ఆంధ్రాలో ఎన్నికల హింస ఎందుకు పెచ్చరిల్లింది?

ఏపీలో ఎన్నికల హింస పలు రకాల చర్చలకు దారి తీసింది. అసలు హింస ఎందుకు చోటు చేసుకుందనేది సర్వత్రా చర్చగా మారింది.

Byline :  The Federal
Update: 2024-05-25 13:18 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మే 13న జరిగిన ఎన్నికలపుడు, అనంతరం చోటు చేసుకున్న హింసని అరికట్టేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయరా, ముందు జాగత్ర చర్యలు తీసుకున్నా పరిస్థితి చేజారిపోయిందా అనేది ఇపుడు బాగా చర్చనీయాంశమైంది. ఎన్నికల హింసాత్మక సంఘటనలు చూస్తే రెండు కరెక్టే అనిపిస్తాయి. అంతేకాదు, ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉందో ఇంటెలిజెన్స్‌ విభాగం కనిపెట్ట లేకపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపించిన తరుణంలో రాష్ట్ర పోలీస్‌ బాస్‌ అయిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేయడం ఎంతవరుకు సబబు అనే వాదన వినపడుతూ ఉంది.

సరిగ్గా వారం రోజులు ముందు
పోలింగ్‌కు సరిగ్గా వారం రోజుల ముందు ఎన్నికల కమిషన్‌ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని మార్చింది. అప్పటి వరకు ఎన్నికల సన్నద్దత అంతా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. సుమారు మూడేళ్ల పాటు డీజీపీగా ఉన్న ఆయనకు రాష్ట్రంలోని శాంతి భద్రతలపైన సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. ఏయే ప్రాంతాల్లో గొడవలు, హింసలు చెలరేగే అవకాశం ఉంది, వాటిని ఎలా కంట్రోల్‌ చేయాలి, అసలు వైలెన్స్‌ తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. దానిని ఎదుర్కునేందుకు తగిన పథకం కూడా ఆయన ఆలోచించే ఉంటారు. కానీ అకస్మాత్తుగా రాజేంద్రనాథ్‌రెడ్డిని మార్చేసి కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తాను నియమిచండంతో అసలు చిక్కొచ్చి పడిందనే వాదన మాజీ పోలీసు అధికారులు, రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. అప్పటికే పూర్తి చేసిన ఎన్నికల యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేయడం మినహా కొత్త డీజీపీ చర్యలు చేపట్టేందుకు వీలులేకుండా పోయింది.
కనీసం 20 రోజుల ముందైనా
అదే ఒక నెల ముందో, కనీసం 20 రోజుల ముందైనా కొత్త డీజీపీని నియమించి ఉంటే రాష్ట్ర శాంతి భద్రతలపై ఒక అవగాహన రావడానికి, వైలెన్స్‌ను నిలువరించడానికి తనదైన శైలిలో యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించి అమలు చేసేందుకు చాన్స్‌ ఉండేది. కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండటం వల్ల ఫర్‌ఫెక్ట్‌గా అమలు చేయలేక పోయారనే అంటున్నారు. రాష్ట్రంలో 46,389 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహణ కోసం లక్ష ఆరు వేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపినా ప్రధానంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోనే ఎన్నికల హింస చెలరేగింది. 10 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారు.
ఇనుపరాడ్లు, రాళ్ల దాడులు
పోలింగ్‌ ప్రారంభంలోనే పల్నాడులోని పలు ప్రాంతాలో రక్తం చిందింది. రెంటచింతల, రెంటాల మండలాల్లో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవింద బాబు కారుపైన, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థలపైన దాడులు ప్రతి దాడులు చోటు చేసుకున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ఇనుప రాడ్లతో స్వయం విహారం చేశారు. ఎంపీ లావు కష్ణదేవరాయలు కారును ధ్వసం చేశారు. పెట్రోలు బాంబులు విసురుకోడంతో చివరకు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించాల్సి వచ్చింది. గురజాలలోను ఇదే పరిస్థితు చోటు చేసుకున్నాయి. అన్నమయ్య జిల్లాలోను ఘర్షణలు జరిగాయి. మాచర్లలో టీడీపీ అభ్యర్థి కారును తగులబెట్టారు. కొన్ని గ్రామాలకు కరెంట్‌ కట్‌ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ముగ్గురు టీడీపీ పోలింగ్‌ ఏజెంట్లను కిడ్నాప్‌ చేశారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో కూడా టీడీపీ ఏజెంట్‌ ను కిడ్నాప్‌ చేశారు. వాహనాల ధ్వంసం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
దర్శి నియోజక వర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ వర్గీయులు పరస్పర దాడులకు తెబడ్డారు. గన్నవరంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
తిరుపతిలో టీడీపీ అభ్యర్థిపై దాడులు, పోలీసుల గాలిలోకి కాల్పులు, నంద్యాలలో రాళ్ల దాడులు చోటు చేసుకున్నాయి. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల గృహ నిర్బంధాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది.
2024 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో హింస చెలరేగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ నుంచి అనేక వైఫల్యాలు జరిగాయని మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల విధుల గురించి, నిర్వహణ తీరు ఎలా ఉండాలి, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలనే దానిపై సమగ్రమైన శిక్షణలు ఇవ్వడంలోను లోటు పాట్లు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఎన్నికలకు సరిగ్గా వారం రోజులు ముందు రాష్ట్ర డీజీపీని మార్చడం సమంజసం కాదని, ఒక వేళ మార్చాలని అనుకున్నప్పుడు ఎర్లీగానే మార్చినటై్టతే కొత్తగా వచ్చిన డీజీపీ రాష్ట్ర లా అండ ఆర్డర్‌పై సమగ్ర అవగాహన తెచ్చుకోవడం సులువుగా ఉంటుందని, దాని ప్రకారం ఆ అధికారి ప్రివెంటివ్‌ మెషర్స్‌ తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, కానీ ఈ సారి అది కొరవడినట్లు అనిపిస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇదే అంశంపై ప్రముఖ హైకోర్టు అడ్వకేట్‌ పిచ్చుక శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో యంత్రాంగం వైఫల్యం చెందిందన్నారు. ఎన్నికల సిబ్బందికి సరైన శిక్షణలు ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తేవి కాదన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసను చూస్తుంటే ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యమైందనే భావన వస్తోందన్నారు. ప్రివెంటివ్‌ మెషర్స్‌ తీసుకోవడంలో అలసత్వం వహించారని, దీని వల్లే ఈ సమస్యలు తలెత్తాయని, ఎన్నికలకు ముందు డీజీపీని మార్చడం కూడా హింసకు ఒక కారణమని అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News