రూల్స్ బ్రేక్ చేసిన సజ్జల.. కంప్లైంట్ ఇచ్చిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడెపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. ఆయన ఎన్నికల ప్రవర్తన నియామవళిని బ్రేక్ చేశారంటూ..

Update: 2024-05-30 14:04 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడెపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. టీడీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ గుడపాటి లక్ష్మీనారాయణ ఈ ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను ఉద్దేశించి సజ్జల చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని నారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణ శిబిరం నిర్వహణలో సమయంలో సదరు ట్రైనీ ఏజెంట్లను ఉద్దేశించి సజ్జల తీవ్రంగా వ్యాఖ్యానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలకు గానూ వెంటనే సజ్జలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

సజ్జల ఏమన్నారంటే..

ఎన్నికల కౌంటింగ్‌ ముందు సజ్జల రామకృష్ణారెడ్డి.. కౌంటింగ్ ఏజెంట్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు పాటించే ఏజెంట్ల తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లొద్దని తమ పార్టీ ఏజెంట్లకు ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా టీడీపీ, జనసేన ఏజెంట్లను అడ్డుకోమని కూడా సజ్జల తమ పార్టీ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమా కూడా తాడెపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అసలు ఫిర్యాదు ఏంటంటే..

‘‘తాడేపల్లిలో 29 మే 2024న నిర్వహించిన కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణ సమయంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ఆయన వ్యాఖ్యలు కౌంటింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించేలా ఉన్నాయి. దాంతో పాటుగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతిక్రమిస్తూ ఏజెంట్లను, ఎన్నికల చట్టాలను, నియమాలను ప్రేరేపితం చేసేలా ఉన్నాయి. ఇది ఎన్నికల కౌంటింగ్‌కు ముందు సజ్జల పాల్పడిన అతిపెద్ద నేరం. ఆయన వ్యాఖ్యలు, ప్రవర్తన ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులను భయపెట్టాలా ఉన్నాయి. దాంతో పాటుగా ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా, కౌంటింగ్ ప్రక్రియను దెబ్బతీసేలా ఉన్నాయి. సమాజంలోని పలు వర్గాల మధ్య ద్వేషాలు, శత్రుత్వం, పాత గొడవలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఆయన సదరు వ్యాఖ్యలను పూర్తిస్థాయి నేర ప్రేరేమితంగానే చేశారు. ఈ నేపథ్యంలో సజ్జలపై సదరు అధికారులు కేసు నమోదు చేయాలని కోరుతున్నాం. రెప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ చట్టం 1951 లోని యూ/ఎస్ 125, 123(2), 123(3) సెక్షన్ల కింద, ఐపీసీలోని 153ఏ, 505(2), 171ఎఫ్, 171జే సెక్షన్ల కింద కేసు నమోదు చేయమని కోరుతున్నాం’’ అని లక్ష్మీ నారాయణ తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.

సీరియస్ అయిన సీఈఓ మీనా

సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా ఘాటుగా స్పందించారు. మచిలీపట్నంలోని ఓ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం సజ్జల వ్యాఖ్యలపై ఎంకే మీనా స్పందించారు. కౌంటింగ్ రోజున కౌంటింగ్ హాల్‌ లోపల ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిని కటకటాల వెనక్కి పంపడం ఖాయమంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘అభ్యర్థి, ఏజెంట్‌లు ఎవరైనా కౌంటింగ్ సెంటర్లో గొడవ చేయాలని, కౌంటింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కౌంటింగ్ ఏరియా చుట్టుపక్కల ఎటువంటి ఊరేగింపులు చేయడానికి అనుమతులు లేవు. ఎవరైనా వీటిని నిర్వహిస్తే వారిపైన కూడా చర్యలు ఉంటాయి. కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నాం’’ అని చెప్పారు.

Tags:    

Similar News