‘బుద్ధుని మార్గం అనుసరణీయం’

బుద్దుని బోధనలు ఈనాటికి ఆచరణ యోగ్యమైనవని వల్లం లక్ష్మణరెడ్డి తెలిపారు. బుద్దుని బోధనలను అనుసరించడం ద్వారా ప్రజలు జాగృతమవుతారని చెప్పారు.

Update: 2024-05-23 11:20 GMT

నేడు భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యల పరిష్కారానికి బుద్ధుని మార్గం అనుసరణీయమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈనెల 23వ తేదీన గుంటూరులోని విజేత కాన్సెప్ట్ స్కూల్‌లో బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సభకు సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్. అరవింద్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ బౌద్ధ మతం నేడు ప్రపంచంలో నాలుగో మతంగా కొనసాగుతోందని, ప్రపంచ జనాభాలో ఏడు శాతం మంది బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తున్నారని అన్నారు.

బుద్ధుని బోధనలో పంచ శీల ముఖ్యమైందని, ప్రాణ హాని చేయరాదని, దొంగతనం చేయరాదని, అబద్దం ఆడరాదని, వ్యభిచారాన్ని నివారించాలని, మత్తు పానీయాలను నిరోధించాలని 2,600 సంవత్సరాల క్రితమే పేర్కొన్నాడని తెలిపారు. దుఖం మానవ సహజమని దానికి కారణం కోరికలని వాటిని అధిగమించడానికి అష్టాంగ మార్గాన్ని ఆచరించాలని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడన్నారు. నేడు ప్రపంచంలో దాదాపు 30 దేశాలలో బౌద్ధం అమలులో వుందన్నారు.

ప్రొఫెసర్ ఎన్. అరవింద్ ప్రసంగిస్తూ సరైన జ్ఞానాన్ని పొంది దానిని ఆచరించడం ద్వారా పుట్టుకతో సంబంధం లేకుండా ప్రతి మనిషి బుద్ధుడిలా జీవించవచ్చని అన్నారు. సామాజిక అంతరాలకు ఆనాడే బుద్ధుడు పరిష్కారం చూపినారన్నారు. వైదిక మతంలో ఆనాడు అమలులో ఉన్న జంతు బలులు, క్రతువులు, హోమాలను వ్యతిరేకించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేశారన్నారు.


 



వ్యక్తిత్వ వికాస నిపుణులు, స్టెప్ వ్యవస్థాపకులు ప్రత్యూష సుబ్బారావు ప్రసంగిస్తూ బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాలైన మంచిగా చూడటం, మంచిగా వినడం, మంచిగా మాట్లాడటం, మంచిగా ఆలోచించడం, మంచిగా పని చేయడం, మంచి సంకల్పం ఉండటం, మంచి జ్ఞానంతో పాటు సాధన చేయాలని ప్రబోధించారన్నారు. మానవత చైర్మన్ పావులూరు రమేష్ ప్రసంగిస్తూ మానవాళి ఓర్పు, సహనాన్ని పెంచడంతో పాటు శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని బుద్ధుడు ప్రపంచానికి చాటి చెప్పినారన్నారు.


ఈ కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యదర్శి డి.దేవరాజ్, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ.నారాయణరెడ్డి, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు మధు, పిరమిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు, భారత్ బచావో జిల్లా అధ్యక్షులు బత్తుల కోటేశ్వరరావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు రామమోహన్ రావు, స్టెప్ ప్రిన్సిపాల్ బత్తుల కృష్ణయ్య, మేలుకో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి సేతు రామేశ్వర రెడ్డి, ప్రవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి టి. వీరయ్య లతోపాటు వివిధ విద్యాసంస్థలకు చెందిన ఈదర గిరీష్, ఎం.విజయలక్ష్మి, కొరటాల శ్రీవల్లి, డి ప్రసాద్ మరియు మహిళా నేతలు వై. సమత, కె.పావని, ఎం పద్మరాణి తదితరులు ప్రసంగించారు. వందలాది విద్యార్థులు ఉపాధ్యాయులు, విద్యావేత్తలు బుద్ధుని విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.

Tags:    

Similar News