పార్టీలదేముంది.. పదవే ముఖ్యం..

రాజకీయ పార్టీల మ్యాన్యువల్ పని చేయడం లేదు. గెలిచిన పార్టీ ఏదైనా పవర్ పార్టీలో చేరి పదవులు దక్కించుకోవచ్చు. ఇదీ నేటి ట్రెండ్... మునిసిపాలిటీల్లో ఏమి జరిగిందంటే..;

Update: 2025-02-05 11:47 GMT

రాజకీయ పార్టీలకు ఒక నియమావళి ఉంది. రాజ్యాంగంలోనూ పార్టీలు, పార్టీల తరపున గెలిచిన వారు ఎలా వ్యవహరించాలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. అయితే ఇవన్నీ అమలు చేసేది రూపొందించిన వారే కదా. వారికి తెలియదా... ఎలా వ్యవహరించాలో. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంటుంది. చట్ట సభల్లో స్పీకర్ స్థానం ఎలా ఉందో మనం ఇప్పుడు చూడటం లేదా? రాజ్యాంగాన్ని కొత్తగా అమలు చేస్తున్నప్పుడు నిబంధనలు పాటించాలనే ఆలోచన కొందరిలో నైనా ఉంటుంది. ఎందుకంటే నాటి రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో. రాజ్యాంగ రచనా నేతలతో సంబంధాలు ఉండి ఉంటాయి. పైగా వారి వారసులు కూడా రాజకీయాల్లో నాడు ఉన్నారు. నేడు రాజ్యాంగం అంటూ ఒకటి ఉన్నదని, దానిని చదవాలని, చదివితేనే నిబంధనల ప్రకారం నడుచుకుంటామని చాలా మందికి తెలిసినా పట్టించుకోరు. ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వారికి రాజ్యాంగం చెప్పే మాటలు అవసరం నకెందుకనే వారి సంఖ్యే దేశంలో ఇప్పుడు ఎక్కువగా ఉంది. అందుకేనేమో పార్టీలు, నిబంధనల గురించి ఆలోచించే వారు లేకుండా పోయారు.

స్థానిక సంస్థల్లో రెప్పపాటులో అధికార మార్పు

నేను గెలిచింది వైఎస్సార్ సీపీ తరపున. కానీ కార్పొరేషన్ లో పదవి చేపట్టింది తెలుగుదేశం పార్టీ తరపున. పదవి వస్తున్నప్పుడు గెలిచే పార్టీలో ఓట్లు వేయించుకుని గెలుస్తాం. గెలిచిన తరువాత మునిసిపాలిటీల్లో, మునిసిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పరిస్థితులు మారిపోతున్నాయి. మా పార్టీకి నాయకుడు ఉంటే చాలు, మా పార్టీ తరపున నిన్ను మేయర్ ను చేస్తాం మా తరపున పోటీలో ఉంటావా? ఎలాగూ డబ్బు అందుతుంది. ఎంతకాలం ఉంటే అంత డబ్బు వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీలో ఉంటే తిండికి మెతుకులు కూడా వెతుక్కోవాల్సిందే. అందుకే జస్ట్ జంప్ చేయి. అంతే గెలిచిన పార్టీకి రాజీనామా చేయడం, తిరిగి ఎన్నికలకు పోవడం ఇదంతా వేస్ట్. కేవలం గెలిచిన పార్టీకి మద్దతు ఉప సంహరించుకుని మాకు మద్దతు ఇస్తావు. ఒకసారి ఆలోచించు. పవర్ పార్టీలో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకో...

ఎస్.. ఇదే కరెక్ట్..

పవర్ పార్టీలో ఉంటే కావాలనుకున్నది చేయించుకోవచ్చు. ఉదాహరణకు తిరుపతి మునిసిపాలిటీలో 47 డివిజన్ లు ఉన్నాయి. ఇందులో ఒక్క డివిజన్ లో మాత్రమే గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి గెలిచారు. 46 డివిజన్ లలో వైఎస్సార్ సీపీ వారు కార్పొరేటర్లుగా గెలిచారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికలు వచ్చాయి. ఎలాగైనా తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిని పోటీలో పెట్టి గెలిపించుకోవాలనుకున్నారు. అందుకు ఎన్ని రకాల వలలు వేయాలో అన్ని రకాల వలలు వేశాలు టీడీపీ వారు. ఇంకేముంది తినేందుకు వచ్చిన చేప వలలో పడక మానదు. కొన్ని చేపలు వలలోకి రావు. కానీ వల బయటే తిరుగుతుంటాయి. వాటికి కొద్దిగా మంచి ఆహారం కావాలి. వాటిల్లో తినాలనే ఆశ పెరగాలి. అంటే కాస్త మంచి ఆహారం పెట్టాలి. వద్దనుకున్న చేప కూడా తప్పకుండా వలలోకి వస్తుంది.

అయినా వలలోకి రాలేదనుకో.. గతంలో ఆ చేప ఎన్ని తప్పులు చేసింతో తన తోటి చేపలతోనే తెలుసుకుని బెదిరింపుకు దిగితే... ఇంకేముంది లొంగిపోవాల్సిందే. లేదంటే కేసుల్లో ఆ చేప ఇరుక్కోక తప్పదు. ఈ పదవుల వ్యవహారం కూడా అంతే. తెలుగుదేశం వారి బెదిరింపులకు కొంత మంది భయపడితే, కొందరు భయపడి నట్లు నటించారు. మరి కొందరు వారు అనుకున్న ప్రకారం పైసలు తీసుకున్నారు. ఇలా సగం మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పంచన చేరి వారిలో నుంచే ఒకరిని తెలుగుదేశం మిత్రపక్షాల అభ్యర్థిగా గెలిపించుకున్నారు. తప్పు గెలిచిన వారు, గెలిపించిన వారిది కాదు. ఏ చట్టంలోనైతే లొసుగులు ఉన్నాయో వాటిని ఉపయోగించి కావాల్సింది సాధించిన వారిది. వారు లొసుగులను బట్టి పావులు కదిపారు. అందువల్ల వారు కూడా దొరికే అవకాశం లేదు. ఇదండీ మొత్తం మీద రాజకీయ పదవీ వ్యాపారం. దీనిని వ్యామోహం అని కూడా అనొచ్చు.

మొత్తం 12 మునిసిపాలిటీలు, కార్పొరేషన్స్, నగర పంచాయతలకు చైర్మన్ లు, వైఎస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 9చోట్ల పోలింగ్ జరగ్గా తెలుగుదేశం పార్టీ వారు గెలుచుకున్నారు. పిడుగురాళ్ల, తుని, పాలకొండల్లో ఎన్నికలు వాయిదా పడటంతో తిరిగి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. రెండుచోట్ల కోరం లేక వాయిదా పడగా, తునిలో శాంతి భద్రతల సమస్య తలెత్తి ఎన్నికలు ఆగాయి.

Tags:    

Similar News