తిరుమల : పల్లకీ మోతకు అడుగులు నేర్పిన వెంకన్న
అది కొండకిందపల్లె. ఆ తరువాత చందమామలపల్లె. ఇప్పుడు పెరుమాళ్ల (దేవుడి) పల్లె. ఇంతకీ ఈ పల్లె వారే శ్రీవారి పల్లకీ ఎందుకు మోస్తారు.
ఆదిశేషుడు.. వాసుకి... సూర్యచంద్రులు.. అంజనీపుత్రుడు మోసి తరించారు. అలాంటి దేవగణాలతో పాటు వైకుంఠవాడు... పక్షిరాజు గరుత్ముండు.. గజరాజు తదితర దేవగణాలు తమ భుజకీర్తులపై అలంకార ప్రియుడైన సప్తగిరీశుడిని తరతరాలుగా మోస్తూ తరిస్తున్నారు. ఆ పరంపరలో కొండరెడ్లు (వాహన బేరర్లు), పల్లకి మోయడం తమకు దక్కిన భాగ్యంగా భావిస్తారు. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పెరుమాళ్లపల్లెకు టీటీడీ,, తిరుమలతో విడదీయలేని బంధం. ఆ పల్లెలో పెద్దలు కొందరు, కలత చెందుతున్నారు.
వారి డ్రస్ కోడ్ : తలకు పసుపు రంగు రుమాలు, భూజాన టర్కీ టవల్, లైట్ కలర్ బ్లూ చొక్కా. అడ్డ పంచె. వాహన సేవలో ఇలా కనిపిస్తారు. గరుడసేవ రోజు వారి వస్త్రధారణలో మార్పు ఉంటుంది. వాహనంపై ఉన్నది రాజులకే రాజు, దేవదేవుడు కావడం వల్ల కుచ్చు టోపీని తలపించే రుమాలు ఉంటుంది. అన్నీ కొత్త వస్త్రాలు ధరిస్తారు. అడుగులు కూడా సంగీతాన్ని తలపించే శబ్దాలతో సాగుతాయి.
నాడు కొండకిండపల్లె ...
ఆధునిక వసతులు అందుబాటులో రోజుల్లో నుంచి శ్రీవారిమెట్టు నుంచి తిరు మలకు కాలిబాట (ప్రస్తుతం అదే శ్రీవారిమెట్టు) ఉంది. అప్పట్లో కొండకింద ఓ కుగ్రామం ఉండేది. దాని పేరు ప్రజలందరూ కొండకిందపల్లె అని పిలిచేవారు. ఇక్కడి నుంచి తిరుమలలో ఆలయానికి అవసరమైన వస్తుసామగ్రి నెత్తిమోతపై తీసుకుని వెళ్లేవారు. కొందరు డోలీలు మోసేవారు. ఈ గ్రామంలో ఎక్కువమంది తిరుక్షేత్రానికి వెళ్లి అక్కడ చిన్నపనులు చేసి, వాహనం మోసేవారు. అందుకు వారికి మహంతులు అప్పట్లో ఒక గంగాళం శ్రీవారి ప్రసాదం ఇచ్చేవారు. అయినా, వారు స్వామివారి సేవను మాత్రం వదల లేదు. ఒకానొక సందర్భంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. పలువురు మరణించారు. దీంతో కొండకిందపల్లెలో ఖాళీ చేశారు.