ఆంధ్ర టీడీపీకి కొత్త బాస్.. ఫైనల్ చేసిన బాబు

ఆంధ్ర ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. 175 సీట్లకు గానూ 164 సీట్లలో గెలిచింది. వీటిలో టీడీపీ ఒక్కటి 134 సీట్లు సాధించింది.

Update: 2024-06-14 10:43 GMT

ఆంధ్ర ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. 175 సీట్లకు గానూ 164 సీట్లలో గెలిచింది. వీటిలో టీడీపీ ఒక్కటి 134 సీట్లు సాధించింది. ఈ భారీ విజయంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో మొదటిది కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించడం కాక రెండోది ఆంధ్ర టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు స్థానానికి మరో నేతను ఎంపిక చేయడం. ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్ టీడీపీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అచ్చెన్నాయుడు ఇప్పుడు రాష్ట్ర కేబినెట్‌లో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడంపై బాబు స్పెషల్ ఫోకస్ పెట్టి నిర్ణయం తీసుకున్నారు.

పల్లాకే అధ్యక్షుడి బాధ్యతలు

అచ్చెన్నాయుడు స్థానాన్ని భర్తీ చేయగల సీనియర్ నేత కోసం చంద్రబాబు చూస్తుండగా ఆయనకు పల్లా శ్రీనివాస రావు గుర్తుకొచ్చారు. పార్టీలో మంచి పేరు, రాజకీయాల్లో అనుభవం, పార్టీ వ్యవహారాలపై పట్టు, ప్రజల్లో పలుకుబడితో పాటు తాజాగా ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ 35,235 ఓట్లతో విజయం సాధించిన నేత కావడంతో ఆయన పేరును చంద్రబాబు ఫైనల్ చేసేశారు. ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయంపై పార్టీ నేతలు ఎవరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని, పల్లా శ్రీనివాస్ ఎంపికన్ స్వాగతించారని సమాచారం. కేబినెట్ కుదురుకున్న మరుసటి రోజు ఆంధ్ర టీడీపీ చీఫ్‌గా పల్లా శ్రీనివాసరావు పేరును చంద్రబాబు ప్రకటించనున్నారని తెలుస్తోంది.

కేబినెట్లో స్థానం దక్కలేదనా..

అయితే రాష్ట్ర కేబినెట్‌లో స్థానం దక్కుతుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన నేతల్లో పల్లా శ్రీనివాస రావు కూడా ఒకరు. ఆయనతో పాటు మరెందరో సీనియర్లు కేబినెట్ మంత్రి పదవి కోసం ఎదురుచూశారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే చర్యల్లో భాగంగానే వారికి పార్టీ వ్యవహార బాధ్యతలను చంద్రబాబు అప్పగిస్తున్నారని, తద్వారా పార్టీని మీచేతుల్లో పెడుతున్నా చెప్పకనే చెప్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా టికెట్ ఆశించిన భంగపడిన నేతలకు కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News