తిరుమల శ్రీవారి సొమ్ము ప్రజల కోసం ఖర్చుచేయాకూడదా!

తిరుపతి ప్రజల సౌకర్యాలకోసం ఒక శాతం నిధలు ఖర్చు చేయాలన్న టిిిటిడి ప్రతిపాదన ఎందుకు వివాదాస్పదమవుతున్నది

Update: 2024-01-03 10:13 GMT


- కందారపు మురళి


దేవుని సొమ్మును ప్రజల అవసరాలను తీర్చటానికి ఖర్చు చేయవచ్చా? లేదా? అన్న చర్చ తిరుపతి నగరంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతున్నది.

దేవుని సొమ్ము ప్రజల అవసరాలకు ఖర్చు చేయకూడదని గత అనేక ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ నుంచి  అడ్డంకులు ఎదురువుతున్నాయి.  తిరుమల-తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుపతి అభివృద్ధికి తన బడ్జెట్లో ఒక శాతం నిధులు కేటాయించటం, తిరుపతి నగరంలో పారిశుధ్య పనుల నిర్వహణకు టిటిడి బాధ్యత తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి కోర్టులో వ్యాజ్యాలు సడుపుతున్నది.

ఇదే అంశంపై తెలంగాణాకు చెందిన ఓ కేసులో మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్, మరో న్యాయమూర్తి ఎస్. రవీంద్ర భట్ లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు గతంలో చేశారు.

1863 దేవాదాయ చట్టాన్ని ఉదహరిస్తూ అలయాలకు వచ్చే నిధులు ప్రజల నుంచే కాబట్టి అవి తిరిగి ప్రజలకే వెచ్చించాలని అన్నారు. సమాజ పెద్ద అవసరాలను ప్రభుత్వమే కాకుండా ఆదాయం ఉన్న ఆలయాలు, మత సంస్థలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా తిరుమల - తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఢిల్లీలోని విద్యాసంస్థ గురించి, కళాశాలలు, వైద్య సంస్థల గురించి న్యాయమూర్తులు ప్రస్తావించారు.

దేశంలో 9 లక్షల ఆలయాలు ఉండగా ప్రభుత్వ నియంత్రణలో 4 లక్షలు ఉన్నాయని సామాజిక అవసరాలు తీర్చటం ఆలయాల బాధ్యతగా ఉండాలని చెప్పారు.

శుచి, శుభ్రతకు బిజెపి అడ్డు

ఇంటికొచ్చే ఎవరినైనా కాళ్లు చేతులు కడుక్కుని లోపలికి రమ్మనటం ఆనవాయితి. అలాంటిది తిరుపతి మీదుగా తిరుమలకు వెళ్లాల్సిన భక్తులకు అత్యంత శుభ్రంగా, పవిత్రంగా తిరుపతిని ఉంచటానికి టిటిడి తన నిధులను పారిశుధ్య నిర్వహణకు కేటాయింపులు చేస్తే బిజెపి అడ్డుపుల్ల వేసింది.

తిరుపతి నగరాభివృద్ధికి ఒక శాతం నిధులను మున్సిపాలిటీకి కేటాయిస్తూ టిటిడి పాలకమండలి చేసిన తీర్మానంపై బిజెపి వ్యతిరేకిస్తూ అడ్డగోలు వాదనలు చేసింది. విశ్వహిందూ పరిషత్ ఎపిలోని అన్ని కలెక్టర్ కార్యాలయాలవద్ద ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసి టిటిడి చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది.

తిరుపతి నగరానికి రోజుకు కనీసంగా లక్ష మంది భక్తులు వస్తుంటారు. గత ఏడాది పెరటాసి మాసం సందర్భంగా 5 లక్షల మంది తిరుమలకు వచ్చారు. వీరంతా తిరుపతి మీదుగా తిరుమలకు చేరుకోవలసిందే.

ఇంత మంది భక్తుల విసర్జకాలు, వ్యర్థాలను నిర్వహించటానికి తమ శక్తి సరిపోవడం లేదని... టిటిడి కూడా బాధ్యత తీసుకోవాలని స్థానిక మున్సిపాలిటీ టిటిడిని కోరింది. దీనికి సానుకూలంగా టిటిడి స్పందించి భక్తులు తిరుగాడే ప్రాంతాల పారిశుధ్య పనుల బాధ్యతను తానే తీసుకుని, టెండర్లను పిలిచింది. దీనిని వ్యతిరేకిస్తూ బిజెపి... భక్తుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని కోర్టుకెక్కింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పనులు ఆగాయి.

ఈ చర్యతో దేవుని సొమ్ము ప్రజలకొరకు ఖర్చు చేయటం సమంజసమా?! కాదా?! అన్న చర్చ ప్రారంభమైంది. 1987లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చొరవతో టిటిడి చట్టాన్ని పటిష్టం చేశారు.

మిరాశీ వ్యవస్థను (స్వామివారి ఆదాయంలో వాటాను పొందే బాపతు) రద్దు చేస్తూ టిటిడి నిధులు విద్యా, వైద్యం, పారిశుధ్యం తదితరాలతో భక్తులు, యాత్రికుల అవసరాలు తీర్చే విధంగా చట్టంలో పలు అర్ధవంతమైన మార్పులు చేశారు.

1986లో జస్టిస్ చల్లా కొండయ్య సిఫార్సుల మేరకు ఈ చట్టం రూపొందించబడింది.

టిటిడి చట్టంలోని నాల్గవ ప్రకరణం, 7వ అంశంలో, 6(ఎ) సబ్ క్లాజ్ 4లో నిధులను పారిశుధ్యం, విద్య, వైద్యం లాంటి పనులకు వెచ్చించవచ్చని స్పష్టంగా పేర్కొనబడింది.

'దళితుల ఉపాధికి గండి'

తిరుపతిలో పారిశుధ్య పనులను అడ్డుకోవటం ద్వారా బిజెపి దళితులు, గిరిజనులు, మహిళల ఉపాధికి గండి కొట్టింది. టిటిడి పారిశుధ్య పనులు చేపట్టడం ద్వారా మరో 1600 కుటుంబాలకు ఉపాధి ఏర్పడేది.

1600 మంది కార్మికులకు పని కల్పించటానికి అవసరమైన ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో ఈ వర్గాలకు బిజెపి ద్రోహం తలపెట్టింది.

టిటిడి నిధుల ఖర్చు విషయంలో బిజెపి దాని అనుయాయ సంస్థలు మొదటి నుంచి యాగీ చేయటం ఆనవాయితీగా మారింది.

ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మిరాశీ వ్యవస్థను రద్దు చేస్తూ 1987లో చేసిన ఈ చట్టాన్ని బిజెపి వ్యతిరేకించింది. టిటిడి ఆదాయంలో కొంత భాగాన్ని మిరాశీలకు చెల్లించాల్సిందేనని, సాంప్రదాయకంగా వస్తున్న మిరాశీ వ్యవస్థను రద్దు చేయటానికి ఎన్టీఆర్ ప్రభుత్వానికి హక్కులేదని బిజెపి వాదించింది. మిరాశీలకు అండగా బిజెపి నిలబడింది.

1988వ సంవత్సరంలో తిరుపతి భూగర్భ డ్రయినేజీ పనులకు 25 కోట్లు అవసరమని, టిటిడి సమకూర్చాలని

తిరుపతి మున్సిపాలిటీ అభ్యర్ధించింది.

టిటిడి సానుకూలంగా స్పందించి రూ.25 కోట్లు కేటాయిస్తూ తీర్మానించింది.

బిజెపి, విహెచ్ పి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టురెక్కాయి. రూ.25 కోట్లు కాస్తా రూ.100 కోట్లు ఖర్చు

అయ్యేంత కాలం కోర్టులలో వ్యాజ్యాలు నడిపి చివరకు విహెచ్ పీ ఓడిపోయింది. టిటిడి గెలిచింది. నాడు నిర్మించిన భూగర్భ డ్రయినేజి నిర్మాణం నేటికీ తిరుపతికి తోడ్పడుతున్నది.

అఖరుకు బిజెపి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ సిటీ జాబితాలో

తిరుపతికి స్థానం సంపాదించింది.

'తిరుపతి ప్రజలకు బిజెపి వ్యతిరేకం'

తిరుపతి నగరానికి సమీపంలో కరకంబాడి వద్ద టిటిడి ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని టిటిడి తీర్మానించగా నాటి ఇఓ ఐవైఆర్ కృష్ణారావు ద్వారా బిజెసి, విహెచ్ పి, ఆర్ఎస్ఎస్ లు కోర్టుకెక్కి అడ్డుకున్నాయి. ఏళ్లతరబడి వ్యాజ్యాలు నడిచి ఇప్పుడు తిరుపతికి 30 కి.మీ దూరంలోని వడమాలపేటలో స్థలాలు కేటాయించారు. బిజెపి పుణ్యమా అని ఉద్యోగులు ఉసూరుమంటున్నారు.

తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు తీరటానికి టిడిపి హయాంలో మున్సిపాలిటీ, టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా

నిర్మాణం తలపెట్టిన గరుడవారధి (ప్రస్తుతం శ్రీనివాససేతు)ని బిజెపి అడ్డుకుని హైకోర్టు మెట్టెక్కింది. ప్రజాగ్రహంతో వెనక్కు తగ్గి తన 'పిల్' ను ఉపసంహరించుకుంది.

తిరుపతి రోడ్ల అభివృద్ధికి, ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల సౌఖర్యాలు, వేతనాల పెంపునకు, విద్యా, వైద్యానికి టిటిడి ఖర్చు చేయటాన్ని బిజెపి అడుగడుగునా వ్యతిరేకిస్తున్నది.

రాష్ట్రానికి తలమానికంగా ఉన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ పోస్టుల భర్తీకి టిటిడి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే హిందూ డాక్టర్లను మాత్రమే రిక్రూట్ చేసుకోవాలని బిజెపి నానాయాగీ చేసింది.

"బిజెపి రెండు నాల్కల ధోరణి'

24 మందితో ఉన్న ప్రస్తుత టిటిడి బోర్డులో బిజెపి అనుకూలురు 9 మంది ఉన్నారు. కర్ణాటక బిజెపి ఎంఎల్ ఏ సైతం సభ్యునిగా ఉన్నారు. బిజెపి నేతలు అమిత్ షా, నిర్మలా సీతారామన్ల సిఫార్సుతో కలిపి మొత్తం 9 మంది సభ్యులుగా ఉన్నారు.

తిరుపతి అభివృద్ధికి టిటిడి నిధులు ఒకశాతం ఖర్చు చేయటానికి, పారిశుధ్య పనుల నిర్వహణకు వీరంతా అనుకూలంగా బోర్డులో తీర్మానం వేశారు. బోర్డులో ఉన్న బిజెపి సభ్యులు తీర్మానంకు అనుకూలం. బోర్డు బయట ఉన్న బిజెపి వ్యతిరేకం.

తిరుమల కొండపై బిజెపి వైఖరి ఒక రకంగా, కొండ కింద బిజెపి వైఖరి మరో రకంగా ఉండటాన్ని పలువురు విమర్శిస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి టిటిడి నిధుల వినియోగంపై తిరుపతికి వచ్చి మరీ నిరసన తెలిపారు. బోర్డులోని బిజెపి సభ్యులు ఆమోదం తెలిపి మీరెందుకు వ్యతిరేకిస్తున్నారన్న దానిపై ఆమె నోరు మెదపలేదు.

సమరసతా ఫౌండేషన్ పేరిట బిజేపి పెత్తనం

టిటిడిలో సమరసతా ఫౌండేషన్ పేరిట బిజెపి తన దందాను సాగిస్తున్నది. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయ నిర్మాణాలు, హిందూ ధర్మం ప్రచారం పేరిట కోట్లాది రూపాయల నిధులను ఈ పౌండేషన్ ఖర్చు చేస్తున్నది. ఈ పౌండేషన్ అమరావతి కేంద్రంగా ఏపి, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో ఖర్చు చేస్తున్నది.

ఐఏఎస్ లుగా పనిచేసి రిటైరయి ప్రస్తుతం బిజెపి నాయకులుగా చలామణి అవుతున్న ఐవైఆర్ క్రిష్ణారావు, దాసరి శ్రీనివాసులు వంటి వారు, విహెచ్ పి, ఆర్ఎస్ఎస్ లలో చురుగ్గా పని చేస్తూ రిటైరైన అధికారులు ఈ పౌండేషన్లో ఉన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు వీరికి టిటిడి సమర్పించుకున్నది. ప్రస్తుత ఇఓ ధర్మారెడ్డిని విహెచ్ పి నేతలు ఇటీవల విహెచ్ పి సమావేశాలకు పిలిచి మరీ సన్మానించారు. ధర్మారెడ్డి సేవలను ప్రశంసించారు.

టిటిడి నిధులు ఆలయ నిర్మాణాలకు, హిందూ ధర్మ ప్రచారానికి మాత్రమే ఖర్చు చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్ పీ లు అదే పనిగా మాట్లాడుతున్నాయి.

టిటిడి తాను నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉన్నది. బిజెపి వత్తిడికి తలొగ్గి ప్రజోపయోగ పనుల నుంచి వెనక్కు మళ్లటం చారిత్రక తప్పిదమవుతుంది. ప్రస్తుత టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలోని పాలకమండలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, భక్తులకు మేలు జరిగే వ్యవహారాలలో వెనక్కు తగ్గకుండా అమలు జరపాల్సిన అవసరం ఉన్నది.


- కందారపు మురళి- గౌరవాధ్యక్షులు, టిటిడి ఉద్యోగ, కార్మిక సంఘాలు, తిరుపతి.


(ఇందులో వ్యక్తీకరించినవి రచయిత సొంత అభిప్రాయాలు, ఫెడరల్- తెలంగాణ వాటితో ఏకీభవించాల్సిన పనిలేదు. సామాజికాంశాలను ప్రజాస్వామికంగా చర్చించాలనే దృక్పథంతో ఈ వ్యాసం ప్రచురించాం. దీని మీద ఎవరైన తమ అభిప్రాయాలను వ్యక్తీకరించవచ్చు.)

Tags:    

Similar News