జనసేన ఈ సారి ఎన్ని సీట్లు గెలవబోతోందంటే..

పార్టీ ఏర్పాటు చేసి పదేళ్లైనా గెలుపును దక్కించుకోవడంలో వెనకబడింది. ఈ సారి పరిస్థితులు అందుకు భిన్నం. సగానికిపైగా సీట్లల్లో జనసేన గెలుపు.

Byline :  The Federal
Update: 2024-05-20 12:17 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గెలుపు ఓటములు ఎలా ఉంటాయనేది రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు గెలుపు ఖాతా తెరపక పోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. మొదటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. తర్వాత ఆ ఎమ్మెల్యే కూడా వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లి పోయారు. ఆ ఎన్నికల్లో సరాసరి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సైతం రంగంలోకి దిగినా గెలుపు దక్కించుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో 2024ఎన్నికల్లో జనసేనకు గెలుపు ఓటములు అనేవి అత్యంత కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి తరపున జనసేన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ ఎన్నికల్లో కూటమి మిత్రులు తెలుగుదేశం తర్వాత బీజేపీతో పోల్చుకుంటే జనసేనకు మంచి ఆదరణ ఉందనే టాక్‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో జనసేన బరిలో ఉన్న 21 స్థానాల్లో సగానికిపైగా స్థానాలలో గెలుపు సొంతం చేసుకునే చాన్స్‌ ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. సుమారు 14 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని, మరో మూడు స్థానాల్లో పోటా పోటీ నెలకొందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి సులువుగానే గెలుస్తారని, అయితే మెజారిటీ ఎంత వస్తుందనే దానిపైనే అందరు అంచనావు వేసుకుంటున్నారని చర్చ సాగుతోంది. ఇక తెనాలి అసెంబ్లీ నుంచి బరిలో ఉన్న జనసేన పీఏసీ చైర్మన్‌ నేత నాదెండ్ల మనోహర్‌ గెలపు ఖాయమనే టాక్‌ నడుస్తోంది. ఎన్నికల సమయంలో తెనాలిలో చోటు చేసుకున్న ఓటరు సుధాకర్‌పై సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ చేయి చేసుకున్న సంఘటన సంచలనంగా మారడంతో పాటు ఓటర్లలో కూడా ప్రభావం చూపిందనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఇది నాదెండ్ల మనోహర్‌కు అనుకూలంగాను, వైఎస్‌ఆర్‌సీపీకి ప్రతి కూలంగానూ మారిందనే చర్చ కూడా స్థానికుల్లో ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో మాత్రం జనసేనకు గట్టి పోటీ ఉందని, వీటిల్లో వైఎస్‌ఆర్‌సీపీ పై చేయి సాధించే చాన్స్‌ ఉందనే టాక్‌ కూడా ఆ నియోజక వర్గాల స్థానికుల్లో వినిపిస్తోంది. పాలకొండ, పోలవరం స్థానాల్లో జనసేనకు వ్యతిరేక ఫలితాలు వచ్చే చాన్స్‌ ఉందనే టాక్‌ ఉంది. అయితే రాజోలులో మాత్రం జనసేనకు సానుకూలంగానే ఉందని, పిగన్నవరం మాత్రం పోటా పోటీగానే ఉండే చాన్స్‌ ఉంది. ఇక రాజానగరంలో గట్టి పోటీ ఉందని భావించినా పోలింగ్‌ నాటికి సానుకూలంగా మారిందనే టాక్‌ వినిపిస్తోంది.
అయితే పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో జనసేన బరిలో ఉన్న చోట్ల జనసేన జెండా ఎగురొచ్చని అంచనా వేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో మాత్రం జనసేనకు ఎదురు దెబ్బ తగిలే చాన్స్‌ ఉందని అంచనా వేస్తున్నారు. రైల్వేకోడూరు, తిరుపతి నియోజక వర్గాల్లో జనసనేన కంటే వైఎస్‌ఆర్‌సీపీకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో జనసేన అభ్యర్థిగా రంగంలో ఉన్న మండలి బుద్దప్రసాద్‌ గెలుపు ఈజీగానే ఉంటుందని భావిస్తున్నారు. నిడదవోలు, రాజానగరంలో గట్టి పోటీనే నెలకొందని భావిస్తున్నారు. విశాఖపట్నం దక్షిణంతో పాటు నరసాపురం, భీమవరం నియోజక వర్గాల్లో కూడా జనసేన జెండా ఎగురుతుందనే భావన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇక వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మంత్రి కొట్టు సత్యనారాయణకు తాడేపల్లిగూడెంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, అభివృద్ధి పనులు ఏమీ చేయలేదని, స్థానిక సమస్యలు పరిష్కరించడంలో వెనకబడ్డారనే విమర్శలు ఉన్నాయి. ఇవి జనసేన అభ్యర్థికి సానుకూలంగా మారాయని టాక్‌ ఉంది. దీంతో కొట్టు సత్యనారాయణపై బొలిశెట్టి శ్రీనివాస్‌ సులువుగానే గెలుస్తారనే టాక్‌ స్థానికుల్లో ఉంది. ఇక అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి స్థానాల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు టీడీపీకి బలమైన సానుకూలత ఉండటం జనసేన గెలుపునకు దోహదం చేస్తాయని అంచనా వేస్తున్నారు. కాకినాడ రూరల్‌ నుంచి పంతం నానాజీ కూడా గెలుస్తారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏలూరు జిల్లా ఉంగుటూరు జనసేనకు టఫ్‌ ఉందనే అంచనాల్లో ఉన్నారు. నెల్లిమర్లలో కూడా ఇదేరకమైన వాతావరణం ఉందని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు సరిగా సహకరించ లేదనే విమర్శలు జనసేన శ్రేణుల్లో ఉన్నాయి.
Tags:    

Similar News