చెయ్యెత్తి జై కొట్టిన తెలుగోడు మన ఆంధ్రుడే
‘‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా’’ అని తెలుగుజాతి చైతన్యాన్ని మేల్కొల్పిన ఈ ప్రజాకవి మన తెలుగోడు. ఆయన ఎవరో తెలుసా..
By : The Federal
Update: 2024-04-15 03:20 GMT
కమ్యూనిస్టుల పొట్టి పేర్లు భలే గమ్మత్తుగా ఉండేవి. సీఆర్ (చండ్రరాజేశ్వరరావు), ఎన్ఆర్ (నీలం రాజశేఖరరెడ్డి, ఏస్ఏ డాంగే (శ్రీపాద అమృత డాంగే), పీఎస్ (పుచ్చలపల్లి సుందరయ్య) అలా చాలామంది ప్రముఖ కమ్యూనిస్టులకి పొట్టి పేర్లు ఉండేవి. అదే కోవలో గుంటూరు జిల్లాలో కేఎన్ (కనపర్తి నాగయ్య), వీఎస్కే (వేములపల్లి శ్రీకృష్ణ), జీవీకే (జీ. వెంకట కృష్ణారావు).. ఇలా చాలామందికి ఉండేవి. ఆంధ్రప్రదేశ్‌లో మంచి కమ్యూనిస్టులు అని చెప్పుకోదగిన పది మందిలో బహుశా వేములపల్లి శ్రీకృష్ణ ఉండవచ్చు. మూడు సార్లు ఎమ్మెల్యే అయినా రిక్షా తప్ప కారు లేదనేవారు. తెల్ల పంచే, తెల్ల చొక్కా, జేబులో పెన్నూ... బక్కపల్చటి మనిషి. బాగా విద్వత్ ఉన్న వారని చెబుతారు. అందువల్లనే ఆయన జర్నలిస్టు కూడా అయి ఉంటారు. అటువంటి వేములపల్లి శ్రీకృష్ణ రాసిన ఓ గీతం తెలుగు సాహిత్య కిరీటంలో కలికితురాయిగా మిగిలింది. అదే..
చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా’’. తెలుగుజాతి చైతన్యాన్ని మేల్కొల్పిన ఈ ప్రజాకవి ముమ్మూర్తులా మన తెలుగోడు. ఆంధ్రవాసి. విశాలాంధ్ర దినపత్రిక సంపాదకుడు అని ఈ తరంలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ ఒక్క గేయం కొన్నేళ్ల పాటు తెలుగునేలను పిక్కటిల్లేలా చేసింది. వేర్పాటు వాదాన్ని అప్పటికింకా భుజాన వేసుకోలేదు. సమైక్యతే ముద్దు అని నినదించినందుకు మంగళగిరిలో ఈ వేములపల్లి శ్రీకృష్ణకి జైఆంధ్ర ఉద్యమకారులు నిప్పుకూడా పెట్టారు. తెలుగు పటిమను, ధైర్య సాహసాలను, పాండిత్య ప్రతిభను, తెలుగు సంస్కృతీ వెలుగుజిలుగులను వేనోళ్ళ కొనియాడారు.
చేయెత్తి జైకొట్టు తెలుగోడా..!!’’ అన్న ఆయన పిలుపునకు యువత పౌరుషంతో పరుగులెత్తింది ఆ రోజుల్లో. తెలుగుతనాన్ని తట్టిలేపి దేశ రాజకీయాల్లో చైతన్యం కలిగించింది. ఈ పాటను వేములపల్లి శ్రీకృష్ణ కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థగా ఉండే ప్రజానాట్యమండలి కోసం రాశారు. కానీ ఈ పాట ఎన్టీరామారావుకు ఉపయోగపడినంతగా కమ్యూనిస్టు పార్టీకి ఉపయోగపడలేదంటుంటారు.
తెలుగుజాతి చైతన్యాన్ని మేల్కొల్పిన ప్రజాకవి వేములపల్లి. నిబద్ధత కలిగిన జర్నలిస్టు. నిరాడంబరంగా నిజాయితీ ఊపిరిగా బతికిన కమ్యూనిస్టు. సాదాసీదా జీవితం సాగించి, మూడుసార్లు శాసనసభ ప్రజాప్రతినిధిగా సేవలందించిన గొప్పవాడు వేములపల్లి శ్రీకృష్ణ. విస్తృత జీవితానుభవాలతో, రాజకీయ ఉద్యమానుభావాలతో రాటుదేలిన శ్రీకృష్ణ ఎలా ఉండేవారో పాత కమ్యూనిస్టు తరానికి, తలపండిన పాత్రికేయ మిత్రులకు మాత్రమే స్ఫురణకు వస్తారు. కొద్దిమందికి ఆయన ఒక పాత్రికేయునిగా గుర్తు. విశాలంధ్ర ఎడిటర్ గా పని చేశారు. తరతరాల సాహితీవేత్తలకూ, ప్రజాప్రతినిధులకు ఆదర్శనీయులుగా నిలిచారు. ఆయన కామ్రేడ్ శ్రీకృష్ణగా అందరికి పరిచితులు.
శ్రీకృష్ణ రేపల్లెలోని బేతపూడిలో మధ్యతరగతి రైతు కుటుంబంలో 1917లో జన్మించారు. పాఠశాలలో బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, పరంధామయ్య, పమిడిముక్కల లక్ష్మణరావు, కంఠంనేని వెంకటరత్నం తదితర ప్రముఖులు శ్రీకృష్ణకు సీనియర్లు. వారితో పరిచయం, ఆనాటి జాతీయోద్యమం, అతివాద సాహిత్యం ఆయనపై ప్రభావం చూపి కమ్యూనిజం వైపు అడుగులు వేయించాయి. గుంటూరులో బ్రాడీపేటలో చదువుతున్న కాలంలో పులుపుల శివయ్య, ప్రభల కృష్ణమూర్తి, ప్రతాప రామసుబ్బయ్య, ఏటుకూరి బలరామమూర్తి, అమరవాది కృష్ణమూర్తి వంటివారితో ఏర్పడిన బంధాలు, సంబంధాలు కారణంగా 1935-36లో పార్టీ అగ్జిలరీ విభాగంలో ప్రవేశించారు. 1938లో పార్టీ సభ్యత్వం పొందారు.
చీరాల ఐ.ఎల్.టి.డి. కార్మికుల సమ్మె పోరాటంలో పోలీసు కాల్పులు జరిగిన సమయంలో సమ్మెలోని కార్మికుల సహాయార్ధం కన్యాశుల్కం నాటకం ప్రదర్శించి వచ్చిన ఆదాయమంతా కార్మికులకందించారు. బి.ఏ.పట్టా అందుకున్న తరువాత కొంతకాలం బందరు మ్యూచువల్ ఇన్సూరెన్సు కంపెనీలో ఉద్యోగం చేసారు. ఆ సమయంలో గుంటూరు నుంచి పులుపుల వెంకట శివయ్య పిలుపుతో ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ రహస్య యంత్రాంగ నిర్వహణ బాధ్యత చేపట్టారు. 1937లో కొత్తపట్నంలో నిర్వహించిన రాజకీయ పాఠశాలకు హాజరై, ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి లాఠీఛార్జ్జి లో గాయపడ్డారు..
1942-43 లో హిట్లర్ సైన్యాలను మాస్కో వద్ద రెడ్ ఆర్మీ అటకాయించి తిప్పికొడుతున్న రోజుల్లో ‘మాస్కో పొలిమేరల్లోనా’కోలాటం పాట, బెంగాల్ కరవుపై ‘బ్రహ్మపట్నం పోదామంటే’ అంటూ, కయ్యూరు వీరులపై… ఇలా ఎన్నోపాటలు రాశారు. 1948లో కమ్యూనిస్టు పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శిగా, అనంతరం రెండుసార్లు రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సభ్యులుగా, రెండుసార్లు జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికై సమర్థతతో బాధ్యతలు నిర్వర్తించారు. గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా పని చేసిన వల్లూరు గంగాధరరావుకు ముందు పెదకాకాని హేమలత టెక్స్‌టైల్ మిల్‌వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు.
1952లో బాపట్ల నుంచి, 1962, 1972లో మంగళగిరి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. శాసనసభలో కమ్యూనిస్టు పక్ష నాయకునిగా, పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 1964-65లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం సందర్భంగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హైదరాబాద్ లోని సి.ఆర్.ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి దాని నిర్మాణానికి విశేష కృషి చేశారు. భారత్- సోవియట్ మిత్రమండలి, శాంతి స్నేహ సంఘాల అభివృద్ధికి శ్రమించారు. అఖిల భారత శాంతి సంఘం నాయకుడు రమేశ్ చంద్రతో కలిసి అవిరళ కృషి చేశారు. అనేక దేశాల్లోనూ పర్యటించారు.
శ్రీకృష్ణ 2000లో ఏప్రిల్ 8న హైద్రాబాద్‌లో కన్నుమూశారు.
‘‘మనసులోని అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పటం అలవర్చుకోండి. ప్రజల దైనందిన సమస్యలు తెల్సుకుని సాన్నిహిత్యం పెంచుకోండి. చెప్పే మాటలకూ, చేసే పనులకూ దూరం పెరిగే కొద్దీ మీకు ప్రజలు దూరమవుతారు. సిద్ధాంత పరిజ్ఞానంతోపాటు వాస్తవ పరిస్థితుల అధ్యయనం అవసరం.’’ అనే స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు ఆయన్ను చిరస్మరణీయునిగా నిలిపాయి.
వేములపల్లి రాసిన ఈపాటను 1952లో పల్లెటూరు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడారు. ఆ పాట తెలుగునాట ఓ సంచలనం. ఈ పాటలోని తొలి శరణమే ఆ తర్వాత ఎన్టీఆర్ చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమానికి నినాదమైంది..
చెయ్యేతి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తీ గలవోడా
వీర రక్తపుదార వార వోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ తాండ్రపాపయ్య కూడ నివోడోయ్
నాయకినాగమ్మ మల్లమాంబ మొల్ల మగువ మంచాల నీ తోడ బుట్టిన వోళ్ళే
వీర వనితల కన్న తల్లేరా ధీరమతాల కన్నభూమేరా
కల్లోల గౌతమీ వెల్లువలా కృష్ణమ్మ తుంగభద్రాతల్లి పొంగిపారిన చాలు
ధాన్యరాశుల పండు దేశాన కూడు గుడ్డకు కొదువలేదోయి
ముక్కోటి బలగామొయ్ ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగూలోనా ఊరుపేరుంటాది
తల్లిఒకటే నీకు తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేలా
పెనుగాలి వీచిందీ అణగారిపోయింది
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది చుక్కాని బట్టారా తెలుగోడా ..నావ దరి చేర్చారా మొనగోడ
వేములపల్లి శ్రీకృష్ణ