విశాఖపట్నానికి ఏమైంది.. నిన్న డ్రగ్స్ ఇవాళ తుపాకులు

సిటీ ఆఫ్ డెస్టినీ...పర్యాటక రాజధాని...పారిశ్రామిక రాజధాని...జగన్ సర్కార్ వచ్చిన తర్వాత పరిపాలన రాజధాని...ఇప్పుడు నేర రాజధానిగా ఎందుకు మారింది...?

Update: 2024-03-25 12:00 GMT
మీడియాకు వివారాలు వెల్లడిస్తున్న పోలీసులు

(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. నగరానికి మూడు వైపులా చుట్టూ కొండలపై పరుచుకున్న పచ్చదనం… ఓవైపు సాగర తీరం సుందర నగరంగా విశాఖ పేరుగాంచింది. అందుకే పర్యాటక రాజధానిగా కూడా విరాజిల్లుతుంది. అన్ని మౌలిక సదుపాయాల నగరంగా పేరుగాంచింది. వాయు, జల, రోడ్డు రవాణా సదుపాయాలు కలిగిన నగరంగా విశాఖ ఉంది. దీంతో పరిశ్రమలు విపరీతంగా పెరిగాయి. పారిశ్రామిక రాజధానిగా కూడా విశాఖనే పిలుస్తారు.

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నగరానికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. పరిపాలన రాజధానిగా ఆ ప్రభుత్వం ప్రకటించింది. కార్యకలాపాలు ప్రారంభం కానప్పటికీ రాజధాని హంగులు మాత్రం విశాఖలో మొదలయ్యాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నగరం నేర నగరంగా ఎందుకు మారింది. గంజాయి స్మగ్లింగ్‌కు, డ్రగ్ మాఫియాకు, అక్రమ ఆయుధాల రవాణాకు ఎందుకు అడ్డాగా మారింది. ఇదే యావత్ ప్రజానీకాన్ని తొలిచేస్తున్న ప్రశ్న.


నిన్న డ్రగ్స్.. నేడు ఆయుధాలు..

విశాఖ పోర్టులో సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఉదంతం ఓ కొలిక్కి రాకముందే… నగరంలో మారణాయుధాల పట్టివేత కలకలం రేపుతోంది. నగరంలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు లభించడంతో ప్రపంచవ్యాప్త డ్రగ్ రవాణాకు విశాఖ కేంద్రంగా మారిపోయిందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేర కార్యకలాపాలు ఒకటొకటిగా బయట పడుతుండడంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రశాంత విశాఖ నగరం నేరమైయంగా మారడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఐదు రోజుల క్రితం ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ అధికారులు విశాఖ పోర్టులో మాదకద్రవ్యాలతో నిండిన కంటైనర్‌ను స్వాధీన పరచుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దర్యాప్తు పూర్తి కాకముందే మరో నేర వ్యవహారం బయటకు వచ్చింది. అక్రమ ఆయుధాలతో సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి మారణాయుధాలను స్వాధీన పరుచుకున్నారు. మరోపక్క నగరంలో రౌడీ షీటర్లు హత్యలకు, సెటిల్మెంట్లకు తెగబడుతుండగా... నిషేధిత సరుకులు విశాఖలో చలామణి అవుతున్నాయి.

అక్రమ ఆయుధాల పట్టివేత...

ఎన్నికల సమయంలో విశాఖలో లైసెన్స్ లేని ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న వ్యక్తి నుంచి ఒక రివాల్వరు, పిస్టోలుతోపాటు రెండు బుల్లెట్లను విశాఖ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. నగరంలోని శ్రీకృష్ణ ట్రావెల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి వద్ద తుపాకులు ఉన్నట్టు టాస్క్ ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో సోదాలు నిర్వహించగా... శివ నాగరాజు అనే వ్యక్తి వద్ద రివాల్వర్, పిస్టోల్‌తో పాటు రెండు బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీన పరుచుకున్నారు.

జార్ఖండ్‌కు చెందిన కునాల్ శ్రీవాస్తవ్ అనే వ్యక్తి నుంచి శివ నాగరాజు ఈ ఆయుధాలను సేకరించినట్టు నగరా జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప వెల్లడించారు. ఇది ఇలా ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన ఎలక్ట్రానిక్ సిగరెట్లు( ఈ-సిగరెట్లు) పెద్ద ఎత్తున బయటపడ్డాయి. నగరవ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున నిషేధిత ఈ-సిగరెట్లను స్వాధీనపరుచుకున్నారు.


కేంద్ర బిందువుగా విశాఖ...

గంజాయి.. లిక్విడ్ గంజాయి... మత్తు ఇంజక్షన్లు...టాబ్లెట్లు.. కొకైన్.. హెరాయిన్... అక్రమ ఆయుధాలు... నిషేధిత ఈ-సిగరెట్లు… ఇలా అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలకు విశాఖ కేంద్ర బిందువుగా మారింది. ఉమ్మడి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు విస్తృతంగా జరుగుతుండగా… ఇక్కడ నుండే దేశ నలుమూలలకు సప్లై అవుతుంది. అంతర్జాతీయ డ్రగ్ ముఠాలు విశాఖను కేంద్రంగా చేసుకొని రవాణా చేస్తున్నాయి అనడానికి పోర్ట్‌లో బయటపడ్డ మాదగద్రవ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇక నగరంలోని రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. హత్యలకు, దౌర్జన్యాలకు, ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. ఇక అక్రమ ఆయుధాలు నిషేధిత ఈ-సిగరెట్లు కూడా విశాఖ నగరం కేంద్రంగానే సరఫరా అవుతున్నాయి. పోలీసుల దాడుల్లో ఇటీవల బయటపడిన ఉదంతాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రశాంత విశాఖ నేరమయంగా మారిపోతుంది.

Tags:    

Similar News