ఈ ఎస్పీలకు ఫ్యాక్షన్‌ సవాల్‌

ఎస్పీలు వస్తున్నారు.. పోతున్నారు. ఫ్యాక్షన్‌ను మాత్రం అలానే ఉంది. ఆ ఫ్యాక్షన్‌ దెబ్బకు గత ఎస్పీలు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన వారికి సవాల్‌గా మారింది.

Byline :  The Federal
Update: 2024-05-20 07:28 GMT

ఏళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్షన్‌ ఇంకా వేళ్లూనుకూనే ఉంది. పైకి సమస్య మాసిపోయిందని భావిస్తున్నా నివురు గప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా ఫ్యాక్షన్‌ను కూకటి వేళ్లతో పెకిలించి వేడయం ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా పైపైనే చర్యలు తీసుకోవడం, చూసీ చూడనట్లు వదిలేయడంతో అదింకా సజీవంగానే ఉంది. 2024 ఎన్నికల హింసలే దీనికి నిదర్శనం.

తాడిపత్రిలో శాంతి నెలకొంటుందా ?
అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజక వర్గంలో 2024 ఎన్నికల సందర్భంగా నెలకొన్న పరిస్థితులు ఈ నాటికి కావు. తాడిపత్రి అల్లర్లకు ఒక చరిత్ర ఉంది. అభ్యర్థులు ఎవరైనా దాడులకు పాల్పడటం, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగడం ఇక్కడ నేతలకు పరిపాటిగా మారింది. ఎన్నికల సందర్భంగా ఇక్కడ పని చేసే అధికారులు సందర్భాను సారంగా పనిష్‌మెంట్‌లకు గురి కావడం అనేది కూడా ఇక్కడ సర్వసాధారణంగానే మారింది. గత చరిత్రను ఒక సారి పరిశీలిస్తే 2024 ఎన్నికల్లో జరిగిన హింసపై పెద్దగా చర్చించుకోవలసని అవసరం కూడా లేదనేది స్థానికుల్లో చర్చ ఉంది. వారి వాదనలో బలం కూడా ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 35 ఏళ్ల తాడిపత్రి రాజకీయాలను ఒక సారి పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. అభ్యర్థుల ఇళ్లపై రాళ్లు, బాంబులతో కూడా పరస్పర దాడులు జరిగాయి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, పేరం నాగిరెడ్డి, సూర్యప్రతాప్‌రెడ్డి ఈ నియోజక వర్గంలో ప్రధాన ప్రత్యర్థులు. నాటి నుంచి నేటి వరకు వర్గ పోరు తప్ప ప్రజా సంక్షేమం, శాంతి నెలకొల్పడం, నలుగురు నావారనుకోవడం అనేది తాడిపత్రి చరిత్రలోనే లేదు. 1994 తర్వాత తాడిపత్రిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పేరం నాగిరెడ్డి వర్గీయులు పోటీకి దిగారు. పెనుగొండ నియోజక వర్గానికి చెందిన ప్రజాస్వామ్య ఎన్నికల్లో విప్లవకారుడైన పరిటాల రవి నాడు ‘నేను తాడిపత్రికి వస్తున్నాను. నా వర్గీయులు అక్కడ నామినేషన్‌ వేస్తున్నారు. నువ్వు ఊరు వదలి వెళ్లి పోవాలి. లేదంటే జరిగే పరిణామాలకు నేను బాధ్యుడను కాను’ అంటూ జేసీ దివాకరరెడి వర్గీయులకు పరిటాల రవి ఇచ్చిన వార్నింగ్‌ అప్పట్లో వారు పరారు కావడానికి కారణమైందని ఇప్పటికీ స్థానికులు చెబుంతుంటారు. పరిటాల రవి వర్గం తరపున ఎవరైతే నామినేషన్‌ వేశారో వారంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తాడిపత్రి మళ్లీ ఫ్యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లి పోయింది. దీనికి 2024 ఎన్నికల హింసలే నిదర్శనం. ఈ పరిస్థితుల నుంచి తాడిపత్రిని కాపాడేందుకు నూతన 2015వ బ్యాచ్‌కు చెందిన గౌతమీ శాలీని ఎస్పీగా ఎన్నికల కమిషన్‌ నియమించింది. ఈమెకు తాడిపత్రి ఫ్యాక్షన్‌ గత చరిత్ర ఏమిటో, తాడిపత్రిలో జేసీ సోదరులు, పేరం నాగిరెడ్డి, సూర్యప్రతాప్‌రెడ్డిల మధ్య నెలకొన్న వివాదాలేమిటో తెలియవు. ఖచ్చితంగా నియోజక వర్గంలో గత చరిత్రను గౌతమీ శాలి పరిశీలించాల్సి ఉంది. తాను కొత్తగా వచ్చాను కాబట్టి, ఓట్ల లెక్కింపు విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటానని మీడియా కూడా తనకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
పరారీలో అభ్యర్థులు
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీలో ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ తరపున బరిలో ఉన్న జేసీ ప్రభాకరరెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి ఇరువురూ ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయారు. ఎందుకంటే వారి ఇరువురూ ఎన్నికల సందర్భంగా జరిగిన దాడుల్లో నిందితులు. పోలీసులు కూడా తాము తక్కువేమీ తినలేదన్నట్టుగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని కూడా సోదా చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు నియోజక వర్గం నుంచి కనిపించకుండా అజ్ఞాతంలోకి జారుకున్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో మొదలయ్యే చిన్నపాటి పంతాలు రెండు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించి అనేక మంది ప్రాణాలు బలిదానాలు చేసే స్థాయికి చేరడం బాలా బాధాకరమని సీనియర్‌ జర్నలిస్టు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువుగా ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు అనాదిగా వస్తున్న ఆచారంగా మారిందన్నారు. ఆ వ్యక్తులు, ఆ కుటుంబాలే ఆర్థిక బలంతో పాటు అంగ బలంగా కొంత మందిని చేర దీసి, ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం హీరోయిజంగా భావిస్తున్నారని అన్నారు. చివరకు వాళ్లు రాజకీయాలను కూడా వదలక పోవడంతో ఎన్నికలు వచ్చిన ప్రతి సారి హింస చెలరేగుతుందని, ఫ్యాక్షన్‌కు నాయకత్వం వహించే వారి నుంచే మార్పు తీసుకొచ్చేలా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని రామలింగారెడ్డి అభిప్రాయపడ్డారు.
ఎస్పీ శాంతి భద్రతలు నెలకొల్పడంలో సక్సెస్‌ అవుతారా
2018లో బొబ్బిలి ఏఎస్పీ గౌతమీ శాలీ పని చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. తర్వాత జిల్లాల్లో ఆమె ఎక్కడా ఎస్పీగా పని చేసిన దాఖలాలు లేవు. ఎన్నికల కమిషన్‌ ఆమెకు అనంతపురం జిల్లాలో పని చేసే ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎస్పీగా గౌతమీ శాలీ సక్సెస్‌ అవుతారా లేదా అనే చర్చ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జరుగుతోంది.
మల్లికా గార్గ్‌ పల్నాడులో సక్సెస్‌ అవుతారా
పల్నాడు అనగానే ఎవరికైనా గురుకొచ్చేది కరుడు గట్టిన ఫ్యాక్షన్‌ రాజకీయాలు. రక్తం పారకుండా ఫ్యాక్షన్‌ రాజకీయాలను చూడలేం. పల్నాడులో గురజాల, మాచర్ల నియోజక వర్గాలు ఫ్యాక్షన్‌కు పెట్టింది పేరు. 2024 ఎన్నికల్లో మాచర్ల నియోజక వర్గంలో ఫ్యాక్షన్‌ హింసలు చెలరేగాయి. దాడులు, ప్రతిదాడులు, నాటు బాంబు, పెట్రోలు బాంబు దాడులతో పాటు కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, గొడ్డళ్లు, చివరికి రాళ్లతో కూడా దాడులకు తెగబడ్డారు. ప్రధానంగా మాచర్ల నియోజక వర్గంలోని రెంటచింతల, రెంటాల, కారంపూడి, మరి కొన్ని గ్రామాల్లో ఈ హింస చెలరేగింది. పెట్రోల్‌ పోసి కార్లను తగుల బెట్టారు. బైక్‌లను ధ్వసం చేశారు. ప్రత్యర్థులు దాడులకు పాల్పడి పరస్పరం తలలు పగుల గొట్టుకున్నారు. ఇన్ని దారుణాలు చోటు చేసుకున్నాయి. ఈ హింసపై సిట్‌ అన్వేషణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఐపీఎస్‌ అధికారి మల్లికా గార్గ్‌ను ఎస్పీగా నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె శనివారమే బాధ్యతలను స్వీకరించారు. పల్నాడులో ఫ్యాక్షన్‌రాజకీయాలకు మల్లికా గార్గ్‌ అడ్డుకట్ట వేస్తారా లేదా చూస్తూ ఉండి పోతారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
పల్నాడు అంటేనే పగ, ప్రతీకారాలకు పట్టుదలలకు పెట్టింది పేరు. ఆ కోవలోనే ప్రజాస్వామ్యం మొదలైనప్పటి నుంచి ఎన్నికల్లో పల్నాడు పౌరుషం పేరుతో ఎవరికి వారు దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు. కేసులు, శిక్షలు పల్నాడు రాజకీయ నాయకులకు లెక్కలోకి రాదని తేలిపోయింది. 2024 ఎన్నికల్లో జరిగిన హింసలో చాలా మంది క్షత గాత్రులయ్యారు. గాయాలపాలైన వారు స్టేషన్‌లో ఫిర్యాదులు చేసేందుకు కూడా ముందుకు రాలేదంటే ఫ్యాక్షన్‌ రాజకీయాలు పల్నాడులో ఏ స్థాయిలో ముందుకు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పల్నాడు అంటే పౌరుషానికి ప్రతీకనే సానుకూల ముసుగు వేసి ఇక్కడ ఉద్దేశ పూర్వకంగా ఫ్యాక్షన్‌ను రాజకీయ నాయకులే పెంచి పోషిస్తున్నారని సీనియర్‌ జర్నలిస్టు పి రామకృష్ణ తెలిపారు. రాజకీయ నాయకుడు తమ ఆధిపత్యం కోసం గ్రూపులను ప్రోత్సహించి దానికి ఫ్యాక్షన్‌ రంగు పులిమి దాడులకు దిగడం వల్ల సామాన్య ప్రజానీకం అశాంతి అలజడులతో భయం, భయంగానే జీవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తుల స్వార్థం కోసం సాగించే ఫ్యాక్షన్‌ దాడులను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఉందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో నూతన ఎస్పీగా నియమితులైన ఎస్పీ మల్లికా గార్గ్‌ పల్నాడు రాజకీయ చరిత్రను అర్థం చేసుకొని ఫ్యాక్షన్‌ హింసను నిలువరిస్తారా, పక్షపాతానికి తావు లేకుండా పరిపాలన సాగించడంలో విజయం సాధిస్తారా, ఫెయిల్యూర్‌ అయి వెనక్కి సర్థుకుంటారా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
Tags:    

Similar News