జనవరి 16న కర్నూలులో 'జర్నలిజం ధృవతార ఎంసీ' పుస్తకావిష్కరణ సభ
జనవరి 16వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు సి. క్యాంపు సెంటర్ లోని లలిత కళాసమితి హాలులో జరుగుతుంది.;
By : The Federal
Update: 2025-01-15 09:57 GMT
'భారతీయ జర్నలిస్టు ఉద్యమ పితామహుడు, జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు' పుస్తకావిష్కరణ సభ జనవరి 16వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు సి. క్యాంపు సెంటర్ లోని లలిత కళాసమితి హాలులో జరుగుతుంది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు, తెలుగు భాషోద్యమ కారుడు కురాడి చంద్రశేఖర కల్కూర సభకు అధ్యక్షత వహిస్తారు. విశిష్ట అతిథులుగా తెలుగుదేశం నాయకుడు, KUDA చైర్మన్ సోమిశెట్టి వేంకటశ్వర్లు, ప్రముఖ న్యాయవాది సి. నాగేంద్రనాథ్, ప్రముఖ కవి కెంగార మోహన్, సీనియర్ జర్నలిస్టులు జి. గోరంట్లప్ప, జింకా నాగరాజు, ఇతరులు పాల్గొంటారు. పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్టు ఆకుల అమరయ్య పుస్తకాన్ని సభకు పరిచయం చేస్తారు.
ఎవరీ మానికొండ చలపతి రావు?
భారతదేశంలో జన్మించిన గొప్ప సంపాదకుల్లో ఒకరు. భారతమాతకు గర్వకారణమైన మానికొండ చలపతి రావుగా ఎంసీగా చిరపరిచితుడు. తెలుగువారు. శ్రీకాకుళం జిల్లా అంబఖండి గ్రామంలో పుట్టి మద్రాసులో ఎల్ఎల్బీ చేశారు. దక్షిణాది నుంచి ఉత్తరాదికి తరలివెళ్లిన తెలుగువాడు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి సన్నిహితుడు. మేధావి, సోషలిస్టు, అభ్యుదయవాది. పండిట్ నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సుమారు 33 ఏళ్ల పాటు సంపాదకత్వం వహించిన ఎంసీ జర్నలిజం విలువలకు, నైతికతకు మారుపేరు.
ఎంసీకి భయమనే మాట తెలియదు. పక్షపాతం తెలియదు. అర్థవంతమైన, బలమైన రచనలకు పేరుగాంచిన ఆయన భారతదేశంలోని ఆంగ్ల జర్నలిజం చూసిన గొప్ప సంపాదకుడు.
1946లో అప్పటి ప్రభుత్వం బలవంతంగా మూతవేయించిన పేపర్ తిరిగి ప్రారంభమైనపుడు ఆయన "నేషనల్ హెరాల్డ్" లక్నో ఎడిషన్ కి సంపాదకుడు అయ్యారు. ఈ పేపర్‌ను 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించారు. అంతకుముందు స్వాతంత్య్ర పోరాట కాలంలో అండర్ గ్రౌండ్ ప్రెస్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన ఏమి రాయాలనుకుంటే అది రాసేవారు. భయం అతని గుండెలో లేదు. బెరుగ్గా ఉండడం నేర్చుకోలేదు. అనుగ్రహం అనేది అతనికి ఏమి కోరాలో నేర్పలేదు. జేబులో రాజీనామా పత్రం పెట్టుకునే సంపాదకీయాలు రాసేవారు. పత్రికా స్వేచ్ఛంటే యజమాని స్వేచ్ఛ కాదని ఘంటాపథంగా నినదించారు. ఈవేళ జర్నలిస్టులకు ఈ మాత్రమైన భద్రత, అంతో ఇంతో వేతనం వస్తుందంటే అది ఎంసీ చలువే.
1950లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ)కి మొదటి అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు కొనసాగారు. 1955లో యుఎస్‌ఎస్‌ఆర్ (సోవియెట్ యూనియన్), పోలాండ్, యుగోస్లేవియాలో జవహర్‌లాల్ నెహ్రూతో కలిసి అత్యంత ప్రాధాన్యత గల పర్యటనలో పాల్గొన్న భారత పత్రికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. 1952లో చైనాకు భారత ప్రభుత్వం పంపిన గుడ్‌విల్ మిషన్‌లో సభ్యుడు. యునెస్కో ప్రెస్‌లో సభ్యుడు. యునెస్కో నిపుణుల కమిటీ, వివిధ యునెస్కో కమిషన్లలోనూ పని చేశారు. 1958లో MC ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. చలపతి రావు ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ ప్రారంభ కమిటీలోనూ సభ్యుడు. జర్నలిజానికి ఆయన చేసిన సేవలు మాటల్లో చెప్పలేనివి. 1968లో తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును సైతం తిప్పిపంపిన ధీరుడు.
ఈరోజుల్లో మన మధ్య చలపతి రావు వంటి మహానుభావులు లేరు. ఆయన నిష్కల్మషమైన వ్యక్తిత్వం, నిజాయితీ, వినమ్రత, స్వీయ త్యాగం మరెక్కడా కానరావు. ప్రముఖ జర్నలిస్టు కుందూరు ఈశ్వరదత్ చెప్పిన దాని ప్రకారం 1935ల నాటికి ప్రపంచ గ్రంథాలయాల్లోని పుస్తకాలన్నీ చదివిన ఇద్దరిలో తొలివాడు ఆనాటి బ్రిటన్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ కాగా రెండో వారు మానికొండ చలపతిరావు. ఆయన అసామాన్య ప్రతిభ, అవగాహన, విద్య, కలం శక్తి ఇవన్నీ నేడు మన సమాజానికి చాలా అవసరం. ఆయన ప్రాతినిధిత్వం వహించి నిలబెట్టిన విలువలు ఈ రోజుల్లో చాలా అరుదుగా మారిపోతున్నాయి. సరిగ్గా ఈ దశలో భారతీయ జర్నలిజం వైభవాన్నీ, విలువల్ని గుర్తు చేసేలా ఈ పుస్తకాన్ని మిరియాల వెంకట్రావ్ ఫౌండేషన్ తీసుకువచ్చింది.
అంతటి మహనీయునిపై సీనియర్ జర్నలిస్టు అమరయ్య తీసుకువచ్చిన భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పుస్తకావిష్కరణ సభ జనవరి 16న కర్నూలులో జరుగుతోంది.