తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ పెట్టారా?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. తెలంగాణపై ఫోకస్ పెడుతున్నారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఆంధ్రలో తప్పకుండా టీడీపీ అధికారంలో..

Update: 2024-05-31 14:25 GMT

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. తెలంగాణపై ఫోకస్ పెడుతున్నారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఆంధ్రలో తప్పకుండా టీడీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతోనే ఇక తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా పావులు కదపడానికి చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తెలంగాణలో ఉన్న టీడీపీ నేతలతో భేటీ కానున్నారని, వారితో పార్టీ బలోపేతానికి సంబంధించిన కార్యాచరణపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీని బలమైన పార్టీగా మార్చడమే చంద్రబాబు టార్గెట్ అని, ఈ ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా పాటిస్తానని చెప్పడం వెనక కారణం కూడా ఇదేనన్న చర్చ కూడా తీవ్రంగానే జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈరోజు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ కూడా అయ్యారు.

బలహీన పడిన టీడీపీ

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలో టీడీపీ బాగా బలహీన పడింది. ఒకానొక సందర్భంలో అసలు తెలంగాణలో టీడీపీ ఉందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. 2019లో ఆంధ్రలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం కావడంతో తెలంగాణలో టీడీపీ భూస్తాపితం అయిపోయిందని అంతా చర్చించుకున్నారు. కానీ ఆంధ్రలో తప్పకుండా ఘన విజయం సాధిస్తామన్న ధీమా టీడీపీ స్వరంలో వినిపిస్తోంది. అదే ఊపులో తెలంగాణలో కూడా టీడీపీ పార్టీని తిరిగి ఉనికిలోకి తీసుకురావాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నట్లు పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. అందులో భాగంగానే అతి త్వరలోనే తెలంగాణలో టీడీపీ తన కార్యాచరణను ప్రారంభించనున్నట్లు సమాచారం.

తొలి నిర్ణయం అదే

కొంతకాలంగా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు లేదు. ఆ కుర్చీ ఇప్పటికీ ఖాళీగానే ఉంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా చంద్రబాబు తొలుత తీసుకునే నిర్ణయం టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎవరు అన్నదేనని తెలంగాణ టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఈ పదవిలో ఎవరికి కూర్చోబెట్టాలని అన్న అంశంపై కసరత్తులు చేస్తున్నారు. కాకపోతే సదరు నేతలపై పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించే విధంగా కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News