ఒకటో తేదీకి రూ.10వేల కోట్లు కావాలి.. సర్కార్ ప్లాన్ ఏంటో?
జూలై 1వ తేదీ ఏపీ సర్కార్‌కు సవాల్‌గా మారింది. ఇచ్చిన హామీలు, ఉద్యోగుల జీతాల చెల్లింపులకు రూ.10వేల కోట్లు కావాల్సి ఉంది. ఈ పరిస్థితిలో చంద్రబాబు ఏం చేస్తారు.
ఒకటో తేదీ వస్తుందంటే ప్రతి కుటుంబం నెలవారీ ఖర్చుల లెక్కలు కట్టుకోవడంలో మునిగిపోతుంది. అందుకే ప్రతి కుటుంబానికి ఒకటో తేదీ ఒక చిన్న ఛాలెంజ్ అనే చెప్తారు. ఇప్పుడు రానున్న జూలై 1టో తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఛాలెంజ్‌గా మారనుందని పరిస్థితులు చెప్పకనే చెప్తున్నాయి. ఇచ్చిన హామీలు, ఇతర ఖర్చులు అన్నీ కలుపుకుని ఈ ఒకటో తేదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు రూ.10వేల కోట్లు కావాల్సి ఉంది. దీంతో కొత్త సర్కార్ ఈ మొత్తాన్ని సమీకరించే పనిలో తలమునకలై ఉంది. ఈ మొత్తాన్ని సమీకరించడంపై ఇప్పటికే అధికారులు, నిపుణులతో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే దేనికి ఎంత వరకు ఖర్చు కావచ్చు, ఎటువంటి ఖర్చులు తగ్గించుకోవచ్చు అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతనే రూ.10వేల కోట్లు కావాల్సి వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
పింఛన్లకే రూ.4వేల కోట్లు
చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం సంతకం పెట్టిన వాటిలో పింఛన్ల పెంపు కూడా ఉంది. వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లను పెంచడం జరిగింది. దానికి తోడు ఈ పెంచిన పింఛన్ ఏప్రిల్ నెల నుంచి అమలవుతుందని, ఈ మూడు నెలలు బకాయిలు ఉన్న అదనపు పింఛన్‌ను జూలై 1వ తేదీని అందించే పింఛన్‌తో కలిపి ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దాంతో ఈ పింఛన్ల కోసం జూలై నెల ఒకటో తేదీకి రూ.4,408.31 కోట్లు అవసరం అవుతాయి. ఇప్పటికే వీటన్నింటిని పూర్తి లెక్కలతో సహా అధికారులు సీఎంకు అందించారు. ఈ లెక్కలను సీఎం పరిశీలిస్తున్నారు.
ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు
వీటితో పాటుగా ఈసారైనా ఒకటో తేదీకే జీతాలు పడతాయా అని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతి శాఖ అధికారులు కూడా ఒకటో తేదీ వస్తే జీతం వస్తుందా రాదా అన్న డైలామాలో ఉన్నప్పటికీ ఒకటో తేదీకి జీతం పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆకాంక్షను నెరవేర్చే ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జీతాలు వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసిందని, నగదు జమ ఒక్కటే మిగిలి ఉందని సమాచారం.
అవసరాలకు తగ్గట్టే ఆర్థిక నిర్వహణ
జూలై 1వ తేదీకి రూ.10 వేల కోట్లు కావాల్సి ఉందని నిశ్చయించుకున్న ప్రభుత్వం ఈనెలలోనే కావాల్సిన ఖర్చులకు తగ్గట్టుగా ఆర్థిక నిర్వహణ చేస్తుందని సంబంధిత అధికారులు చెప్పారు. దాంతో పాటుగా బిల్లుల చెల్లింపులపై కూడా సర్కార్ ఫోకస్ పెట్టిందని, అధిక మొత్తంలో బకాయిలు ఉన్న వారికి సంబంధించిన బిల్లులను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీగా బకాయిలు ఉన్నాయని, వైసీపీ హయాంలో కేవలం అయిన వారికి బిల్లులు చెల్లించి ఇతర బిల్లులను నిర్లక్ష్యం చేశారని గత ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపుల అధికారం ఉన్న ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.
సత్యనారాయణకు ఉత్తర్వులు
గత ప్రభుత్వ హయాంలో కేవీవీ సత్యనారాయణ ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన డిప్యుటేషన్ కాలం పూర్తి కావడంతో ఆయనను సొంత శాఖకు వచ్చి రిపోర్ట్ అందించాలని రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అందులో రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకుని ఆయన బదిలీని తాత్కాలికంగా ఆపించింది. ప్రస్తుతం సత్యనారాయణ దగ్గర ఉన్న బిల్లుల చెల్లింపులకు సంబంధించిన వివరాలను మరో ఉన్నతాధికారి సౌరభ్‌గౌర్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సహా పలువురు కీలక అధికారులు సెలవులో ఉన్నారు. ఆ కారణంగానే సత్యనారాయణను కొన్ని రోజులు రాష్ట్రంలో ఉంచాలని ఆంధ్రలో ఏర్పడిన నూతన ప్రభుత్వం కేంద్రానికి వివరించింది.
సత్యనారాయణను ఉంచింది అందుకేనా..
కేవీవీ సత్యనారాయణ బదిలీని రాష్ట్ర సర్కార్ చొరవ చూపి మరీ రాష్ట్రంలోనే ఉంచడంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ హయాంలో జరిగిన అవకతవకలను వెలికి తీయడానికే నూతన ప్రభుత్వం ఆయనను రాష్ట్రంలోనే ఉంచిందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో, నిధుల వినియోగం సహా ఇతర ఆర్థిక వ్యవహారాల్లో జరిగిన అన్ని అవకతవకలను వెలికి తీస్తామని, జగన్ చేసిన అక్రమాలను, అవినీతి ప్రజల ముందు ఉంచుతామని ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీ కూటమి నేతలు ఘంటాపథంగా చెప్పారు. ఇది దానిని సాధించడానికే కేవీవీ బదిలీ విషయంలో జోక్యం చేసుకుని తాత్కాలికంగా ఆపించింది అని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
రూ.47వేల కోట్లకే అనుమతి
ప్రతి ఆర్థిక సంవత్సంలోనూ ప్రతి రాష్ట్రానికి తొలి తొమ్మిది నెలలకు రుణ పరిమితిని కేంద్రం నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు రూ.47వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకోవడానికి అనుమతులు ఇచ్చింది. అందులో జగన్ ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ 4 వరకు రూ.25వేల కోట్ల సమీకరించింది. దీంతో సెప్టెంబర్ వరకు మరో రూ.22వేల కోట్లు తీసుకునే అవకాశం ఆంధ్ర సర్కార్‌కు ఉంది. రాబోయే పదిరోజుల్లో రాబడులు, కొంత రుణం, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లు అన్నీ కలుపుకుని జూలై 1వ తేదీకి ఉన్న ఖర్చులను తీర్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు కూడా జూలై 1వ తేదీనే జీతాలు ఇచ్చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే విధంగా పింఛన్లను కూడా లబ్ధిదారుల ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.