ఎవరీ లోకేష్ చౌదరి, సీఎంను ఎందుకు టార్గెట్ చేశాడు?
శాటిలైట్ ఫోన్ తో ఉన్న ఈ చౌదరిని ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసులకు అప్పగించారు.
డాక్టర్ ఉయ్యూరు లోకేష్ చౌదరి అనే వ్యక్తి దగ్గిర గన్నవరం ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది ఆదివారం నాడు శటిలైట్ ఫోన్ ను స్వాదీనం చేసుకున్నారు. ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించగా అమెరికాకు వెళుతున్నట్లు చెప్పారు. అయితే ఢిల్లీ వరకు మాత్రమే అతని దగ్గిర టిక్కెట్ ఉంది. శాటిలైట్ ఫోన్ ఉన్నందున అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు గన్నవరం పోలీసులకు అప్పగించారు.
శనివారం నాడు ఎయిర్ పోర్టులో తచ్చాడుతూ కనిపించాడు. ఎవరు మీరు, ఇక్కడ ఎందుకున్నారని సీఎం సెక్యూరిటీ వివరణ కోరగా సరైన సమాధానం ఇవ్వలేదు. అమెరికా నుంచి ఓటు వేసేందుకు ఇండియాకు వచ్చానని లోకేష్ చెప్పారు. ఆ తరువాత వెంటనే వెళ్లకుండా సీఎంపై దుష్ప్రచారం చేసేందుకు నిర్ణయించారు. ఆయనను వ్యతిరేకించే వారిని కూడగట్టడం పనిగా పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ గ్రూపు, ఇతర కమ్మ సంఘాల గ్రూపుల్లో మెసేజ్ లు పెట్టారు. సీఎం విదేశాలకు పారిపోతున్నాడని, ఎయిర్ పోర్టు వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు రావాలని ఆ మెసేజ్ ల్లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు 41 నోటీస్ ఇచ్చి విచారించి పంపించేశారు. అయితే తిరిగి ఆదివారం గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన లోకేష్ శాటిలైట్ ఫోన్ తో పోలీసులకు దొరికిపోయారు.
శటిలైట్ ఫోన్ వాడాలంటే...
శాటిలైట్ ఫోన్ వాడాలంటే తప్పకుండా ప్రభుత్వ పోలీసుల అనుమతి తీసుకోవాలి. హై సెక్యూరిటీ జోన్ లో జామర్లు పోలీసులు ఉపయోగిస్తారు. అందువల్ల సాధారణ ఫోన్ లు అక్కడ పనిచేయవు. అందుకే వారు శాటిలైట్ ఫోన్స్ ఉపయోగిస్తారు. అంతే తప్ప ఎవరంటే వారు శాటిలైట్ ఫోన్స్ ఉపయోగించేందుకు వీలు ఉండదు. లోకేష్ శాటిలైట్ ఫోన్ ఉపయోగిస్తున్నందున ఈ ఫోన్ ఎందుకు ఉపయోగిస్తున్నారు? లైసెన్స్ చూపించాలని పోలీసులు ప్రశ్నించారు. దీనిపై లోకేష్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. వీఐపీలు ఎక్కడ ఉన్నా వారి వద్ద నుంచి వారి కదలికలను ఎప్పటికప్పుడు బయటి వారికి చెప్పేందుకు శాటిలైట్ ఫోన్ ఉపయోగ పడుతుంది.
లోకేష్ చౌదరి ఎవరు?
ఇతనికి అమెరికా పౌరసత్వం ఉంది. అమెరికాలోనే ఉంటున్నాడు. చాలా కాలంగా అమెరికాలో ఉంటూ వైద్యుడిగా పనిచేస్తున్నారు. తెలుగు వారితో కలిసి అప్పుడప్పుడూ సభలు, సమావేశాలకు హాజరవుతుంటాడు. ఎపిలో చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చూడాలని లోకేష్ భావించారు. అందుకే ఇక్కడికి వచ్చి ఓటు వేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే శాటిలైట్ ఫోన్ తో పట్టుబడ్డారు. ఫోన్లో ఉన్న వాట్సాప్, ట్విటర్, టెక్ట్స్ మెజేస్ లు పోలీసులు పరిశీలిస్తే జగన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గాన్ని సమర్థిస్తూ వేరే కులాలను వ్యతిరేకిస్తూ అనేక మెసేజ్ లను పోలీసులు కనుగొన్నారు. అందువల్ల పోలీసులు ఆదివారం సాయంత్రం మూడు గంటల వరకు విచారించి సొంత పూచీకత్తుపై ఇంటికి పంపించారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు నమోదు చేస్తామని గన్నవరం పోలీసులు తెలిపారు.
అమెరికాలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు చేయడం, ఫిర్యాదులు చేయడం, కోర్టుల చేత చీవాట్లు తినడం ఈ డాక్టర్ కు అలవాటన్నారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలపై ఆధారాలు లేకుండా కేసులు వేస్తాడని, ఈ కేసులను వాషింగ్టన్ డీసీ కోర్టు కొట్టివేయడంతో పాటు లోకేష్ కు ఫైన్ కూడా వేసిందన్నారు. వైద్య వత్తిలో నిర్లక్ష్యం కారణంగా న్యూయార్క్, వర్జీనియా రాష్ట్రాల్లో లోకేష్ మెడికల్ లైసెన్స్ ను రద్దు చేసినట్లు తెలిపారు. కొద్ది రోజులుగా కుల సంఘాలపై ఛానల్స్ లో మాట్లాడుతున్నారు. జగన్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
అమరావతిలోని తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేష్ చాలా కాలం క్రితం అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. వైద్య సేవల నుంచి రిటైర్డ్ అయ్యారు. కుల సంఘాలను ప్రోత్సహించడం లోకేష్ పని. చంద్రబాబునాయుడును గెలిపించాలని ఒక కుల సంఘం వారు చేస్తున్న రకరకాల ప్రయత్నాలకు లోకేష్ చేదోడు వాదోడుగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.