"పచ్చారి చెట్టు"పై ఒట్టు..!
మదనపల్లె సీటును బిజెపి ఆశించడం లేదని తెలుస్తోంది. ఇక్కడ టిడిపి- వైఎస్ఆర్ సీపీ మధ్య రసవత్తర పోటీకి జనసేన తిరుగుబాటు తప్పదనే.. సందేహం వ్యక్తం అవుతోంది.
By : The Federal
Update: 2024-03-12 06:57 GMT
ఎస్.ఎస్.వి భాస్కర్ రావ్ - తిరుపతి
మదనపల్లెలో పచ్చారి చెట్టుకు... రాజకీయ నాయకులకు విడదీయలేని అనుబంధం ఉంది. మదనపల్లి టౌన్ బ్యాంక్ ఎదురుగా ఉండే, ఈ చెట్టు కిందే రాజకీయాలు కేంద్రీకృతమై ఉంటాయి. ఇక్కడే అన్ని చర్చోపచర్చలు సాగుతూనే ఉంటాయి. ఎంతటి పెద్ద నాయకుడైన ఈ చెట్టు కిందకి రావాల్సిందే. జనంతో మాట్లాడాల్సిందే. అంతేనా, కావలసిన వ్యక్తి కోసం వెతుకులాడాల్సిన అవసరం లేదు. ఈ చెట్టు కింద నిరీక్షిస్తే చాలు. అని భావించేవారు చాలామంది. దశాబ్దాల కాలంగా మదనపల్లె చరిత్రతో పెనవేసుకున్న ఈ పచ్చారిచెట్టు గాలి పీలుస్తున్న పార్టీల నాయకుల తీరు ఎలా ఉందో చూద్దాం..
మదనపల్లి నాయకుల తీరు, స్టైలే.. వేరుగా ఉంటుంది. టిడిపి, జనసేన పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు వర్గ సమీకరణలో బిజీగా ఉన్నారు. . టిడిపి- వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులే పోటీలో ఉంటారని సమాచారం. తంబళ్లపల్లె సీటును ఆశిస్తున్న బిజెపి మదనపల్లిలో పోటీకి సుముఖంగా లేనట్లు తెలిసింది. కొన్ని గంటల్లో తేలే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. వైయస్సార్సీపి సమన్వయకర్తగా మైనార్టీ వ్యక్తి స్థానంలో మరొకరు వచ్చే అవకాశం లేకపోలేదని సమాచారం.
సందడే... సందడి..
ఎన్నికలు వచ్చాయంటే మదనపల్లె రాజకీయ పార్టీ నాయకుల్లో హడావిడి అంతా ఇంతకాదు. తాజా పరిస్థితి కూడా అందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మరో మాజీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ (జహా) ఒకరికి మరొకరు తీసిపోని విధంగా పార్టీ క్యాడర్ తో పాటు తమ వర్గాన్ని సమీకరించుకోవడంలో బిజీగా ఉన్నారు. అదేవిధంగా జనసేన నుంచి గంగారపు రాందాస్ చౌదరి, మరొకరు టికెట్ రేసులో ఉన్నారు.
నేను మదనపల్లి అడగడం లేదు..
" నేను తంబళ్లపల్లె నుంచే టికెట్ కోరుతున్నాను. "మా పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు" అని బిజెపి సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 17 నెలల పాటు తంబళ్లపల్లి నియోజకవర్గంలో పలకరింపు యాత్ర పేరిట విస్తృతంగా పర్యటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2004 ముందస్తు ఎన్నికల్లో కూడా తంబళ్లపల్లె నుంచి పోటీ చేసిన చల్లపల్లి నరసింహారెడ్డి 500 ఓట్లతో మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్ రెడ్డి పై ఓటమి చెందారు. ఈయన మాటలు బట్టి చూస్తే.. మదనపల్లెలో టిడిపి- వైయస్ఆర్సీపీ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
మదనపల్లె టిడిపికేనా?!
టిడిపి, జనసేన, బిజెపి మధ్య పొత్తు కుదిరింది. చిత్తూరు జిల్లాలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న తిరుపతి, మదనపల్లె నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కోరుతోంది. పొత్తులో భాగంగా తిరుపతిని జనసేన పార్టీకి కేటాయించారు. ఇక టికెట్ మాకే అంటూ టిడిపి నాయకుల శిబిరాల్లో ఉత్సాహం తాండవిస్తోంది. బహుశా అదే వాస్తవం కావడానికి అవకాశం ఉందని ఆ పార్టీ ఉన్నతస్థాయి నాయకులు నుంచి వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పై భూ ఆక్రమణలతోపాటు అనేక ఆరోపణలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన షేక్ షాజహాన్ (జాహా) మంత్రి పెద్దిరెడ్డి తో విభేదించి వైయస్ఆర్సీపీ వైపు వెళ్లలేదు. కాంగ్రెస్ లోనే కొనసాగిన ఆయన గత ఏడాది టిడిపిలో చేరారు. టిడిపి అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం పై టిడిపి టికెట్ ఆశిస్తున్న నాయకుల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
సంతకం మిస్ అయిన జహా..
2004 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటును రుచి చూసింది. ఎవరు ఊహించని విధంగా ఆ ఎన్నికల్లో షేక్ షాజహాన్ (జహా)కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. బీ.ఫామ్ లో అప్పటి ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ సంతకం లేకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. టికెట్ ఆశించి భంగపడిన గంగారపు రాందాస్ చౌదరి (ప్రస్తుతం జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్) స్వతంత్రంగా పోటీకి దిగారు. టిడిపి అభ్యర్థిగా దొమ్మలపాటి రమేష్ విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం తెరచాటున రమేష్ కు సహకారం అందించారని మాటలు బలంగా వినిపించాయి. జనసేనకు మదనపల్లి సీటు కేటాయించకుంటే ఆ పార్టీ నుంచి రంగంలో ఉన్న నేత తీరు టిడిపి అభ్యర్థి జయాపజయాలపై ఆధారపడి ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నారు.
మళ్లీ అదే సీన్..
దాదాపు మళ్లీ మదనపల్లిలో 2009 నాటి సీన్ కనిపిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. జనసేన నుంచి గంగారపు రాందాస్ చౌదరి టికెట్ ఆశిస్తుంటే.. టిడిపి నుంచి షేక్ షాజహాన్, దొమ్మలపాటి రమేష్ టికెట్ రేసులో ఉన్నారు.
అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు
2004 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరదీశారు. 2009 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఆ తర్వాత వచ్చిన విభేదాలతో షాజహాన్ ను పక్కన ఉంచి 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డిని చేరదీశారు. ఆయనను కూడా పక్కన ఉంచి గత ఎన్నికల్లో వైయస్సార్సీపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ తమ్ముడు షేక్ నవాజ్ బాషా ను తెరపైకి తెచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న నవాజ్ బాషాను పక్కన ఉంచి, మైనార్టీ వర్గానికే చెందిన షేక్ నిసార్ అహమ్మద్‌ను వైఎస్ఆర్ సీపీ మదనపల్లె కన్వీనర్ గా నియమించింది. ఈయన అభ్యర్థిత్వాన్ని కూడా మార్చి మళ్లీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డిని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు మదనపల్లి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.