'టీటీడీ బోర్డు' ఏర్పాటులో జాప్యానికి అవేనా కారణాలు?
టీటీడీ ఛైర్మన్ పోస్టు భర్తీలో ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో పాటు బోర్డు సభ్యుల నియామకంలో తాత్సారం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
Byline : SSV Bhaskar Rao
Update: 2024-10-23 10:33 GMT
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 123 రోజులు కావస్తోంది. టీటీడీ బోర్డు చైర్మన్, పాలక మండలి సభ్యుల కూర్పులో జాప్యం జరుగుతోంది. ఇందుకు రెండు ప్రధాన కారణాలే ప్రతిష్టంభనకు దారితీసినట్లు చెబుతున్నారు. సీఎం ఎన్. చంద్రబాబు మదిలో కొన్ని పేర్లు ఉన్నప్పటికీ మిత్రపక్షం జనసేన నుంచి కొంత ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, స్వపార్టీలోనే ముగ్గురు టీవీ ఛానళ్ల యజమానులు చెవిలో జోరీగలా రోద పెడుతున్నట్లు తెలిసింది. దీంతో చైర్మన్ ఎంపికలో ఆలస్యం అవుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
రాష్ట్రంలో టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి, 135 సీట్లు సాధించింది. మిత్రపక్ష జనసేన 21 సీట్లలో పోటీ చేసి, అన్నింటా విజయం సాధించింది. మరో మిత్రపక్షం బీజేపీ పది సీట్లలో పోటీ చేసి, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అంటే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే, వాటిలో 31 సీట్లు మిత్రపక్ష జనసేన, బీజేపీకి కేటాయించడం వల్ల టీడీపీ ఆ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలపలేని స్థితి. కాగా,
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఐదేళ్ల పాటు పార్టీ కోసం కష్టాలు అనుభవించిన టీడీపీ నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెంచుకున్నారు. అందులో దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా పేరున్న టీటీడీ చైర్మన్ పదవిపై చాలా మంది సీనియర్లతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు, ప్రధానంగా జనసేన నుంచి కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో నిరీక్షిస్తున్నారు. బీజేపీ గుంభనంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆ పార్టీ నేతలు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు.
సీఎం చాతుర్యం... తప్పని ఒత్తిడి
సీఎం చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరించినట్లు కనిపించింది. స్వపార్టీతో పాటు మిత్రపక్షాల ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి టీటీడీ చైర్మన్ గా సీనియర్ నేత, వివాద రహితుడైన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతిరాజు పేరును తెరపైకి తెచ్చారని పార్టీ వర్గాల నుంచి తెలిసింది. రోజుల వ్యవధిలోనే అశోక గజపతిరాజు "చైర్మన్ పదవి తీసుకోవడానికి విముఖత వ్యక్తం చేశారు" అనే వార్తలు వినిపించాయి. వాస్తవానికి రాజవంశీయుడైన ప్రముఖులకు స్వాగతించడం కష్టమే అనే మాటలు కూడా వచ్చాయి. అంతేకాకుండా, మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న ఆయన ఆధీనంలో అనేక ఆలయాలు, విద్యా సంస్థలు ఉన్నాయి. అక్కడ రాచమర్యాదలు అందుకునే అశోక గజపతిరాజు నుంచి సానుకూలత లభించని స్థితిలో టీటీడీ చైర్మన్ పదవికి నేతను ఎంపిక చేయడంలో తాత్సారం జరగడానికి దారితీసింది.
అంత ప్రాధాన్యం ఎందుకు?
టీటీడీ పాలక మండలిలో 13 లేదా 25 మంది ధర్మకర్తల మండలి సభ్యులు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు టీటీడీ ఈఓ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. పాలక మండలి సమావేశం జరిగే ముందు రోజు వచ్చే సభ్యులకు ఉచితంగా గది కేటాయిస్తారు. వాహన సదుపాయం, అటెండర్, పీఏ ఉంటారు. వారికి దర్శన కోటా విషయం పరిశీలిస్తే రోజుకు 12 నుంచి 24 మందికి బ్రేక్ దర్శనాలు చేయించడానికి వెసులుబాటు ఉంటుంది. ప్రత్యేక దర్శనాల కోటాలో 20 మందికి దర్శనం చేయించడానికి ఆస్కారం ఉంటుంది. వారి సిఫారసు లేఖలపై కూడా ఆర్జిత సేవా టికెట్లు కేటాయిస్తారు. ఆయితే.. గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్ కు తలదన్నే రీతిలో సుమారు 90 మంది సభ్యలను నియమించి, వివాదం రేకెత్తించారు. ఆ తరువాత ఈ విషయం కోర్టుకు చేరడంతో చక్కదిద్దుకున్నారు. బోర్డు సభ్యుల నియామకంలో సాధారణంగానే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ర్ట నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది.
నాకు లేకున్నా.. పరవాలేదు...
దీంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి అండగా నిలిచిన టీవీ-5చైర్మన్ బీఆర్. నాయుడు పేరు మొదటి నుంచి ప్రముఖంగా వినిపిస్తోంది. దీనిని మరో రెండు చానెళ్ల (T.V Channel's) యజమానులు అడ్డుపడుతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మాకు లేకున్నా పరవాలేదు. ఆయనకు మాత్రం ఇవ్వకండి, అని మెలిక పెట్టినట్ఠు సమాచారం. దీంతో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక గజపతిరాజు సుముఖంగా లేకపోవడం, టీవీ ఛానల్ యజమాని అనుకుంటే, ఆయనకు వద్దని అడ్డుచెప్పడం వల్ల సీఎం ఎన్. చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ ఎంపిక ప్రక్రియ సమస్యగా మారినట్లు కనిపిస్తోంది. ఇదిలావుండగా, మూడు నెలల కిందట ముచ్చట ఒకటి గుర్తు చేసుకోవాలి...
కలిసొచ్చిన కల్యాణ్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడు నెలల కిందట విజయవాడ కార్యాలయంలో జనసేన పార్టీ నేతల మీట్ జరిగింది. అందులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు నిరాశ కలిగించినా, సీఎం చంద్రబాబుకు సానుకూలం అయ్యాయి. ఆయన ఏమన్నారంటే..
"మన వాళ్లందరూ నామినేటెడ్ చైర్మన్ పోస్టు అడుగుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీటిని సీఎం చంద్రబాబు ముందు ఎలా ఉంచాలి? మా పరిస్థితి ఏమిటి? అని సీఎం అడిగితే.. నేను ఏమని సమాధానం ఇవ్వగలను" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. "పార్టీ కోసం పనిచేశాం. మాకు ఇది ఇవ్వండి. నేను ప్రధాని మోదీని అడగగలనా? అప్పుడు విలువ ఉండదు కదా? అంటూనే ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల వ్యవహరించే సరళిని స్ఫూర్తిగా తీసుకోవాలి" అని హితబోధ చేయడం వల్ల జనసేన పార్టీ నేతలను ఉస్సూరుమనిపించారు. "పార్టీ సేవలకు కొందరు పరిమితం కావాలి" అనే మాటను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పారనే విషయం స్పష్టం అవుతుంది. "టీటీడీ చైర్మన్ పదవి కోసం దాదాపు 50 మంది దరఖాస్తులు ఇచ్చారు" అనే మాట కూడా చెప్పారు.
ఎందరో ఆశావహులు
టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. టీడీపీకి తోడు జనసేన, బీజేపీ నేతలు కూడా క్యూలో ఉన్నారు. తిరుపతి నుంచి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ ముందువరుసలో ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీ. భానుప్రకాష్ రెడ్డి ఆ పదవి, లేదా సభ్యత్వం ఆశిస్తున్నట్లు సమాచారం. వారిద్దరూ గతంలో టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశారు. ఈసారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన క్షత్రియ నేతకు అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బయటికి వచ్చిన బీసీ సామాజికవర్గ నేత, మాజీ ఎంఎల్సీ, ఎన్.టీ.ఆర్ కృష్ణా జిల్లా నుంచి కూడా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఆర్. రఘురామ కృష్ణంరాజుతో పాటు సినీరంగ ప్రముఖుల పేర్లు కూడా సోషల్ మీడియా (Social Media)లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో అన్న కొణిదెల నాగబాబు పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ఆయన స్పష్టత ఇచ్చారు. "నేను పోటీలో లేను. అవన్నీ పార్టీ అధ్యక్షుడు (పవన్ కల్యాణ్) నిర్ణయిస్తారు" అని నాగబాబు స్పష్టం చేయడం ప్రస్తావనార్హం. "అన్నయ్య నిరాకారాన్ని ప్రార్ధిస్తారు" అని పవన్ కల్యాణ్ కూడా పేర్కొనడం గమనార్హం. కాగా, వారిలో కాపు సామాజికవర్గానికి అవకాశం ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.
కాపులకు సందేహమే.!
కులాల సమీకణలు ప్రామాణికంగా తీసుకుంటే, టీటీడీ ఛైర్మన్ పదవి కాపులు (బలిజ) సామాజికవర్గానికి దక్కకపోవచ్చనేది ఓ విశ్లేషణ. తిరుపతి ఎమ్మెల్యేగా జనసేన పార్టీ నుంచి ఆరణి శ్రీనివాసులు గెలిచారు. ఆయనకు టీటీడీ బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అవకాశం ఉంది. దీంతో జనసేనకు రెండు పదవులు తిరుపతి నుంచే దక్కాయనేది స్పష్టం. బోర్డు సభ్యత్వం కోసం జనసేనలో, అది కూడా కాపు సామాజికవర్గం నుంచే ఔత్సాహికులు ఎక్కువగా ఉన్నారు.
తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ-తుడా (Tirupati Urban Devolopment Authority- TUDA) చైర్మన్ పదవి కూడా క్యాబినెట్ ర్యాంక్ స్థాయి పదవి. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న గొల్ల నరసింహయాదవ్ కు చాలా కాలం తరువాత 2014 ఎన్నికల్లో మొదటిసారి ఆ పదవి దక్కింది. అప్పట్లోనే మరో సీనియర్ నేత ఆర్సీ. మునికృష్ణకు మాత్రం తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ పదవి మాత్రమే దక్కింది. బీసీలు ఎక్కువగా ఉన్న తిరుపతి నగరం, జిల్లాలో ఆ వర్గానికి పదవుల్లో ప్రాధాన్యత దక్కలేదనేది వాస్తవం. దీంతో వారికి రెండో విడతలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తుందనేది వేచిచూడాలి.
బీసీ లేదా చౌదరి
టీటీడీ చైర్మన్ గా ఈసారి కమ్మ సామాజికవర్గం నుంచి టీవీ యజమాని కాకుంటే మాత్రం ఉత్తరాంధ్ర క్షత్రియ నేత, లేదా పల్నాడు ప్రాంత బీసీ నేతకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత ఒకరు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రారంభం నుంచి రెండు సామాజిక వర్గాలకు ఏ ప్రభుత్వంలో కూడా టీటీడీ చైర్మన్ పదవి దక్కలేదు. అందులో కమ్మ సామాజికవర్గం ఉంది. టీడీపీ కూటమిలో సమన్వయం కోసం మూడు పార్టీల నేతలు నిరీక్షిస్తున్నారు. మొదటి ప్రాధమ్యంగా కమ్మ, తరువాత క్షత్రియ, బీసీ కులాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో వేచి చూడాలి.