జూన్ 4 రాత్రి 9లోగా పూర్తి ఫలితాలు
ఇప్పటికే పూర్తి అయిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లు. జూన్ 4న సమస్యాత్మక ప్రాంతాల్లో అమల్లోకి 144 సెక్షన్.
Byline : The Federal
Update: 2024-05-30 13:16 GMT
ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి ఎన్నికల ఫలితాలను జూన్ 4 రాత్రి ప్రకటించనున్నారు. కొన్ని నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతకంటే ముందే పూర్తి అయినా కొన్ని నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కావడానికి ఎక్కువ సయమం పట్టనుంది. రాత్రి 8 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని నియోజక వర్గాల తుది ఫలితాలను జూన్ 4 రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రకటించనున్నారు. 111 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 20 రౌండ్లు, 61 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 21 రౌండ్ల నుంచి 24 రౌండ్లు, మిగిలిన 3 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 25 రౌండ్లకుపైగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జూన్4న ప్రారంభం కానుంది. ఆ మేరకు ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. కౌంటింగ్ రోజు సమస్మాత్యక జిల్లాలు, ప్రాంతాలలో 144 సెక్షన్ విధించనున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను 111 అంసెబ్లీ నియోజక వర్గాల్లో ఓట్ల లెక్కింపు జూన్ 4 మధ్యాహ్నం 2 గంటలకు పూర్తి కానుంది. మరో 61 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సాంత్రం 4 గంటలకు పూర్తి కానుంది. మిగిలిన అసెంబ్లీ నియోజక వర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఢిల్లీలోని నిర్వచన్ సదన్ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ, దానికి సంబందించిన ఏర్పాట్లపైన సీఈఓ ముకేష్ కుమార్ మీనాతో సమీక్షించారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలోని సమస్యాత్మక జిల్లాలు, ప్రాంతాలలో 144 సెక్షన్‌ను అమలు చేసేందుకు సీనియర్ పోలీసు అథధికారులను కూడా నియమించినట్లు వెల్లడించారు. పోలింగ్ అనంతరం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న జిల్లాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్నాడు జిల్లాలో రాష్ట్ర డీజీపీతో కలిసి పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలించి, అధికారులను అప్రమత్తం చేసినట్లు వివరించారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశారు. రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి శంఖబ్రత బాగ్జీ ఆధ్వర్యంలో పోలీసు పహార కాయనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాగానే ఫలితాలకు సంబంధించిన ఫామ్ 21సి, ఫామ 21ఇలను అదే రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు.