కాకినాడ పోర్ట్ లో ఎన్ని విభాగాలో తెలుసా?
కాకినాడ పోర్ట్ అంటే ఏమిటి? అసలు కాకినాడ పోర్టులో ఎన్ని విభాగాలు ఉన్నాయి. అవి ఎవరి అధీనంలో ఉన్నాయి. అందులో ఏ వ్యాపారస్తులు ఉంటారు?
ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ పోర్ట్ ఎగుమతి దిగుమతులకు పెట్టింది పేరు. ఇప్పటి వరకు ఎటువంటి మచ్చ లేకుండా పోర్టు నుంచి ఎగుమతి దిగుమతులు జరుగుతున్నాయి. అసలు పోర్ట్ అంటే ఏమిటి? అందులో ఎన్ని విభాగాలు ఉన్నాయి. తెలుసుకుందాం. పోర్టుల నిర్మాణాలకు సముద్రంలోని అనువైన తీర ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు. అక్కడి నుంచి సరుకులు ఎగుమతి, దిగుమతులకు అనువుగా ఉంటుందని భావిస్తే ప్రభుత్వం పోర్టుల నిర్మాణాలకు అనుమతులు ఇస్తుంది. ఈ పోర్టుల ద్వారా జరిగే వ్యాపారాలు భారీ స్థాయిలో ఉంటాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరుకులు సరఫరా చేసే కంటే విదేశాలకు ఎగుమతులపైనే ఎక్కువ దృష్టి పెడతారు. కాకినాడ పోర్టు నుంచి ఎక్కువగా బియ్యం, ఇతర వస్తువులు, ఆయిల్స్ ఎగుమతి, దిగుమతులు జరుగుతుంటాయి. ప్రభుత్వం సెజ్ ల పేరుతో ప్రైవేట్ వారికి ఇచ్చి పోర్టులు నిర్మించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.
కాకినాడ యాంకరేజ్ పోర్టు (Kakinada Anchorage Port): ఈ పోర్టులోకి ఓడలు దగ్గరికి వచ్చే అవకాశం లేదు. కనీసం రెండు కిలో మీటర్ల దూరంలో సముద్రం మధ్య లంగర్ వేసి ఓడలను నిలబెడతారు. లోడింగ్, అన్ లోడింగ్ అంతా షిప్ వద్దనే జరుగుతుంది. అక్కడి వరకు లాంగ్ లాంచ్ లు (బ్యాడ్జీలు), సరుకులు తీసుకు వెళ్లి లోడింగ్, అన్ లోడింగ్ లు చేస్తాయి. ఈ వ్యవహారంలో మిషన్స్ ఉపయోగించరు. కేవలం మ్యాన్ పవర్ మీదనే ఈ పోర్టు ఆధారపడి పనిచేస్తుంది. ఎగుమతి, దిగుమతి ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి. ప్రధానంగా బియ్యం సరఫరా ఈ పోర్టు నుంచి జరుగుతుంది. ఈ పోర్టు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అధీనంలో ఉంది. వచ్చే లాభ నష్టాలు ఏవైనా ప్రభుత్వమే చూసుకుంటుంది. పవన్ కళ్యాణ్ పరిశీలించింది కూడా ఈ పోర్టునే. ఇందులోనే దొంగ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
డీప్ వాటర్ పోర్టు (Kakinada Deep Water Port): ఈ పోర్టు నుంచి కంటైనర్లు, ఎరువులు, బొగ్గు, కోరమాండల్, కాకినాడ ఫర్టీలైజర్స్ వంటి కంపెనీల ఎరువులు, వివిధ రకాల రా మెటీరియల్, పెద్ద పార్సిల్స్ వంటివి ఎగుమతి, దిగుమతి జరుగుతుంటాయి. డీప్ వాటర్ పోర్టులో మూడు బెర్త్ లు ఉన్నాయి. ఈ బెర్త్ ల వద్దకు వచ్చి లాంచ్ ఆనుకుంటాయి. నేరుగా సరుకును లాంచ్ పైకి క్రేన్స్, ఇతర పరికరాల ద్వారా తరలిస్తారు. మ్యాన్ పవర్ ఉపయోగించినా చాలా తక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం ఈ డీప్ వాటర్ పోర్టుకు కేవీ రావు (కె వెంకటేశ్వరావు) ఓనర్ గా ఉన్నారు. 1999లో పోర్టు నిర్మించిన తరువాత దీనిని అప్పటి ప్రభుత్వం కేవీ రావుకు విక్రయించింది. ఈ పోర్టులో లాంచ్ లకు సరుకులు ఎన్ని టన్నులు ఎత్తారనే దానిపై ఆధారపడి వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటారు. పోర్టు మేనేజ్ మెంట్ వీరి చేతుల్లో ఉంటుంది కాబట్టి నిబంధనల ప్రకారం రవాణాకు సంబంధించిన చార్జీలు, ఇతర చార్జీలు అన్నీ చెల్లించాలి.
రవ్వ క్యాప్టివ్ పోర్టు (Ravva Captive Port): ఆయిల్ కంపెనీల వారు మెయింటెయిన్ చేసే పోర్టు. వారి సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. సముద్రంలో చమురు ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నందున కృష్ణా, గోదావరి బేసిన్ ల నుంచి చమురును ఇక్కడికి తీసుకొచ్చి విదేశాలకు తరలిస్తారు. గ్యాస్ కూడా అలాటే తరలిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫీల్డ్ వారు ఈ పోర్టు నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రతి రోజూ 95 మిలియన్ స్టాండర్ట్స్ క్యూబిక్ ఫీట్ న్యాచురల్ గ్యాస్, సుమారు 70,000 బ్యారెల్స్ ఆయిల్ ఎగుమతులు జరుగుతుంటాయి. ఇంకా పలు రకాల ఆయిల్స్ కు సంబంధించిన ఎగుమతి దిగుమతులు ఉంటాయి.
ప్రభుత్వానికి చేత కాక ప్రైవేట్ వారికి: ప్రభుత్వానికి చేత కాక పోర్టుల్లో బిజినెస్ వ్యవహారాలు ప్రైవేట్ వారికి కట్టబెడుతున్నాయి ప్రభుత్వాలు. దీంతో వారు కోటాను కోట్లు సంపాదించడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా తగాదాలు పడి కేసులు పెట్టుకుంటుంటారు. తనను బెదిరించి తన కంపెనీ నుంచి ఆరో ఇన్ ఫ్రా (అరబిందో) వారు అక్రమంగా సగం వాటా రాయించుకున్నారని కేవీ రావు మంగళవారం ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలోని పెద్దలు ఈ దందాకు పాల్పడ్డారని ఆరోపించారు. అందులో వై విక్రాంత్ రెడ్డి, వి విజయసాయిరెడ్డి బంధువులు ఉన్నారని వారి పేర్లు కేసులో పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ అధిక వాటాలు కేవీ రావు పేరుతోనే ఉన్నాయి. ఆయనే ఎండీగా ఉన్నారు. లాభం వచ్చినా, నష్టం వచ్చినా వాటాదారులంతా సమానంగా పంచుకుంటారు.