క్రాప్ హాలిడే ఆలోచనలో రొయ్యల రైతులు

ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన 26 శాతం సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు విలవిల్లాడుతున్నారు.;

Update: 2025-04-07 04:57 GMT
ఫైల్ ఫొటో

ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన 26 శాతం సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు విలవిల్లాడుతున్నారు. 2025 ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చిన యూఎస్ కొత్త పన్నుల విధానంతో రొయ్యల పరిశ్రమ స్తంభించింది. రొయ్యల పట్టివేత ఆగింది. కొనుగోళ్లు నిలిచాయి. ఒక్కసారిగా 10-15 శాతం ధరలు తగ్గిపోయాయి. ఎగుమతికి సిద్ధంగా ఉన్న కంటైనర్లు ఆగాయి. రొయ్య రైతుల హాహాకారాలు ఢిల్లీని తాకాయి.

చెరువుల్లో రొయ్యల పరిస్థితి

ఆంధ్రప్రదేశ్‌లో 5.7 లక్షల ఎకరాలకు పైగా ఆక్వాకల్చర్ విస్తీర్ణం ఉంది. ఇందులో 2.5 లక్షల ఎకరాల్లో నెంబర్ వన్ క్వాలిటీగా భావించే వనామి రొయ్యల పెంపకం జరుగుతోంది. 2023-2024లో ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాల రొయ్యల దిగుబడి 6నుంచి 7 లక్షల టన్నుల వరకు ఉంటుంది. పీక్ హార్వెస్టింగ్ సీజన్ (ఏప్రిల్-జూలై)లో రోజుకు వేల టన్నుల్లో రొయ్యల్ని పడుతుంటారు. ప్రస్తుతం రొయ్యలు చెరువుల్లోనే ఉండిపోయాయి.

ఎగుమతుల్లో ఏపీ టాప్‌

సీఫుడ్, ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉంది. 2018–19 నాటికి 13,855 కోట్ల విలువైన ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అవ్వగా.. 2023–24 లో ఏపీ నుంచి రూ.19,420 కోట్ల విలువైన 3,47,927 మెట్రిక్‌ టన్నుల సీఫుడ్‌ ఎగుమతి జరిగింది. మొత్తంగా అగ్రి ఎక్స్‌పోర్ట్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ 31 శాతం వాటాతో అగ్రగామిగా ఉండగా.. తర్వాత స్థానాల్లో కేరళ 13, మహారాష్ట్ర 12, తమిళనాడు 11, గుజరాత్‌ 8.5 శాతంతో ఉన్నాయి.

25 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామానికి చెందిన ఆక్వా రైతు అడ్డాల త్రిమూర్తులు చెప్పిన దాని ప్రకారం.. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధించిన సుంకాల వల్ల అంతిమంగా నష్టపోతోంది కేవలం రైతులు మాత్రమే. పెరిగిన సుంకాల్ని రైతులు భరించాలనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక్క రోజు రొయ్యలు పట్టకుండా ఆపేస్తే లక్షల్లో నష్టం వస్తుందని, ఎప్పుడైతే సుంకాలు పెంచారో వెంటనే ప్రాసెసింగ్ యూనిట్ల వారు లారీలు పంపించడం ఆపివేశారన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన ఆక్వారైతు గాడిరాజు శ్రీరామరాజు మాట్లాడుతూ ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆక్వా రైతులకు ఎదురవుతూనే ఉంటుందన్నారు. ఎక్కడో సుంకాలు పెంచితే ఆ భారం రైతులపై ఎందుకు పడాలన్నారు. "రైతులు భరించాలంటే పెట్టుబడి ఖర్చులు తగ్గాలి. ఫీడు కంపెనీల వారు ఫీడు ధర తగ్గించడం లేదు. రొయ్య పిల్లలు ఇచ్చే వారు పిల్లల ధర తగ్గించడం లేదు. ఇక పెట్టుబడి ఖర్చులు రూపాయి కూడా తగ్గటం లేదు. 15 ఎకరాల్లో రొయ్యలు సాగు చేశా. నష్టాలు భరించాలంటే జీవితం చాలించాల్సిందే" అని ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామానికి చెందిన జంపాన సత్యనారాయణ మాట్లాడుతూ పది ఎకరాల్లో రొయ్యలు సాగు చేశాను. ఉన్నట్లుండి ప్రాసెసింగ్ యూనిట్ల వారు కొనుగోలు ఆపేశారు. దీని వల్ల రోజు వారీ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందన్నారు. కొనుగోలు ఆగినా రొయ్యల పెంపకానికి పెట్టే ఖర్చు ఆపేందుకు వీలు లేకుండా పోయిందని ఆవేదన చెందారు.

నేలచూపులు చూస్తున్న ౩౦ కౌంట్ రొయ్య..

ఈ ఏడాది జనవరిలో 30 కౌంట్‌ రొయ్య ధర కిలో రూ.600 వరకు ఉంది. తర్వాత క్రమంగా తగ్గుతూ.. ప్రస్తుతం రూ.400 స్థాయికి చేరింది. సగటున కిలో రూ.200 తగ్గింది. 50 కౌంట్‌ రొయ్యలకు కూడా ఇప్పుడు రూ.300 మాత్రమే దక్కుతోంది. పరిశ్రమలకు విద్యుత్ కోతల అమలు సమయంలో కూడా వ్యాపారులు రొయ్యల ధరలను సగటున కిలోకు రూ.50 వరకు తగ్గించారు. ఆ తర్వాత కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు పెంచినా.. మళ్లీ తగ్గుదల మొదలైంది. 50, 60 కౌంట్‌ రొయ్యలను అడగటం లేదని.. బతిమాలితే ధర తగ్గించి కొంటున్నారని రైతులు చెబుతున్నారు.

ఎంపెడా, మత్స్యశాఖ అధికారుల నియంత్రణ కొరవడటంతో ధరలు ఇష్టారాజ్యంగా తగ్గించేస్తున్నారని పలువురు రైతులు మండిపడుతున్నారు. 20 రోజుల వ్యవధిలోనే 30 కౌంట్‌ రొయ్య ధర రూ.510 నుంచి రూ.420కి పడిపోయిందని తూర్పుగోదావరి జిల్లా చెయ్యేరు రామలింగేశ్వర ఆక్వా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు నాగభూషణం పేర్కొన్నారు. సగటున టన్నుకు రూ.లక్షకు పైగా నష్టపోతున్నామని అన్నారు.

కిలో రొయ్య తయారీకి అయ్యే ఖర్చు..

కిలో రొయ్యల ఉత్పత్తికి సగటున రూ.300 వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. అమ్మకం ద్వారా సగటున (అన్ని రకాల కౌంట్‌ కలిపి) కిలోకు రూ.250 నుంచి రూ.270 మాత్రమే వస్తోంది. దీంతో కిలోకు రూ.40 చొప్పున నష్టపోతున్నామని ప్రకాశం జిల్లా కొత్తపట్నం రైతు హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

రొయ్యల కౌంట్ అంటే...

పెద్ద సైజు రొయ్యల ధర ఎక్కువ ఉంటుంది. కిలోకి తూగే రొయ్యల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. కిలోకు తూగే రొయ్యలను లెక్కకట్టి కౌంట్ గా నిర్థారిస్థారు. సాధారణంగా చెరువుల్లో సాగు చేసే రొయ్యలు కిలోకు 60 లోపు తూగుతాయి. దాన్ని 60 కౌంట్ అంటారు. ౩౦ తూగితే 30 కౌంట్ అని, 40 తూగితే 40 కౌంట్ అని అంటుంటారు. పెద్ద సైజు రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. వాతావరణ మార్పులతో చెరువుల్లో అత్యవసరంగా రొయ్యలు పట్టాల్సి వస్తే కిలోకి 80 కౌంట్ పైబడి ఉంటే లోకల్ మార్కెట్లో విక్రయిస్తారు. కిలోకు ఎన్ని రొయ్యలు తూగుతాయో వాటిని కౌంట్ అంటారు.

రవాణాకు సిద్ధమైన రొయ్యలపై రూ. 600 కోట్ల భారం

ప్రస్తుతం అమెరికాకి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న రొయ్యల కంటైనర్లు సుమారు 2 వేల వరకు ఉన్నాయి. వీటిలో దాదాపు 40వేల టన్నుల రొయ్యలు ఉన్నాయి. ఇంతే సంఖ్యలో కోల్డ్ స్టోరేజీలో రొయ్యలు రవాణాకు సిద్ధంగా ఉన్నాయి. అంటే దాదాపు 80వేల టన్నుల రొయ్యలు అమెరికాకి పంపడానికి సిద్ధంగా ఉన్నట్టు సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEAI) అధ్యక్షుడు జి పవన్ కుమార్ చెప్పారు. ఈ రొయ్యలు అమెరికాలో దిగుమతి కావడంతోనే వాటిపై సుంకం భారం పడనుంది. ఈ మొత్తం దాదాపు రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

రోజుకు ఎగుమతి అయ్యే రొయ్యలు

మామూలు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రోజుకు సుమారు 800-1,000 టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతాయని అంచనా. 2023-24లో దేశవ్యాప్తంగా మొత్తం 7,16,004 టన్నుల రొయ్యలు ఎగుమతి అయ్యాయి. అంటే సగటున రోజుకు 1,960 టన్నులు వస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 70 శాతం. ట్రంప్ దెబ్బతో ఈ ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి.

లక్షల మంది ఉపాధిపై ప్రభావం..

ఆక్వా రంగం ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి, 7 లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పిస్తోంది. ఎగుమతులు ఆగడంతో ఈ ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, రవాణా, కోల్డ్ స్టోరేజ్, ఫీడ్ సరఫరా వంటి అనుబంధ రంగాల్లోని కార్మికులు కూడా ప్రభావితం కానున్నారు. సుమారు 5-7 లక్షల మంది ఉపాధిపై ప్రత్యక్ష, పరోక్షంగా ప్రభావం పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రైతుల నెలవారీ ఖర్చులు

ఒక ఎకరం ఆక్వా సాగుకు రైతులు సాధారణంగా రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. ఇది 3 నెలల పంట. అయ్యే ఖర్చులో రొయ్యల మేత ఖర్చు అత్యధికంగా అంటే 60-70 శాతం వరకు ఉంటుంది. మిగతా 30 శాతం ఖర్చుల్లో విద్యుత్, ప్రోబయోటిక్స్, యాంటీబయోటిక్స్ వంటివి ఉంటాయి. నెలకు సగటున రూ. 1.5 లక్షల ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు.

ఏపీలో ప్రస్తుతం 16 వరకు రొయ్యల ఫీడ్ అమ్మే కంపెనీలు ఉన్నాయి. రొయ్యల ఫీడ్ కేజీ ధర రూ. 121 వరకు ఉంది. అప్పు తీసుకునే రొయ్యల రైతుకు వడ్డీ కలుపుకుని వసూలు చేస్తారు. రొయ్య సైజు పెరిగే కొద్ది ఫీడ్ ఖర్చు పెరుగుతుంది. ప్రస్తుతం అమ్మకాలు లేకపోవడంతో ఈ ఖర్చులు భారంగా మారాయి.

కేంద్రానికి చంద్రబాబు లేఖ

ఈ సమస్యను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025 ఏప్రిల్ 6న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు కల్పించేలా చర్చలు జరపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్య పక్షాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. చంద్రబాబు లేఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. మరోపక్క SEAI కూడా కేంద్ర జోక్యాన్ని కోరుతూ ఒత్తిడి పెంచింది.

ఏం జరిగే అవకాశం ఉంది?

భారత ప్రభుత్వం అమెరికాతో ద్వైపాక్షిక చర్చల ద్వారా సుంకాలను తగ్గించే ప్రయత్నం చేయాలి. చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్ వంటి మార్కెట్లను అన్వేషించాలి. రొయ్యల రిటైల్ అవుట్‌లెట్లు, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించాలి. రొయ్య పిల్లల ధరలు తగ్గించి, ఫీడ్ ధరలు తగ్గించాలి. రైతులకు తాత్కాలిక ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంది.

క్రాప్ హాలిడే ఆలోచనలో రైతులు?

రొయ్యల పెంపకం పెను భారంగా మారటంతో ఆక్వా రైతులు పంట విరామం (Crop Holiday) ప్రకటించాలనే ఆలోచనలో పడ్డారు. అదే జరిగితే రాష్ట్రంలో లక్షలాది మంది ఆర్ధికంగా నష్టపోయే అవకాశం ఉంది. దీనికి తోడు క్రాప్ హాలిడే వల్ల చెరువులు చాలా వరకు పాడై పోతాయి. మళ్లీ వీటిని పునరుద్ధరించడానికి చాలా వ్యయప్రయాసలు పడాల్సి ఉంటుంది. ఈ విషయమై ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ చాలా సీరియస్ గా ఆలోచనలో పడినట్టు అసోసియేషన్ కార్యదర్శి గాజురాజు వెంకట సుబ్బరాజు తెలిపారు.

రొయ్యలకు అతి పెద్ద మార్కెట్ అమెరికా

భారత రొయ్యల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. 2023–24లో ఇండియా నుంచి 132 దేశాలకు రూ.60,523 కోట్ల సీఫుడ్‌ ఎగుమతులు జరిగాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో 4 శాతం వాటాతో 6వ అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్‌ నిలిచింది. ఇండియా నుంచి యూఎస్‌ఏకు 34.5 శాతం, చైనాకు 18.76, జపాన్‌కు 5.42, వియత్నాంకు 5.30, థాయ్‌లాండ్‌కు 3.82 శాతం ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో ఫ్రోజెన్‌ ష్రింప్‌ వాటా 40 శాతం ఉంది.

ఈ నేపథ్యంలో అమెరికా విధించిన సుంకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని ఆంధ్రప్రదేశ్ రొయ్యల పెంపకందారుల సంఘం కోరుతోంది.

Tags:    

Similar News