కోటప్పకొండకు శివరాత్రి శోభ.. ప్రత్యేక ఆకర్షణగా ప్రభలు

మహాశివరాత్రి తిరనాళ్లకు కోటప్పకొండ ముస్తాబయింది. అశేష భక్త జనానికి శివయ్య దర్శనం కల్పించడానికి అర్థరాత్రి నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు.

Update: 2024-03-08 09:04 GMT
కోటప్పకొండలొ శివరాత్రి ఉత్సవాలు


మహాశివరాత్రి తిరనాళ్లకు కోటప్పకొండ ముస్తాబయింది. అశేష భక్త జనానికి శివయ్య దర్శనం కల్పించడానికి అర్థరాత్రి నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. విద్యుత్ దీపాల వెలుగులతో కోటప్పకొండ దేద్దీపమానంగా వెలిగిపోతోంది. ఈ తిరునాళ్ల కోసం కొండవ దిగువన ఉన్న బొచ్చుకోటయ్యస్వామి, సిద్ధివినాయక, రాజగోపురం, స్వామి వారి ఆలయం, యాగశాల, నవగ్రహ మండపం, పుట్ట, ధ్యాన మందిరం, అతిథి గృహాలు, క్యూకాంప్లెక్స్‌ తదితరాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల నుంచే దర్శనం, పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీశైల క్షేత్రంలో పూజలు తెల్లవారుజాము 2గంటలకే మొదలయ్యాయి. ఈ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సుమారు 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు, ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

కోటప్పకొండకు శివరాత్రి శోభ

మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామాల్లో శివరాత్రి హడావుడి మొదలైంది. ఆయా గ్రామాల్లోని ప్రజలు ప్రభలు కట్టుకుని వెళ్లి శివయ్యను దర్శించుకోవడం ప్రారంభించారు. ఈ ఏడాది మమాశివరాత్రి వేడుకల్లో సుమారు 9 ప్రభలు రానున్నట్లు తెలుస్తోంది. వీటిక సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రభల ఉత్సవాలు వందల ఏళ్లుగా కొనసాగుతున్నాయి. వీటి శోభ చూడటమే తప్ప మాటల్లో వర్ణించాలంటే చాలా కష్టం. ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పండగగా గుర్తించింది. ప్రతి ఏడాదీ మహాశివరాత్రి నాడు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేయడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాలు పోటాపోటీగా తయారు చేసే ప్రభలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.




ప్రభలు అంటే ఏమిటి
శివరాత్రి మహోత్సవం పంటలు చేతికొచ్చే తరుణం ఒకటే. ఈ నేపథ్యంలో త్రికూటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చే రైతులు పోటీలు పడి ప్రభలు కడతారు. ఎంత ఎత్తు ప్రభ కడితే అంత ప్రతిష్టగా భావిస్తారు. ప్రభ కట్టడం ఒక సవాలు అయితే దానిని కొండపైదాకా సురక్షితంగా తీసుకెళ్లడం మరో ఛాలెంజ్‌లా ఉంటుంది. ఈ ప్రభలు కట్టడం, తీసుకురావడానికి రాజకీయ నేతలు, పార్టీలు కూడా పోటీ పడతాయి. లక్షల రూపాయల ఖర్చుతో ప్రభలు కడుతుంటారు. ఈ ఏడాది సుమారు తొమ్మి పెద్ద ప్రభలు కట్టినట్లు సమాచారం. పార్టీలే కాదు దరిదాపుల్లోని గ్రామాలు కూడా ఏమాత్రం తగ్గకుండా లక్షల ఖర్చుతో ప్రభలు కట్టి దేవస్థానానికి తీసుకొస్తారు. ఈ ప్రభలకు పోటీలు కూడా ఉంటాయండోయ్.. అతి చక్కని ప్రభకు దేవస్థాన కమిటీ ఓ ప్రత్యేక బహుమతిని కూడా అందిస్తుంది.

ప్రభలు కట్టే గ్రామాలు ఇవే
కోటప్పకొండ చుట్టుపక్కల ఉన్న నకరికల్లు, దేచవరం, మాచవరం, గామాలపాడు, ఈపూరు, బొమ్మరాజు పల్లి, చిలకలూరిపేట నుంచి గోవిందపురం, అప్పాపురం, కమ్మవారి పాలెం, కావూరు, అమీన్ సాహెబ్ పాలెం, అవిశాయపాలెం ఇలా మరెన్నో గ్రామాలు పెద్దపెద్ద ప్రభలు తయారు చేసుకుని వస్తాయి. కోటప్పకొండ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. వీటిలో 70ఏళ్లకు పైగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది వచ్చే ప్రభలు కూడా ఉన్నాయి. పురుషోత్త పట్నం, కావూరు, అవిశాయ పాలెం, మద్దిరాల, ఉప్పలపాడు, గోవిందాపురం వంటి గ్రామాల నుంచి యాభైఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రభలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. అంతేకాదు కొందరు భక్తులయితే తాము కోరిన కోరిక నెరవేరితే ప్రభ కట్టుకు వస్తామని మొక్కుకుంటుంటారు.

ప్రభల తయారీ
ప్రతి గ్రామానికి సొంతంగా ప్రభ తయారీ సామాగ్రి ఉంటుంది. ఇది గ్రామగ్రామానికి వేరుగా ఉంటుంది. శివరాత్రికి నెల రోజుల ముందు నుంచే ప్రభల తయారీ ప్రారంభమవుతుంది. ఈ తయారీన మంచి రోజు చూసుకుని ప్రారంభిస్తారు. వెదురు బొంగులు, గడ్డి, పూలు, కొబ్బరి పీచు, తగరాలతో నిర్మించిన ప్రభను విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ ప్రభలను 6 నుంచి 60 అడుగుల వరకు నిర్మిస్తారు. పెద్ద ప్రభలంటే 100 అడుగుల ఎత్తు కూడా ఉంటాయి. ఈ ప్రభలను ప్రతి గ్రామంలో ఏడాదికి ఒక సామాజిక వర్గం చొప్పున చందాలు వేసుకుని నిర్మిస్తారు. పురుషోత్తమపట్నం గ్రామంలో పోటా పోటీగా మూడు, నాలుగు ప్రభలు కూడా కడతారు.

 

ప్రభల ఉత్సవాలు
ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రభలను గ్రామాలు అంతే అట్టహాసంగా త్రికుటేశ్వరస్వామి చెంతకు తీసుకెళతాయి. ఈ బాధ్యత అంతా ఆ ప్రభల కమిటీపైనే ఉంటుంది. ప్రభల బండ్లను తీసుకెళ్లడానికి ఎండ్లను కడతారు. వాటిని కూడా ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు. ప్రభల బండ్లకు కట్టే ముందు వాటి మెడలో మువ్వల పట్టెడ, గంటల పట్టెడ, మూతికి అందమైన శికమార్లు, నడుంకు తోలు బెల్టు, కొమ్ములకు రంగులు, కాళ్లకు గజ్జెలు, వీపుమీద రంగురంగుల వస్త్రాలు వేసి అలంకరిస్తారు. ఈ ప్రభలు బయలుదేరి వస్తుంటే వీటిని చూడటానికి ప్రజలు గుంపులుగుంపులుగా గుమిగూడతారు. ఈ ఎడ్లతో బండ్లను కొండపైకి తెసుకెళ్లడం కూడా ఒక పోటీలా కొనసాగుతుంది. ఒకరిని మంచి ఒకరు తమ ఎడ్లను అంత్యంత సుందరంగా అలంకిస్తారు. ఆ ఎడ్లు ఠీవీగా నడుస్తూ సంగీత వాయిద్యాల నడుమ ఒక్కోసారి రంకెవేస్తుంటాయి. ఈ ప్రభలను తీసుకుని వెళ్లి త్రికూటేశ్వరస్వామిని దర్శించుకోవడమే ప్రభల ఉత్సవాలు.


ప్రభల సంస్కృతి ఆరంభం ఇలా!

పరమశివుడు మూడు కొండలపై జంగమదేవర రూపంలో ధాన్యంలో ఉండేవారట. ధ్యానం చేసుకుంటుండే స్వామి వారికి కొండ సమీపంలోని కొండకావూరు గ్రామానికి చెందిన ఆనందవల్లి(గొల్లభామ) నిత్యం పాలు తీసుకెళ్లి ఇచ్చేదట. ఆ తర్వాత ఆనందవల్లి గర్భం దాల్చింది. దాంతో తాను కొండ ఎక్కి రావడం కష్టమవుతుందని, స్వామివారే కొండ దిగి వస్తే ఎప్పటిలా పాలను ఆహారంగా ఇస్తానని చెప్పిందట. ఆమె మాటకు అంగీకరించిన శివుడు ఆమె వెంటే కొండ దిగడానికి సిద్ధమయ్యారట. కానీ కొండ దిగే సమయంలో చిట్టచివరికి వెళ్లే వరకు వెనుతిరిగి చూడొద్దని, అలా చూస్తే శిలైపోతావని ఆనందవల్లికి చెప్పాడట. అందుకు సరేనన్న ఆనందవల్లి కొండ దిగుతుంటే ఆమె వెంటనే శివుడు కూడా కొండ కిందకు దిగడం ప్రారంభించాడట. కానీ మార్గమధ్యలో వెనక నుంచి భారీ శబ్దాలు వస్తుండటంతో మధ్యలోనే ఆనందవల్లి వెనక్కి తిరిగి చూసిందని, అలా చూసిన వెంటనే ఆమె శిలగా మారిపోయిందట. ఆ తర్వాత కొండ దిగి రావాలని భక్తులు శివుడిని అడిగితే కోటయ్య చెంతకు కోటి ప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు తాను కొండ దిగుతానని చెప్పారట. అప్పటి నుంచే కోటయ్య చెంతకు భక్తులు ప్రభలు తీసుకెళ్లడం ప్రారంభించారని స్థానికులు చెబుతున్నారు.

పోటాపోటీగా పార్టీల ప్రభలు

ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజున కోటప్పకొండకు ప్రభలను తీసుకురావడానికి రాజకీయ పార్టీలు, ప్రముఖులు పోటీ పడుతుంటారు. భారీ ఖర్చుతో ప్రభలను సిద్ధం చేస్తారు. ఈ ప్రభలను తయారు చేయడానికి కొన్ని పార్టీలు రూ.1-15 లక్షల వరకు కూడా ఖర్చు చేస్తారు. మహాశివరాత్రికి నెలల ముందు నుంచే కోటప్పకొండ ప్రభల తయారీకి నిధులను సమకూర్చడం ప్రారంభించేస్తారు. సమకూర్చుకున్న నిధులతో ప్రతి పార్టీ నేతలు, పార్టీ హైకమాండ్‌లు కూడా ప్రభలపై ప్రత్యేక దృష్టి పెడుతుంటాయి. శివరాత్రిని అట్టహాసంగా నిర్వహించడానికి అన్ని విధాల సహకరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా శివరాత్రి నాడు ఎటువంటి అనివార్య ఘటనలు జరగకుండా ఉండటానికి, భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఉండటానికి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు.

రాజకీయ ప్రభలకు ఇవీ ఆంక్షలు

రాజకీయ ప్రభలు తీసుకొచ్చే వారికి పోలీసు అనుమతి తప్పినిసరిగా కావాలి. ప్రతి ప్రభ కూడా ఆరుగురు సభ్యులతో కమిటీగా ఏర్పడి పూర్తి బాధ్యత వహించాలి. అదే విధంగా ప్రభల వాహనాలకు పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు కట్టకూడదు. ఒక స్పీకర్ లేదా మైక్ మాత్రమే ఉండాలి.. వాటికి కూడా పర్మిషన్ తప్పనిసరి. డీజేలకు ససేమిరా అనుమతి ఉండదు. ప్రభ బండి నడిపే వాళ్లు మద్యం సేవించి ఉండకూడదు, ప్రభ దగ్గర ఏదైనా అల్లరి, గొడవలు జరిగితే ఆ బండి కమిటీదే బాధ్యత, వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు.

భక్తుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు

ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. క్యూలైన్లు, మెట్ల మార్గం, ఆలయ పరిసర ప్రాంతాల్లో 30 చోట్ల కుళాయిలు బిగించారు. కొండపై యాగశాలలో ఒకేసారి 50కు పైగా హోమాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ వారి సాయంతో స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని తాగునీటితో పాటు, అల్పాహార ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌, ఎస్పీ అతిథి గృహాలు పూర్తవడంతో వారు కొండపైనే బస చేసి, భక్తుల సౌకర్యాలను పరిశీలించనున్నారు. సామాన్య భక్తులకు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచే కొండపైకి బస్సు సౌకర్యం కల్పించారు. సాయిబాబా గుడి వద్ద పార్కింగ్‌ నుంచి బస్సుల్లో కొండపైకి చేరుకోవచ్చు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా శివాలయాలను ముస్తాబు చేశారు. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరణ చేశారు. శుక్రవారం వేకువజామున స్వామి వారికి అభిషేకం, పూజలు నిర్వహించేందుకు గుడుల్లో ఏర్పాట్లుచేశారు.


Tags:    

Similar News