రాయలసీమ ఉద్యమ నేత దశరథరామిరెడ్డి అరెస్ట్, రిమాండ్
రాయలసీమ ఉద్యమ నేత దశరథరామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచారు.ఆయనకు కోర్టు పదిరోజుల రిమాండ్ విధించింది.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుకు బొజ్జా దశరథరామిరెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి ఆత్మకూరు కోర్టులో హాజరు పరచారు.
అనంతరం ఆత్మకూరు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆయనకి పది రోజుల రిమాండ్ కు ఆదేశించారు. దీనితో పోలీసులు దశరథరామిరెడ్డిని కస్టడీలోకి తీసుకుని నందికొట్కూరు సబ్ జైలుకు తరలింవారు.
దశరథ రామిరెడ్డి అరెస్ట్ కు నిరసనగా ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆకుతోట రాజశేఖర్, సీపీఎం పట్టణ కార్యదర్శి రణధీర్ ల ఆధ్వర్యంలో రైతులు , రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు పోలీసు వాహనానికి అడ్డుపడి ప్లకార్డులు ప్రదర్శించారు.
రాయలసీమ ఉద్యమ నాయకుడు బొజ్జా దశరథరామిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసారని, రాయలసీమ కు సాగు, త్రాగునీరు అడిగితే అరెస్ట్ చేయడం అన్యాయమని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రైతులను అతికష్టం మీద పక్కకు నెట్టి దశరథరామిరెడ్డిని జైలుకు తరలించారు.
రాయలసీమకు సాగునీరు ఇవ్వాలని దశరథరామిరెడ్డి చాలాకాలంగా పోరాడుతున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ‘సిద్దేశ్వరం అలుగు’ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిద్వారా రాయలసీమకు తాగు, సాగు నీరు సులువుగా అందించవచ్చని ఆయన చెబుతున్నారు.
అయితే ప్రభుత్వాలు దీనిని పట్టించుకోకపోవడంతో 2016లో రాయలసీమ ప్రజలను సమీకరించిన దశరథరామిరెడ్డి, సిద్దేశ్వరం వరకూ పాదయాత్ర చేసి ప్రజాశంకుస్థాపన చేశారు. ప్రతి ఏటా అక్కడే వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే సిద్దేశ్వరం పాదయాత్ర నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ దశరథరామిరెడ్డి అక్కడికి వెళ్లి శంకుస్థాపన చేయడంతో పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు.
ఈ కేసుపైనే ప్రస్తుతం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం పోలీసులు ఆయనకు నంద్యాల జిల్లా ఆత్మకూరులో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
అరెస్ట్ పై ఖండన
రాయలసీమ ప్రజా ఉద్యమ నేత బొజ్జా దశరథరామిరెడ్డి అరెస్ట్ ను రాయలసీమ సాంస్కృతిక వేదిక తీవ్రంగా ఖండించింది. అరెస్ట్ లతో సిద్దేశ్వరం అలుగు సాధనా ఉద్యమాన్ని అడ్డుకోలేరని ప్రజలు మరింత చైతన్యవంతులై సీమ పురోగతిపై ఉద్యమిస్తారని వేదిక నాయకుడు డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి అన్నారు. బొజ్జా దశరథ రామిరెడ్డి గారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.