స్ట్రాంగ్ రూమ్‌లకు మూడంచెల భద్రత
భద్రంగా స్ట్రాంగ్ రూముల్లో నేతల భవితవ్యం ఉంది. పటిష్టమైన భద్రతను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.
Byline : The Federal
Update: 2024-05-18 14:57 GMT
రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంల భద్రత కోసం ఎలక్షన్ కమీషన్ మూడంచెల భద్రత విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో పాటుగా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కూడా అమలు చేస్తోంది. కేంద్ర పోలీసు బలగాలు ఒక వైపు జిల్లా ఆర్డ్మ్, రిజర్వు పోలీసు బలగాలు మరోవైపు, స్థానిక సివిల్ పోలీసులు ఇంకో వైపు బందో బస్తును నిర్వహిస్తున్నారు. 24 గంటల పాటు షిప్టుల వారీగా బందో బస్తు ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతాన్నంతా సీసీకేమేరాల పరిధిలోకి తీసుకొచ్చారు. తాళాలు వేసిన సీళ్లను ప్రతి రోజు ఎన్నికల అధికారులు అబ్జర్వు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ ఏ చిన్న తేడా వచ్చినా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన పర్యవేక్షణ అధికారులు వెంటనే ఎన్నికల కమిషనర్ లేదా జిల్లా కలెక్టర్‌ల దృష్టికి తీసుకెళ్తారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ప్రతి రోజూ ఒకటి, రెండు జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలిస్తున్నారు. అక్కడ భద్రత గురించి కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతున్నారు. ఏ చిన్న పొరపాటు కూడా జరక్కుండా చూసుకోవాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. శనివారం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను కూడా ఆయన పరిశీలించారు. విశాఖ జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ ఎ రవిశంకర్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్, ఎస్పీ జిఆర్ రాధికలతో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ పరిధిలోని అన్ని శాసన సభ నియోజక వర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బందితో మాట్లాడారు. తలుపులకు వేసిన తాళాల సీళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కేమేరాలు పని చేస్తున్నాయో కూడా టెస్ట్ చేశారు. తనిఖీల అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన తనిఖీ రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్‌లున్న ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని భద్రతా సిబ్బందిని హెచ్చరించారు. ప్రస్తుతం నేతల భవిష్యత్ స్ట్రాంగ్ రూముల్లో నిక్షిప్తమై, పోలీసుల వలయంలో ఉంది.