బాపట్ల సీటు ఆశించి భంగపడిన ఉండవల్లి శ్రీదేవి
బాపట్ల టీడీపీ అభ్యర్థి ఎంపిక పార్టీ వర్గాలకు షాకిచ్చింది. బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి, ఐపీఎస్ అధికారి సీటు దక్కించుకున్నారు. బాబు వ్యూహంలో భాగమే ఈ ఎంపిక.
By : The Federal
Update: 2024-03-23 13:31 GMT
జి. విజయ కుమార్
2019లో వైసీపీ నుంచి గెలిచారు. అక్కడ ఇమడ లేక పోయారు.
2023లో టీడీపీలో చేరారు. బాపట్ల సీటిస్తారని ఆశించారు.
ఇప్పుడు రెంటికి చెడిన రేవడి అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపికలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాయకులను కాదని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక మాజీ ఐపిఎస్ అధికారిని, తెలంగాణ రాష్ట్రానికి బిజెపి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టి కృష్ణప్రసాద్‌ను టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. మరో వైపు బాపట్ల ఎంపి స్థానం కోసం పోటీ పడి సీటును దక్కించుకోలేక భంగపడిన నేతల తీరు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బాపట్ల ఎంపి స్థానాన్ని ఆశించినా దక్కక పోడంతో సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది. ఆమె చేసిన ట్వీట్ వైరల్ మారింది. దానికి వెన్నుపోటుకు సింబల్ అయిన కత్తి ఫొటో పెట్టి బాపట్లకు హ్యాష్‌ట్యాగ్ చేసి పోస్టు పెట్టారు. ఇదే బాపట్ల ఎంపి సీటును ఆశించిన వారిలో మరొక టీడీపీ సీనియర్ నేత ఉన్నారు. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు కూడా ఈ స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. దక్కక పోడంతో అసంతృప్తికి గురయ్యారు. ఆయనను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు.
బాపట్ల స్థానం ఆశించిన ఉండవల్లి శ్రీదేవి
బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆశించారు. తనకే దక్కుతుందని, చంద్రబాబు తనకే కేటాయిస్తారనే ధీమాతో ఉన్నారు. ఆ ఒప్పందంతోనే ఆమె టీడీపీలో చేరారు. తాడికొండ నుంచి 2019 ఎన్నికల్లో ఆమె వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. తొలి నాళ్ల నుంచే ఆమె తాడికొండ నియోజక వర్గంలో సొంత పార్టీ నేతలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవి తీవ్ర రూపం దాల్చడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. వారిపైన అసమ్మతి గళం వినిపించడం మొదలు పెట్టారు. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసిందని ఆమెను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు సంధిస్తూ వచ్చారు. 2023 డిసెంబరులో చంద్రబాబు సమక్షంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో తనకు బాపట్ల ఎంపి కానీ, తాడికొండ ఎమ్మెల్యేగా కానీ, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యేగా కానీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలనే ఒప్పందం మేరకే ఆమె టీడీపీలో చేరినట్లు సమాచారం. గతంలో చంద్రబాబు ప్రకటించిన రెండు జాబితాల్లో తాడికొండ, తిరువూరు స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. అక్కడ ఆమెకు అవకాశం పోయింది. ఇక బాపట్లపైన ఆశ పెట్టుకుంది. శుక్రవారం ప్రకటించిన మూడో జాబితాలో బాపట్లకు ఆమె పేరు లేక పోవడం ఆ ప్లేస్‌లోకి వేరే కొత్త నేతను అభ్యర్థి అని ప్రకటించడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వెళ్ల గక్కారు. రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైందని, దానికి వెన్నుపోటు సింబల్‌గా ఖడ్కం చిత్రం జత చేసి పోస్టు చేశారు.
భంగపడిన ఎమ్మెస్ రాజు
బాపట్ల సీటు ఆశించి అసంతృప్తికి గురైన వారిలో ఎమ్మెస్ రాజు కూడా ఉన్నారు. ఆయన టీడీపీలో సీనియర్ నేత. దాదాపు 30 ఏళ్ల పాటు ఆ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘ కాలంపాటు ఆ పార్టీకి సేవలు అందిస్తున్న నేపథ్యంలో తనకే కేటాయిస్తారని ఆయన భావించారు. తీరా రిటైర్డ్ ఐపిఎస్ అధికారి టీ కృష్ణప్రసాద్ పేరు ప్రకటించడంతో ఆవేదనకు గురయ్యారు. దీంతో ఆయనకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. మరో సీనియర్ నేత ఆలపాటి రాజా, ఎమ్మెస్ రాజును శుక్రవారం చంద్రబాబు వద్దకు పార్టీ నేతలు తీసుకెళ్లారు. సముదాయించిన చంద్రబాబు వేరే ప్రత్యామ్నాయం చూస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణప్రసాద్‌కు బాపట్ల ఎంపి సీటు రావడంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ చక్రం తిప్పినట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ శమంతకమణికి కృష్ణప్రసాద్ అల్లుడు కావడంతో దీనిని కూడా పరిగణలోకి తీసుకొని ఖరారు చేసినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.