అన్నా నీతో ఉండలేను.. జగన్‌తో వెళ్తున్నా

ఇప్పటి వరకు రామ లక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉన్న యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు విడిపోయారు.

Byline :  The Federal
Update: 2024-04-27 07:12 GMT

అన్నా నీ కోసం ఒకటి కాదు రెండు కాదు 42ఏళ్ల పాటు పని చేశా. నాజీవితంలో సగానికిపైగా రాజకీయాల్లో నిన్ను గెలిపించి ఉన్నత స్థానంలో నిలపడానికే పోరాడా. అయినా నాకేమి మిగిల్చావన్నా? ఇనేళ్ల కాలంలో కనీసం ఒక జిల్లా పరిషత్‌ చైర్మన్‌గానో, డీసీసీబి చైర్మన్‌గానో, ఎట్‌లీస్ట్‌ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గానో నామినేటెడ్‌ పోస్టులు ఇప్పించావా? ఇనేళ్ల కాలంలో ఆమాట కూడా నా నోటి నుంచి రాకూడదనుకున్నా. ఎందుకంటే నువ్వు నాకు అన్నవు. రాజకీయాల్లో తలపండిన నేతవు. తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడివి. నువ్వొక మాట అనుకుంటే నాకు ఏపదవి రాదన్నా.. ఎప్పుడైనా తమ్ముడనే వాడు ఒకడున్నాడు, వాడి జీవితాన్ని నా రాజకీయ జీవితం కోసం అర్పించాడు. అటువంటి వాడికి ఏమి చేసినా తక్కువే. ఎంత ఇచ్చినా తక్కువే అని ఒక్క రోజైనా మనస్పూర్తిగా నువ్వు ఆలోచించావా.. అన్నా.. నా పై దయలేని నీతో కలిసి నడవటం కంటే నన్ను నడిపించే వ్యక్తితో కలిసి నడవడమే మంచిదని భావించా. అందుకే తెలుగుదేశం పార్టీని వీడుతున్నా. ఇక నేను నీకు జెల్ల కొట్టావనుకో. లేదు నా తమ్ముడిని నాతో కలిసి ఉండేలా చేయలేక పోయాననుకో. నేను మాత్రం ఇక నీ మోసపు మాటలు నమ్మను. అందుకే నీ కుట్ర రాజకీయాల నుంచి బయటకు పోతున్నా. నా జీవితంలో రావాలసిన మార్పులను నేను కోరుకుంటున్నా. వీలైతే నీమనసులో నన్ను ఆశీర్వదించు. లేదంటావా ద్వేషించు. నేను మాత్రం అనుకున్న ప్రకారం వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీలో నా అనుచరులతో చేరుతున్నా.

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపే నా గెలుపుగా భావిస్తున్నా. ఇందులో ఏ కుట్రలు కుతంత్రాలు లేవన్నా. కేవలం నా మనసులో ఉన్న నా బాధను మాత్రమే నీతో చెప్పాలనిపించి చెబుతున్నా. అంటూ తుని అసెంబ్లీ నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత యనమల రామకృష్ణుడి తమ్ముడు యనమల కృష్ణుడి ఆవేదన ఇది. ఈ ఆవేదన నేటి రాజకీయాల్లోనే కాదు. పూర్వపు రాజుల కాలం నాటి నుంచి వస్తున్నదే. అప్పుడు కుట్రలు చేయడానికి రాజు వద్ద కొందరు అంతరంగికులు ఉండేవారట. ఇప్పుడు ఆ కోవలో చంద్రబాబుకు కోస్తా రాజకీయాల్లో అత్యంత ఆప్తుడైన అంతరంగికుడు యనమలరామకృష్ణుడేనట. అందుకే రామకృష్ణుడు చెప్పిందే చంద్రబాబుకు వేదం. ఇప్పుడు రామకృష్ణుడు తమ్ముడికి చేసిన అన్యాయంపై ఏమని మాట్లాడుతాడు, ఏమి సమాధానమిస్తాడు. దాని కోసం కోస్తా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.

ఎవరు సమాధానమిచ్చినా ఇవ్వకపోయినా నా మనసుకు నచ్చజెప్పుకోవడం జీవితాన్ని చరమాంకం వరకు ఇలాగే కొనసాగించడం నాకిష్టం లేదు. అందుకే ఈ రోజు నుంచి నా అన్న రామకృష్ణుడితో నాకు ఎటువంటి రాజకీయ సంబంధాల్లేవని అంటున్నాడు కృష్ణుడు. మంచికో చెడుకో, ఇష్టమున్నా లేక పోయినా నా అన్న నన్ను రాజకీయంగా వాడుకొని విసిపి పడేశాడు. ఇది నా జీవితంలో నేనెప్పటికీ మరచి పోలేను. అలాగని చేతులు కట్టుకొని నా జీవితాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచ లేను. నా స్నేహితులు, సన్నిహితులు, ప్రజల మధ్య ఆనందంతో గడపాలనేదే నా ఆకాంక్ష. దాని కోసమే నా అన్నగా నిన్ను త్యజిస్తున్నా. ఇది నా తుది వీడ్కోలు. ఇక నుంచి నువ్వు రాజకీయాల్లో ఉంటావో.. నీ కుమార్తెను రాజకీయాల్లో నిలబెట్టుకుంటావో నాకు అనవసరం. నేను మాత్రం నీకు చెప్పినట్లుగా ప్రజల మధ్యే ఉంటా. స్నేహితులతోనే ఉంటా. సన్నిహితులతోనే గడుపుతా. వారు కోరుకున్న జీవితాన్ని ప్రభుత్వం ద్వారా ప్రసాదించేందుకు నా వంతు కృషి చేస్తా. రాజకీయాల్లో కృష్ణుడు తప్పుడోడు కాదు. తప్పులు సరి చేసే వాడని నిరూపిస్తా. ఇదే నా «ధ్యేయం. అందుకే జగన్‌ పార్టీని ఎంచుకున్నా. ఇక నా పయనం నా సన్నిహితులు, స్థానికుల కోసం జగన్‌ చెప్పిన బాటలో నడవడం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిన్ను ఎదుర్కోవడం. అన్నా గుడ్‌ బై.

నా జీవితం నీ కబంద హస్తాల్లోనుంచి బయటకు వచ్చింది. రెక్కలు విప్పిన పక్షిలా ఎగురుతోంది. ఏ రోజైనా నీ అవసరం వచ్చి నీ దగ్గరు వస్తే ఎప్పటికీ నన్ను ఆదరిస్తావని నేను నమ్ముతున్నా. లేదంటే నీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్న. ఈ రోజు నుంచి నా జీవితం నా చేతుల్లో లేదు. నియోజక వర్గం ప్రజల చేతుల్లోకి పోయింది. వారు చెప్పింది చేయడమే నా ధర్మం, కర్తవ్యం అని భావిస్తున్నా.

Tags:    

Similar News