కీలకంగా మారిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ
ఓట్ల లెక్కింపుపై కీలక చర్చలు. కూటమికి మెజారిటీ వస్తే ఎలా ముందుకెళ్లాలనే దానిపై కీలక చర్చలు.
ఎన్నికల అనంతరం, ఎన్నికల ఫలితాలకు ముందు తొలి సారిగా టీడీపీ అధినేత, నారా చంద్రబాబు నాయుడు,జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌లు భేటీ కానున్నారు. ఉండవల్లి చంద్రబాబు నివాసంలో శుక్రవారం వారి భేటీ జరగనుంది. బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. ఓట్ల లెక్కింపునకు నాలుగు రోజుల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి, ఎంత మేరకు మెజారిటీలు నమోదు చేసుకునే అవకాశం ఉందనే అంశాలపైన వీరు ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూటమి తరపున టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు గ్యారెంటీగా ఏయే సీట్లలో గెలవనున్నారు, ఎన్ని సీట్లు సొంతం చేసుకోనున్నారు తదితర అంశాలపైన చర్చించనున్నారు. ఆయా నియోజక వర్గాల సమాచారాన్ని ఇది వరకే ఆ పార్టీ శ్రేణుల నుంచి అధినాయకులకు చేరినట్లు తెలిసింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మెజారిటీ సీట్లు వస్తే ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే దానిపైన వారు చర్చించనున్నారు.