మళ్లీ మొదటికి వచ్చిన పోలవరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి నదిపై చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ మొదటికొచ్చింది. ఇందుకు కారకులు పాలకులు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-06-18 09:38 GMT
పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జీవనాడి. తాగు నీరు, సాగు నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఏపీకి గొప్ప వరం. కేంద్రం నిధులతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్ పాలకులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కాలాని అనుగుణంగా నిర్మించ లేక పోయారు. ప్రకృతి విపత్తుల వల్ల పూర్తి చేయలేక పోయామని గత పాలకులు చెబుతున్నారు. వారి అసమర్థత వల్లే పోలవరం మొదటికొచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటున్నారు.
ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటి వరకు ఏమి జరిగింది?
రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ఐదేళ్లల్లో నిర్మాణం పూర్తి అవుతుందనుకున్నారు. కానీ డయాఫ్రం వాల్ నిర్మాణం వరకు పూర్తి చేయగలిగారు. ఈలోపు 2019లో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ రివర్స్ టెండర్లు పిలిచారు. గతంలో ఉన్న నవయుగ కంపెనీ పోయి మెగా కంపెనీ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. అదే సమయంలో కరోనా రావడం వల్ల మూడేళ్ల కాలం ప్రాజెక్టు పనులు ముందుకు సాగ లేదు. ప్రకృతి సిద్ధమైన వర్షాలు, వరదలు రావడంతో కాఫర్ డ్యామ్‌లతో పాటు డయాఫ్రం వాల్ కూడా దెబ్బతిన్నది. డయాఫ్రం వాల్ నుంచి సీపేజీ రావడం మొదలైంది. ముందుగా నిర్మాణం చేసిన నవయుగ కంపెనీ వారు తాము అనుకున్న సమయానికి అనుకున్న మేర పనులు పూర్తి చేశామని, ఆ పనులు కొనసాగకుండా ఆగి పోవడంతో జరిగిన పరిణామాలకు మేము బాధ్యులము కాదని తేల్చి చెప్పింది.
కాఫర్ డ్యామ్ అంటే ఏమిటి?
నది మధ్యలో డ్యామ్‌ను నిర్మించాలంటే ముందుగా డ్యామ్ నిర్మాణం చేపట్టే ప్రాంతానికి పై భాగంలో నది నుంచి ప్రవహించే నీటిని దారి మళ్లించేందుకు ఏర్పాటు చేసేదే కాఫర్ డ్యామ్. ఈ డ్యామ్‌ను పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పై భాగంలో ఒకటి, కింద భాగంలో మరొకటి ఏర్పాటు చేశారు. పై భాగంలో ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్ నుంచి నీటిని పక్కకు మళ్లించడం ద్వారా డ్యామ్ కింది భాగంలోని నదిలోనికి నీరు చేరుతుంది. కింది భాగంలో నిర్మించిన కాఫర్ డ్యామ్ దాటి డయాఫ్రం వాల్‌పైకి నీరు రాకుండా కాపర్ డ్యామ్ అడ్డుకుంటుంది.
డయాఫ్రం వాల్ అంటే ఏమిటి?
ట్యాంకుకు జీవనాడి డయాఫ్రం వాల్. డ్యామ్ నిర్మాణం చేపట్టడానికి ముందు డయాఫ్రం వాల్ నిర్మిస్తారు. ఆనకట్ట నిర్మించే ప్రాంతానికి నీరు చేరకుండా కాఫర్ డ్యామ్‌లు అడ్డుగా ఉంటాయి. అందువల్ల డయాఫ్రం వాల్ నిర్మాణం ఈజీగా చేపట్టేందుకు వీలుగా ఉంటుంది.
2.454 కిమీ వెడల్పులో రెండు కొండల మధ్య నది గర్భంలోకి సుమారు 300 అడుగుల లోతు నుంచి బేస్‌మెంట్ కాంక్రీటుతో నిర్మిస్తారు. దీనినే డయాఫ్రం వాల్ అంటారు. ఈ నిర్మాణం పూర్తి అయిన తర్వాత దానిపై రాళ్లు, కాంక్రీటుతో ఆనకట్ట పై భాగం నిర్మిస్తారు. అందులోనే గేట్లు కూడా ఏర్పాటు చేస్తారు. డయాఫ్రం వాల్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఇంజనీర్లు చెపిన ప్రకారం అన్నేళ్లు ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా ఉండదు. సీపేజీ ఎట్టి పరిస్థితుల్లోను డయాఫ్రం వాల్ నుంచి రాకూడదు.
ప్రస్తుతం డయాఫ్రం వాల్ పరిస్థితి ఏమిటి?
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డయాఫ్రం వాల్ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా దెబ్బతిన్నది. సకాలంలో పనులు జరక్క పోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం కారణాలు ఏమి చెప్పినా డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టిన తర్వాత అనుకున్న ప్రకారం పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరి పొంగి సుడులు తిరుగుతూ నీరు ప్రవహించడం వల్ల కాఫర్ డ్యామ్ దెబ్బతిని డయాఫ్రం వాల్ కూడా దెబ్బతిన్నది.
ప్రభుత్వం ఏమీ చేయాలనుకుంటున్నది?
డయాఫ్రం వాల్ దెబ్బతిన్నందున కొత్తగా నిర్మించాలా? దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కే మరమ్మతులు చేయాలా? అనే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే నిష్ణాతులైన ఇంజనీర్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించి డయాఫ్రం వాల్‌ను పరిశీలించారు. మరమ్మతులు చేసేందుకు రూ. 447 కోట్లు ఖర్చు అవుతుందని ఇంజనీర్లు అంచనా వేశారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రూ. 446 కోట్లు ఖర్చు పెట్టింది. నాలుగు చోట్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు ఇంజనీర్లు గుర్తించారు. దాదాపు 35 శాతం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలంటే రూ. 990 కోట్లు ఖర్చు అవుతుందని ఇంజనీర్లు అంచనాలు వేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కూడా దెబ్బతిన్నాయి. వీటి నిర్మాణానికి కూడా కనీసం రూ. 500 కోట్లు ఖర్చయ్యే అవకాశముంది.
కాంట్రాక్టర్లను మార్చడమే ప్రాజెక్టుకు శాపం
ప్రభుత్వం మారగానే కాంట్రాక్టర్లను మార్చేశారు. ఇందువల్ల గతంలో ఉన్న కాంట్రాకర్లు ఎంత వరకు పనులు ఎలా చేశారో తెలుసుకోవడానికి కొత్త కాంట్రాక్టర్‌కు మూడు నెలల కాలం పట్టింది. నది ప్రవాహ వేగం పెరగడం వల్ల కాఫర్ డ్యామ్‌ల నుంచి డయాఫ్రం వాల్‌లోకి నీరు ప్రవేశించి అటు కాఫర్ డ్యామ్, ఇటు డయాఫ్రం వాల్ దెబ్బతినడం వల్ల పనులు ముందుకు సాగ లేదు. మరమ్మతులు చేయాలా? కొత్త నిర్మాణం చేట్టాలా అనే సందేహాలతోనే ఐదేళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్ కమిటీని పిలిపించి వారి సూచనల మేరకు డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలా? ఉన్నదానికి మరమ్మతు చేయాలనేది ఫైనల్ చేస్తారు.
లభించని ఆర్థిక శాఖ ఆమోదం
2019 ఫిబ్రవరి 11న కేంద్ర జలశక్తి శాఖ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 47,756 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ మొత్తాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాల్సి ఉండగా, ఇంత వరకు ఆమోదం లభించ లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంచనాల కూడా పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని వెంటనే నిధులు విడుదల చేసి పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
నిర్వాసితులదే ప్రధాన సమస్య
ప్రాజెక్టు లోపలి భాగంలో ముంపునకు గురయ్యే నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఆ పనులు సకాలంలో జరగడం లేదు. పునరావాసం కోసం రూ. 33వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఖర్చు చేసింది కేవలం రూ. 6 వేల కోట్లు మాత్రమే. వీరికి పునరావాస కాలనీల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది.
ముందుగానే పూర్తి అయిన కాలువలు
ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి. ప్రధాన కుడి కాలువ 99.5 శాతం వరకు పూర్తి అయింది. ఎడమ కాలువ 75 శాతం పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. పంట కాలువల నిర్మాణం జరగాల్సి ఉంది. కాలువల నిర్మాణం పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రాజెక్టుకు పెద్ద సమస్యగా మారింది.
ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
సోమవారం పోలవరం ప్రాజెక్టును ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించారు. ఆయన వెంట అధికారులు, ఇంజనీర్లు ఉన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రాజెక్టు వెనక్కి వెళ్లిందన్నారు. డయాఫ్రం వాల్ మరమ్మతులు చేయాలా? కొత్తది నిర్మించాలా? అనేది ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుందన్నారు.
ఘోరాతి ఘోరం
ఉమ్మడి విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 7లక్షల ఎకరాలకు సాగు నీరు పోలవరం ప్రాజెక్టు ద్వారా అందుతుంది. ఈ జిల్లాల్లో లక్షలాది మందికి తాగు నీరు అందుతుంది. విశాఖపట్నానికి తాగు నీరు అందించడం, అక్కడి పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. పాలకులు తీసుకున్న ఘోరమైన నిర్ణయాల వల్ల ప్రాజెక్టు ఘోరాతి ఘోరంగా తయారైందని నీటిపారుదల రంగ నిపుణులు టీ లక్ష్మినారాయణ అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కలలు కంటున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ మొదటికి రావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. వరదలు, వర్షాల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని పనులు కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఏకంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడం అంటే ప్రాజెక్టు బేస్ దెబ్బతినడమేనని, అందువల్ల ఇంజనీర్లు ఇచ్చే సలహాలు, సూచనలతో పనులు వేగవంతం చేసి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.