విశాఖపట్నం రాజధాని అన్నా.. ఎందుకు నమ్మలేదు?
విశాఖపట్నం రాజధాని. నేను గెలవగానే ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తున్నా.. రాష్ట్ర రాజధాని కేంద్రం విశాఖ.
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత ఈ మాటలు అన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తాను గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన రోజు నుంచి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉంటాయని, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఉంటుందని పలు మార్లు చెప్పారు. పలు సందర్బాల్లో హెచ్‌వోడీలను విశాఖకు తరలించేందుకు తగిన జీవోలు కూడా ఇచ్చారు. ఇవన్నీ పక్కన బెడితే ఎన్నికల ప్రచారంలోనూ నేను విశాఖపట్నం నుంచే తిరిగి ముఖ్యమంత్రిగా పనిచేస్తానని ప్రకటించారు. అయినా ఉత్తరాంధ్ర వాసులు జగన్‌ను నమ్మలేదు. కారణాలు ఏమిటనే అంశంపై వైఎస్సార్‌సీపీలో అంతర్మధనం మొదలైంది. వారు ఎంత మధనపడ్డా చేసేదేమీలేదనేది స్పష్టమైంది. ఉత్తరాంధ్ర ఉమ్మడి మూడు జిల్లాలోని ప్రజలు తిరస్కరించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీకి ఇది వినేందుకే ఒళ్లు జలదరిస్తోంది. విజయనగరం, విశాఖలో అన్నీ తానై చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణ కుటుంబం కూడా ఘోరంగా ఓటమిపాలైంది. వారి ఇంటి నుంచి పోటీ చేసిన వారందరినీ ఓటర్లు ఓడించారు. వారినే కాదు, ఎంతటి గొప్పవారైనా వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి రాజన్నదొర వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అవినీతి మచ్చలేని నాయకుడిగా గుర్తింపు ఉంది. అయినా గిరిజనులు ఆయనను ఓడించి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు. ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీకి దక్కింది అరకు ఎంపీ, పాడేరు, అరకు ఎమ్మెల్యే స్థానాలు. కేవలం గిరిజనుల్లో వైఎస్సార్‌పై ఉన్న సానుభూతి తప్ప జగన్‌పై ఉన్న ప్రేమ వారిని గెలిపించలేకపోయింది.