వాట్సాప్ గవర్నెన్స్ ఓ విప్లవం కాబోతోందా...

ఇప్పటి వరకు వెబ్ సైట్స్ ద్వారా ఎలాగైతే సేవలు పొందుతున్నామో ఇకపై వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ప్రభుత్వం చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్. ఓ విప్లవమని చెప్పొచ్చు.;

Update: 2024-12-11 14:06 GMT

వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల ముందుకు రాబోతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం దీనిని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకు పోగలిగితే తప్పకుండా ప్రజలకు మంచే జరుగుతుంది. గ్రామ స్థాయి అధికారులు అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రజలను ఇబ్బందులు పెట్టదలుచుకుంటే వాట్సాప్ గవర్నెన్స్ నవ్వుల పాలు కాక తప్పదు. కంపూటర్ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ తప్పని సరి అవుతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నా లేకున్నా ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అందులో వస్తున్న ఫొటోలు, వీడియోలు చూడగలుగుతున్నారు. ఏదైనా సక్సెస్ కావాలంటే దానిని ఉపయోగించి పనిచేసే వారిలో చిత్తశుద్ది ఉండాలి. ప్రస్తుతం పాస్ పుస్తకాల్లో వచ్చిన తప్పులు సరిదిద్దేందుకు తహశీల్దార్ కార్యాలయాల్లో సరైన విధానం లేదు. సంవత్సరాల తరబడి పాస్ పుస్తకాల్లో తప్పులు అలాగే ఉండిపోతున్నాయి. అర్జీలు ఎన్ని సార్లు ఇచ్చినా ఏవేవో సాకులు చెబుతున్నారు తప్ప తప్పులు సరిచేయడం లేదు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా తప్పులు సరికాకుండా అలాగే ఉంటున్నాయి.

ఇన్నాళ్లూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్మార్ట్ గవర్నెన్స్ లో భాగంగా వర్చువల్‌గా సేవలందించేందుకు సిద్ధంగా ఉందని డ్రోన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దినేష్ కుమార్ కలెక్టర్ ల సదస్సులో చెప్పారు. వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలందించేందుకు మెటాతో ఈ ఏడాది అక్టోబర్ 22న ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. వాట్పాప్ ద్వారా ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలుగుతాం, మెటాతో ఏఐ ద్వారా ప్రజలకు ఏ స్కిల్లింగ్ ఇవ్వగలుగుతామన్నది చూడాల్సి ఉందన్నారు.

దేశంలో ప్రస్తుతం 59 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. రోజూ ఒక్కొక్కరు సగటున 30 సార్లు వాట్సాప్‌ను సెల్ ఫోన్‌లో తెరుస్తున్నారు. ఎక్కువ మంది, ఎక్కువ సమయం వినియోగిస్తున్న తరుణంలో వాట్సాప్ ద్వారా విరివిగా సేవలందించవచ్చు. అత్యవసర సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడం, మౌలిక వసతలు కల్పించే ప్రాంతంలో స్థానిక ప్రజలకు సమాచారం పంపడం, ఈ క్రాప్ లో నమోదైన రైతులు ఏ సమయంలో ఏ మందులు వాడాలనేదిపై కూడా సమాచారం అందించవచ్చు. పంట ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెటింగ్ కు సంబంధించి సమాచారాన్ని ముందే అందించడం ద్వారా రైతులను అప్రమత్తం చేయొచ్చు. వాట్సాప్ ద్వారానే సులభంగా పన్ను చెల్లింపులు కూడా చేయొచ్చు. వాట్సాప్ ద్వారా దేవదాయ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సంబంధించిన సేవలను పొందవచ్చు. ఫేజ్-1లో 100 నుండి 150 సేవలను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకు రానుంది. ఆదాయ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్‌ లను వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరవేయవచ్చు.

యూజర్లతో ఫ్రెండ్లీగా ఉండాలి. వాట్సాప్ ద్వారా సేవలందించే వ్యవస్థను దేశంలోనే మొదటిసారి తీసుకొస్తున్నాం. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు సమస్యలు వస్తుంటాయి.. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని కలెక్టర్ లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా వాట్సాప్ ద్వారా అవసరమైన సర్టిఫికేట్లను పొందవచ్చు. ఈ ప్రక్రియలో ఏదైనా సమస్యలు ఎదురైతే క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్లు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. ప్రపంచంలో యూఏఈ దేశంలో తప్ప మరే దేశంలోనూ ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానం లేదు. యూఏఈ తర్వాత ఈ సేవలు తీసుకొస్తోంది ఒక్క మన రాష్ట్రమే. Ap.gov.in సైట్ లో సమాచారం ఉంచుతాం. గవర్నెన్స్ స్ట్రీమ్ లైన్ చేయాలన్నది సీఎం చంద్రబాబు అభిప్రాయం. వాట్సాప్ ద్వారా 153 సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కలెక్టర్ ల సమావేశంలో చెప్పారు.

ఇవన్నీ బాగానే ఉన్నా సైబర్ నేరాలను అదుపు చేయడంలో ప్రభుత్వం సైతం ఒక్కోసారి చేతులత్తేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పోలీసు విభాగాలు ఏర్పాటు చేసినా సైబర్ నేరాలు ఆగటం లేదు. ఎక్కడో ఖండాల అవతల ఉన్న వ్యక్తులు బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. అటువంటి నేరగాళ్లు చొరబడేందుకు వీలు లేని విధంగా వాట్సాప్ గవర్నెన్స్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News