ఇండోసోల్ కభళించబోతున్నరెండు ఆంధ్రా పల్లెల దీనగాథ ఇది...
ఎన్డీయే ప్రభుత్వం దూకుడు, ప్రతిపక్షం మౌనం...అర్థం కాక ప్రజలు సతమతం;
Byline : G.P Venkateswarlu
Update: 2025-07-06 10:53 GMT
కరేడు రామకృష్ణాపురం ఎస్టీ కాలనీ, ఉప్పరపాలెం కాలనీలు తొందర్లో మాయమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీ కి వీటిని అప్పగించబోతున్నది. ఇక్కడ ఒక మహా సోలార్ ప్లాంట్ కోసం చేసే భూ సేకరణతో ఈ కాలనీలు మొదట కనుచూపు నుంచి మాయమవుతాయి. తర్వాత రికార్డుల్లో అడ్రసు లేకుండాపోతాయి.
పచ్చని పంట పొలాలు, పండ్ల తోటలు, కావాల్సినంత భూగర్భజలం, అహ్లాదకరమైన వాతావరణం ఇంతవరకు వారి సొంతం. రేపు మూటాముల్లె సర్దుకుని ఎక్కడో మారుమూల పునరావాసకేంద్రానికి భారంగా వెళ్లిపోతారు. ఇపుడయితే ఈ ప్రాంతంలోని గ్రామాలు, కాలనీలు పచ్చని చెట్లతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఎంతో హాయిగా జీవిస్తున్న ఈ పల్లె భూముల మీద కార్పొరేట్ కంపెనీ ఒకటి వాలనుంది. ఇక్కడి పచ్చని పంట పొలాలు సొంత చేసుకునేందుకు ప్రభుత్వం అండ తీసుకుంది. విద్యుత్ కంపెనీ ఏర్పాటు పేరు మీద ఇండోసోల్ సోలార్ పడగ ఇక్కడ విచ్చుకుంటూ ఉంది. దీన్నుంచి ఇక తప్పించుకోవడం కష్టమే.
ఉప్పరపాలెం కాలనీ
మాయం కానున్న రెండు ఊళ్లు..
ఉలవపాడు మండలంలో ఉన్న రామకృష్ణాపురం, ఉప్పరపాలెం గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీలు అవతలివాళ్ల దృష్టిలో కాపాడుకోదగ్గ జనావాసాలు కాదు. అవి ఎస్సీ ఎస్టీ కాలనీలు. ఆ పేరులో తృణీ కార భావం ఉంది. రామకృష్ణాపురంలో 145 ఇళ్లున్నారు. జనాభా 478. ఉప్పరపాలెంలో 161 ఇళ్లు, 610 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రామకృష్ణాపురంలో గిరిజన బాలికల విద్యాలయం ఉన్నాయి. సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీల జీవితాలు ఈ భూములతో ముడిపడి ఉన్నాయి. “మా ఇళ్లు, మా పాఠశాలలు, మా జీవనం... ఇవన్నీ కాపాడుకోవాలని కంపెనీకి చెప్పండి,” అని రామకృష్ణాపురం నివాసి ఒకరు కన్నీళ్లతో వాపోయారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు ప్రాంతంలో ఉన్న బంగారం లాంటి భూములు సోలార్ విద్యుత్కేంద్రం స్థాపించేందుకు ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఈ కంపెనీ చెప్పినట్లు వింటూ కూటమి ప్రభుత్వం స్థానిక రైతులు, వ్యవసాయ కూలీల నిర్వాసితులను చేసేందుకు ఈ మేరకు విడుదలైన జీవోల్లో రెండు గ్రామాలు పేర్లున్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు నెలకొల్పాంటే భూములుండాలి. భూములు ఎక్కడి నుంచి వస్తాయి. గ్రామాలలో పేదల భూములనే సేకరించాలి. ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఎగువ మంది పేదరైతులు, ఎస్సీ, ఎస్టీ బిసిలు. వాళ్ల డి పట్టా భూములు. రాష్ట్రాభివృద్ధికి రైతులు భూములు త్యాగం చేయాల్సిందే నని ప్రభుత్వం అంటున్నది. ఇలాంటి 33 వేల ఎకరాల త్యాగం మీదే అమరావతి అంతర్జాతీయ నగరం లేస్తున్నద అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అమరావతి రైతుల్లాగే రాష్ట్రమంతా రైతులు తమ భూములను పరిశ్రమలకు, విమానాశ్రయాలకు, పోర్టులకు ఇవ్వాలని ఆయన అంటున్నారు.
మాకు అభివృద్ధి అవసరం లేదు: కుమారి
“మాకు ఎకరా పొలం ఉంది. వరి పండిస్తాము. ఇప్పుడు పొలం ఇవ్వండి మా ఇల్లు ఖాళీ చేయండి అంటున్నారు. ఎలా? మేము ఇక్కడ సంతోషం గా ఉన్నాము. మాకు అభివృద్ధి అవసరం లేదు.ఎక్కడైనా వెళ్లి పోండి, డబ్బు ఇస్తాం అంటున్నారు. ఖాళీ చేయించడం ఎందుకు?ఆదుకోవడం ఎందుకు? మమ్మల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా జీవించనిస్తే చాలు,” అని ఉప్పరపాలెం గ్రామానికి చెందిన చిన్నకారు రైతు సుదర్శి కుమారి పేర్కొన్నారు.
“మా గ్రామం ఎప్పుడు నిర్మించారో మాకు తెలియదు. మాతాతలు, తండ్రుల నుంచి మేము ఇక్కడే జీవిస్తున్నాము. ఇప్పటికిప్పుడు మా ఊరిని, ఉన్న ఇంటిని ఖాళీచేసి వెళ్లమంటే మేమెక్కడ జీవించాలి. హాయిగా జీవిస్తున్న మాజీవితాల్లో ఈ కంపెనీ చిచ్చు పెట్టింది. మమ్మల్ని ఇక్కడ బతకకుండా చేస్తోంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కంపెనీ కోసం ప్రభుత్వం సేకరించాలనుకునే భూముల్లో 8,234 ఎకరాల భూమి ఒంగోలు-నెల్లూరు హైవే నుంచి సముద్రం వరకు ఉంటుంది. హైవేకు ఇరువైపుల ప్రభుత్వం సేకరించే భూములు ఉన్నాయి. సోలార్ పవర్ పేరుతో కంపెనీ వాళ్ల ప్రయోజనాల కోసం ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పల్లెలు, పల్లె వాసులను అక్కడి నుంచి తరిమేయాలనే ఆలోచనపై అన్ని వర్గాలు భగ్గుమంటున్నాయి.
మా గ్రామాన్ని వదిలేదే లేదు: రామలక్ష్మమ్మ
కరేడు రామకృష్ణాపురం ఎస్టీ కాలనీకి చెందిన వ్యవసాయ కూలీ పొన్నం రామలక్ష్మమ్మ ‘ది ఫెడరల్ ప్రతినిధి’తో మాట్లాడుతూ మేము ఎంతో పోరాడి సాధించుకున్న గ్రామం ఇది. వరదలు వచ్చినప్పుడు అధికారులు వచ్చి ఖాళీ చేయాలని చెప్పారు. రాళ్ల పాడు వరద 1992లో వచ్చినప్పడు 4 గురు చనిపోయారు. అయినా వెళ్ళకుండ బ్రిడ్జి కట్టించుకుని వరద రాకుండా చేసుకుని ఉన్నామని ఆమె చెప్పారు.
“ఇప్పుడు వెళ్లిపోండి అంటే ఎలా వెళ్తాము, మా గ్రామం ఖాళీ చేసేది లేదు. ఇక్కడ ఎన్నేళ్లుగా జీవిస్తున్నామో మాకే తెలియదు. మా తాతలు, తండ్రుడు, వాళ్ల పిల్లలమైన మేము, మా పిల్లలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము. ఈ మట్టి మా సొంతం మా నుంచి ఈ మట్టిని ఎవ్వరూ వేరు చేయలేరని చెప్పారు. కూరగాయల పంటలు నిత్యం పండుతుంటాయి. మాకు ప్రతి రోజూ కూరగాయలు, ఆకు కూరలు కోసే పని ఉంటుంది. ఎవ్వరితో మాకు పనిలేదు.ఎవ్వరి సాయం అవసరంలేదు. వ్యవసాయ కూలీలుగా మేము. రైతులుగా పంటలు వేసే మా ఊరివారు ఉంటే చాలా అదే మాకు పదివేలు,” అంటారామె.
రామకృష్ణాపురం కాలనీ
కంపెనీకి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిన సర్కార్
ఆంధ్రప్రదేశ్‌లో ఇండోసోల్ సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు ప్రాంతంలో 8,234 ఎకరాల భూమి సేకరణపై తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం మొదటి విడతలో 4,912 ఎకరాల సేకరణకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక రైతులు తమ జీవనాధారమైన సారవంతమైన భూములను కోల్పోతామని భయపడుతూ, పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
ఇండోసోల్ యాజమాన్యంలోని షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంబంధిత కాంట్రాక్టులతో బాగా లబ్ధి పొందింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ కంపెనీతో అనుబంధం పెంచుకుంది. కంపెనీ పెట్టుబడులకు అనుకూలంగా జీవోలు జారీ చేస్తూ భూ సేకరణకు ముందుకు సాగుతోంది. ఈ నిర్ణయం స్థానికుల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం రైతుల జీవనాధారాన్ని పణంగా పెడుతోందా అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. వైసిపి, ఎన్డీయే రెండు ప్రభుత్వాలు కూడా ఈ కంపెనీకి సమానం అండగా నిలవడం పట్ల ఈ ప్రాంత ప్రజలు విస్మయం చెందుతున్నారు. ప్రభుత్వం దూకుడు, ప్రతిపక్షం మౌనంతో వీళ్లకు ఏమి చేయాలో అర్థంకాక సమతమతమవుతున్నారు. ఇపుడు వీళ్లకు అండగా నిలించింది కొన్ని పౌర హక్కుల సంఘాలు, వామపక్ష పార్టీలే.
పచ్చని పంట భూములు...
కరేడు ప్రాంతంలో 19 రకాల పంటలు పండుతాయి. సమృద్ధిగా భూగర్భ జలాలతో సారవంతమైన భూములను ఇండోసోల్ కోసం సేకరించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జులై 4, 2025న జరిగిన గ్రామ సభలో వేలాది మంది రైతులు నిరసన తెలిపారు. భూ సేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసులు శాంతియుత నిరసనలను అడ్డుకోవడంతో ఉద్రిక్తతలను మరింత పెరిగాయి.
జులై 4, 2025న కరేడు గ్రామ సభలో వేలాది మంది రైతులు ఒక్కతాటిపైకి వచ్చి భూ సేకరణను వ్యతిరేకించారు. శాంతియుత నిరసనలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు మరింత ఉవ్వెత్తున ఎగిశాయి. “మా భూమి మాకు ఊపిరి. దాన్ని కాపాడుకోవడానికి ఎంతైనా చేస్తాం,” అని రైతు సంఘం నాయకుడు ఒకరు గట్టిగా చెప్పారు.
ఈ భూముల్లో పండే పంటలు కేవలం ఆహారం మాత్రమే కాదు, రైతుల ఆత్మగౌరవం, ఆశలు, కలలు. ఇండోసోల్ ప్రాజెక్టు ఆధునికత పేరుతో ఈ గ్రామాల జీవన స్రవంతిని మార్చివేయాలనుకుంటోంది. రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ సమయంలో, ప్రభుత్వం ఎటువైపు నిలబడుతుందన్నది కీలకం. ఈ వివాదం కేవలం భూమి గురించి కాదు, ఒక సమాజం యొక్క గుండె చప్పుడు గురించి.