అన్నా.. మనూళ్లో ఎవరు గెలుస్తారంటావ్!
ఏ ఓటరూ తన మదిలో ఏముందో చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఎక్కడ నోరు విప్పితే ఏమి జరుగుతుందోనని గుంభనంగా ఉంటున్నారు.
By : The Federal
Update: 2024-05-12 14:09 GMT
అన్నా, మనూళ్లో ఎవరికెస్తారంటావ్?
ఏమోరా, చివర్రోజు చుద్దాంలే..
బ్రదర్, ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందంటావ్..?
ఏమోన్నా.. అన్ని పార్టీలూ బలంగానే ఉండేటట్టుందీ..
ఏమ్మా.. మీదేవూరు, మీ ఊళ్లో పలానా పార్టీ ఎక్కువంటగా..
ఎవురయ్యా, నీకు చెప్పింది, ఆ పార్టీ వాళ్లు డబ్బుల్లేవంటుంటే..
ఇదీ గ్రామాల్లో పరిస్థితి. ఏ ఓటరును పలకరించినా సూటిగా సమాధానం రాబట్టడం గగనమనే చెప్పాలి. ఎన్నికల పండక్కి ఇంకొన్ని గంటలే మిగిలుంది. మే 13న ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ జరుగనుంది. అయినా సరే ఏ ఓటరూ తన మదిలో ఏముందో చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఎక్కడ నోరు విప్పితే ఏమి జరుగుతుందోనని గుంభనంగా ఉంటున్నారు. సరిగ్గా ఈ పరిస్థితే రాజకీయ పార్టీలకు గుబులు పుట్టిస్తోంది.
ఎన్నికల సమయంలో అందరూ అడిగే రెండు ప్రశ్నల్లో ఒకటి "ఎవరు గెలుస్తున్నారు?", రెండోది "మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు?" ఈ రెండు రకాల ప్రశ్నలకు ప్రతి ఒక్కరూ వారి వారి స్టైల్లో సమాధానాలు రాబట్టాలని చూస్తుంటారు. నిజానికి ఈ రెండు ప్రశ్నలకు కాఫీ, టీ కొట్ల దగ్గర నిలబడి సమాధానాలు రాబట్టడం కష్టమనే చెప్పాలి. ఓటర్లు- (మీరయినా, నేనైనా, వాళ్లైనా) ఏ పార్టీకి ఓటు వేస్తామో చెప్పడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అయినా మనం అడుగుతూనే ఉంటాం. ఆ కసరత్తు చేస్తూనే ఉంటాం. ప్రజలు ఏమి చేయాలనుకుంటున్నారో, ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం.
ఓటు అనేది ఓ నిస్వార్థ కార్యం. వ్యక్తిగత ప్రతిఫలాన్ని ఆశించకుండా అందరి మంచి కోసం చేసే ఓ మంచి పని. ఓటరు తన పనులన్నీ మానుకుని వ్యక్తిగత సమయాన్ని కేటాయించి ఓటు వేయడమంటే పరోపకారం చేయడమే. ఓటు వేయడమంటే సమాజానికి సేవ చేయడమే. అయితే ఈ భావన రానురాను తగ్గిపోవడంతో ఆ స్థానాన్ని డబ్బులు, ఇతర ప్రలోభాలు ఆక్రమించాయి. అందుకే ఏ ఓటరూ తన మనోగతాన్ని విప్పి చెప్పేందుకు సాహసం చేయడం లేదు. ఓటర్ల మనోగతాన్ని తెలుసుకునేందుకు పలు సంస్థలు నిర్వహించే ఓపినియన్ పోల్స్, పోలింగ్ తదనంతరం అభిప్రాయ సేకరణ వంటివి కూడా తల్లకిందులవుతున్నాయంటే దానికి కారణం ఓటర్లలో ద్వైది భావం పెరిగిపోవడం, రాజకీయ నాయకులంటే చిన్నచూపు పెరగడంగా పరిశీలకులు భావిస్తున్నారు.
ఉదాహరణకు ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాన్ని కోరుకుంటుంటారు. ఎక్కడైనా చిన్న తేడా వచ్చినా ఇక ఈ ప్రభుత్వం వేస్ట్ అండీ అంటుంటారు. వృద్ధాప్య పింఛన్ తో సంతృప్తి చెందిన జనం పక్కా రోడ్ల విషయంలో తీవ్ర అసంతృప్తి చేందారు. ఈ పాలన ఉత్త చెత్తండీ అనడం మనం చాలా చోట్ల విన్నాం. చివరకు విలాసవంతమైన కార్లో వెళ్లే చిన్న జియ్యర్ స్వామి సైతం 60 కిలో మీటర్ల దూరానికి మూడు గంటలు పట్టిందండీ అని చమత్కరించారు. ఇటువంటివి అనేక ప్రజలు కూడా చెబుతారు గాని ఎవరికి ఓటు వేయబోతున్నారో చెప్పరు. "పెద్ద చిత్రాన్ని చూడటానికి ముందు చిన్న పోకడలను గుర్తించండి" అన్నది సామెత. ప్రజలు ఏమి చెబుతున్నారో వింటుంటే రాబోయే ఫలితం ఎలా ఉంటుందో మనకే అర్థమవుతుందంటారు సీనియర్ జర్నలిస్టులు.
40, 45 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ లో ది ఫెడరల్ ప్రతినిధులు ముగ్గురు మూడు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ద్విచక్ర వాహనాలపై బయలు దేరారు. విజయవాడ నుంచి తెనాలి, గుంటూరు వరకు మధ్యమధ్యలో గ్రామాలను సందర్శిస్తూ వెళ్లారు. ప్రజలు జరుగుతున్న కాలగమనాన్ని చూస్తూ ప్రతిదానిని తర్కిస్తూ ముందుకు సాగాలనే చూస్తారు తప్ప అప్పటికప్పుడు తీర్పు ఇవ్వరేమోనని అన్పిస్తుంది. ఓటర్లకు చాలా స్పష్టత ఉన్నట్టు అర్థమైంది. వాళ్లకు ఏమి కావాలో వాళ్లకు తెలుసు. అది తెలియక మీడియానే వాళ్ల వెంటబడి వేధిస్తుందేమో అనిపించింది. కడపపై జగన్ కి పట్టున్న విషయం ఓటర్లను అడిగి తెలుసుకోవాల్సిన పని లేదు కదా అంటారు వాళ్లు. "మేము స్థానికంగా ఏమి జరుగుతుందో చూస్తున్నాం. తగిన సమయంలో తీర్పు ఇస్తాం" అనేదే ఓటర్లు మనకు ఇచ్చే సమాధానం. మోదీ మూడు సార్లు వచ్చినా, జగన్ 60,70 రోజులు తిరిగినా, చంద్రబాబు జైలుకెళ్లి వచ్చినా ఓటర్లకు సంబంధించిన అంశం కాదన్నదే వాళ్ల జవాబు. "వాళ్ల పని ఇళ్లలో కూర్చోవడం కాదు" అన్నదే ప్రజల జవాబు. ఓటర్ల అభిప్రాయం కోసం మీడియా వాళ్లు మరింత పట్టుబట్టినపుడు వాళ్లు ఏమంటారంటే.. "అవును కానీ మీరు ఏ పార్టీ నుంచి వచ్చారు?" ఓటింగ్ అనేది సాంఘిక ప్రవర్తనను బట్టి ఉంటుందంటారు.
ఈ పరిణామాలన్నీ రాజకీయ పార్టీలకు గుబులు పుట్టిస్తున్నాయి. ఓటర్ల మనసులోని మాటను తెలుసుకునేందుకు ఆయా నాయకులు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఫలించడం లేదు. ఏ పార్టీ గెలుస్తుందో, ఏ పార్టీ ఓడుతుందో చెప్పడానికి ప్రజలు ఇష్టపడరు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ ఓటరూ తాను ఏ ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడానికి ఇష్టపడడం లేదన్నది స్పష్టం. అవసరమైనప్పుడు తాను తీసుకోవాల్సిన నిర్ణయం తాను తీసుకుంటాడన్నది మాత్రమే స్పష్టంగా కనిపిస్తోంది.