వచ్చే ఏడాదిన్నరలో ఈ ప్లాంట్లో కార్మికుల సంఖ్య 8 వేలకు పడిపోనుంది. ప్రైవేటీకరణ ప్రకటన వెలువడ్డాక యాజమాన్యం ఉద్యోగ నియామకాలను నిలిపేసింది.

కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించలేక పోతోంది. అధికారులకిచ్చే అలవెన్స్ 6 శాతం కోత విధించింది. మరోవైపు ఈ స్టీల్ ప్లాంట్ అప్పులు పాలైంది. నష్టాల్లోనూ కూరుకుపోయింది. 2021 నాటికి రూ.920 కోట్ల లాభాల్లో ఉన్న ఈ ప్లాంటు గత ఏడాది రూ.4,500 కోట్ల నష్టాల్లోకి దిగజారిపోయింది. ఈ నాలుగేళ్లలో రూ.20 వేల కోట్ల అప్పులు చేసింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ స్టీల్ ప్లాంట్ కోకింగ్ కోల్, ఇతర ముడిసరకు సరఫరాదార్లకు బకాయిలు చెల్లించలేకపోతోంది. దీంతో ఆ సంస్థలు వాటి సరఫరాను ఆపేశాయి. ఫలితంగా ఉక్కు ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. ప్లాంటులోని మూడు బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటి మాత్రమే నడుస్తోంది.

పొంతన లేని మాటలు..

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైజాగ్ స్టీల్ ప్లాంట్పై మరింత గందరగోళం నెలకొంది. ప్రైవేటీకరణపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు మాటలకు, ఇప్పటి మాటలకు పొంతన ఉండడం లేదు. నెలన్నర క్రితం విశాఖ వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ప్రైవేటీకరణ జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పరిణామాలు ఆయన హామీకి భిన్నంగా జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రైవేటీకరణ జరగదని చెప్పకుండా పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్మెంట్)కు, ప్రైవేటీకరణకు వ్యత్యాసాన్ని వివరిస్తున్నారు. ఇక ఎన్నికల ముందు ప్లాంట్ను రక్షిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు 'ఉక్కు కర్మాగారం సెంటిమెంటు ఇష్యూ అది. అలాగని ప్రతిరోజూ సెంటిమెంటు అని కూర్చుంటే మనకు సహకరించే వారుండరు' అంటూ ఇటీవల వ్యాఖ్యానించడంపై ప్లాంటు కార్మికులు మండి పడుతున్నారు.

సెయిల్లో విలీనంపై ప్రచారం..

విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటకరణ చేయకుండా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయాలని ఉక్కు కార్మికులు ఆది నుంచీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ కేంద్రం నుంచి దానిపై ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ఇంతలో శుక్రవారం కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఢిల్లీలో సెయిల్, ఎన్ఎండీసీ చైర్మన్లతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పలేను. సెయిల్లో విలీనానికి సాంకేతిక

సమస్యలున్నాయి. ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం' అని తేల్చి చెప్పారు. అనంతరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెయిల్ విలీనం జరుగుతుందన్న సంకేతాలతో మీడియాలో ప్రముఖంగా క థనాలు వచ్చాయి. అయితే ఇలాంటి కీలక నిర్ణయాలపై కేంద్ర మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని ప్రకటన చేస్తారు తప్ప అలాంటిదేమీ లేకుండా మీడియాకు లీకులివ్వడంపై తమకు నమ్మకం కుదరడం లేదని కార్మికులు అంటున్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు ఈనెల 8న రాజ్యసభలో ప్రశ్నను లేవనెత్తారు. దానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. వ్యూహాత్మకేతర రంగాల్లో ఉన్న ఉక్కు సంస్థలను సాధ్యమైతే ప్రైవేటీకరణ చేస్తాం.. లేదంటే మూసివేతే మార్గమని స్పష్టం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకే కట్టుబడి ఉందన్న విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే 1325 రోజులుగా దీక్షలు చేపడ్తున్న కార్మికులు ఈనెల 30న భారీ పాదయాత్రకు కార్మికులు పిలుపునిచ్చారు.

విలీనం అంత 'వీజీ' కాదు..!

సెయిల్లో విశాఖ ఉక్కు విలీనం అంత తేలిక కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. నష్టాల్లో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ను విలీనం చేస్తే ఆ ప్రభావం తమ షేర్లపై పడుతుందని సెయిల్ యాజమాన్యం చెబుతోందని తెలుస్తోంది. అందువల్ల ముందుగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్వహణను చేపట్టి లాభాల్లోకి తెచ్చాక విలీనంపై ఆలోచన చేయవచ్చన్నది సెయిల్ ఆలోచన అని చెబుతున్నారు. ఇదంతా చర్చలు, ప్రత్యామ్నాయాలు, ప్రతిపాదన దశ మాత్రమేనని అంటున్నారు. 'ఒకపక్క కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ పూర్తి స్థాయి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుంది? ప్రైవేటీకరణ చేయబోమని, సెయిల్లో విలీనం చేస్తామని కేంద్రం ప్రకటించాలి.. అప్పటివరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం' అని విశాఖ స్టీల్ ప్లాంట్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జ్యేష్ట అయోధ్యరామ్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.

విలీనంతో లాభాలివీ..

సెయిల్లో విశాఖ ఉక్కు విలీనమైతే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రధానంగా ఉన్న సొంత గనుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. టన్నుకు రూ. 5-6 వేల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం మరో 5 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. అదనంగా మరో పది వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాల కోతను నిలువరిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రైవేటీకరణ బెడద తప్పుతుంది.

4 వేల మందికి ఉద్వాసన

తాజాగా ఈ స్టీల్ ప్లాంట్లో నాలుగు వేల మంది కార్మికులకు యాజమాన్యం ఉద్వాసన పలికింది. అసలే ప్రైవేటీకరణ భయం వెంటాడుతున్న కార్మికులకు ఈ పరిణామం పిడుగులా మారింది. దీంతో కార్మిక సంఘాలతో కలిసి వీరంతా శనివారం ప్లాంట్లో ఆందోళనకు దిగారు. ప్రైవేటీకరణ చేయబోమంటూనే ఆ దిశగా అడుగులు వేస్తోందని మండిపడ్డారు. ఉద్యమం ఉధృతం కావడంతో మధ్యాహ్నం నుంచి వీరందరిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి యాజమాన్యం అంగీకరించింది.

Tags:    

Similar News