జగనన్నా ఏందీ పని ?

ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలు అఘాయిత్యాల పాలవుతోంటే నువ్వేమో లండన్‌లో పొర్లు దండాలు పెట్టించుకుంటున్నావు.

Byline :  The Federal
Update: 2024-05-25 15:37 GMT

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌ టూర్‌లో వింతలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఎండలకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాస్త రెస్టు తీసుకునేందుకు, కుమార్తెలతో సరదాగా గడిపేందుకు అందరూ వెళ్లారని అంటున్నారు. అక్కడ అలాంటిదేమీ కనిపించడం లేదు. లండన్‌ నగరంలో రోజుకో ప్రోగ్రామ్‌తో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కొందరు, ఎన్‌ఆర్‌ఐలు మరి కొందరు అదర గొడుతున్నారు. రెండు రోజుల క్రితం వైఎస్‌ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో లండన్‌లో ఓ పాట కచేరీ జరిగింది. అందులో జగన్‌ ఎన్నికల ప్రచార పాటలు హోరెత్తాయి. ఏపీలో నవయుగ గాయని మంగ్లీ నేతృత్వంలో పాట కచేరి జరగడం విశేషం. ఈ పాటలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప తనాన్ని, పొగుడుతూ హోరెత్తించాయి. లండన్‌ వీధుల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలు తమ కార్లకు వైఎస్‌ఆర్‌సీపీ జెండాలు కట్టి రోడ్లపై ర్యాలీ నిర్వహించారు. ఇదంతా చూస్తే లండన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ పోటీ చేస్తుందేమో, అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయేమో అనే వాతావరణం కనిపిస్తుంది.

లండన్‌లో జరగుతున్న హడావుడిపై జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చురకలంటించే కామెంట్లు చేశారు. ‘నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు, నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని ముసలి కన్నీరు, ఫేక్‌ ప్రేమలు నటించే ముఖ్యమంత్రిగారు, మన రాష్ట్రంలో మీ పాలనలో మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన పీడా దేశమంతా చెప్పుకుంటోంది. లండన్‌ వీధుల్లో పోర్లు దండాల మధ్య విహరిస్తున్న మీకు ఇక్కడి ఆర్థనాధాలు, ఆహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తల వంచుకుంటారో, సిగ్గు లేకుండా మిన్నకుండి పోతారో ప్రజలు గమనిస్తున్నారు’ అంటూ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఇంగ్లీషు పత్రికలో వచ్చిన ఒక వార్త క్లిప్పింగ్‌ను ఆమె ట్విటర్‌లో పోస్టు చేశారు.
ఏలూరు జిల్లా కైకలూరు నియోజక వర్గం మండవల్లి గ్రామంలో మే 15న 10వ తరగతి చదువుకునే బాలికపై క్లాస్‌ రూమ్‌లోనే అత్యాచారం చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే లండన్‌లో పోర్లుదండాలు పెట్టించుకుంటారా అంటూ ప్రశ్నించడం విశేషం. మండవల్లిలో చోటు చేసుకున్న విద్యానిపై అత్యాచార విషయాన్ని పూర్తి వివరాలతో దిఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దృష్టికి తీసుకొచ్చింది. కొన్ని వేల మంది ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌లో ప్రచురితమైన కథనాన్ని చదివారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఘటన ఒక విధంగా ప్రభుత్వ నిర్లక్షాన్ని ఎత్తి చూపిందని చెప్పొచ్చు. అందుకే ఆ స్థాయిలో షర్మిల స్పందించారు.
ఇటీవల కాలంలో రాష్ట్రంలో నేరాలు పెరుగుతూ వస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు, దాడులు ఎక్కువుగా జరిగాయి. ఎన్నికల్లోను హింస ప్రజ్వరిల్లింది. పల్నాడులో రక్తం చిందింది. ఇవన్నీ పట్టకుండా పాలకులు డ్యాన్సులు వేస్తూ, ఆనంద డోలికల్లో మునిగి తేలడాన్ని షర్మిల తప్పు బట్టడాన్ని పలువురు సమర్థిస్తున్నారు.
Tags:    

Similar News