వలస పక్షులు మనసు మార్చుకున్నాయా?
ఉత్తరాది నుంచి విడిది కోసం ఏటా వేలల్లో విశాఖకు రాక. సగానికి పైగా తగ్గిపోతున్న వీటి సంఖ్య. ప్రతికూల పరిస్థితులే కారణమంటున్న పక్షి ప్రేమికులు.
విశాఖపట్నం అంటే మనుషులకే కాదు.. పక్షులకూ ఇష్టమే. అందుకే వారి మాదిరిగానే పక్షులు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వాలతాయి. ఇక్కడ వారి మనసుల్లాగే ఇక్కడి ప్రశాంత వాతావరణమూ రా.. రమ్మని ఆహ్వానిస్తుంటుంది. వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటుంది. ఇప్పటికే ఎప్పట్నుంచో రాజకీయ నాయకులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వచ్చే వారికి విశాఖ దశాబ్దాల తరబడి ఆశ్రయం ఇస్తోంది. వారితో పాటే ఇక్కడ అనుకూల వాతావరణానికి ఆకర్షితులై వేల కిలోమీటర్ల దూరం నుంచి పక్షులు కూడా రెక్కలు కట్టుకుని వస్తాయి. కొన్నాళ్లు ఇక్కడే విడిది చేసి పిల్లలతో తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతాయి. అయితే ఇటీవల కాలంలో ఈ వలస పక్షుల రాక తగ్గడంపై పక్షి ప్రేమికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సాధారణంగా ఉత్తరాదిలో శీతాకాలంలో చలి అధికంగా ఉంటుంది. ఆ చలిని తట్టుకోలేని కొన్ని రకాల పక్షులు అక్కడికంటే ఒకింత ఉష్ణ వాతావరణాన్ని కలిగి ఉండే ఉత్తరాంధ్ర సహా విశాఖ ప్రాంతానికి వస్తుంటాయి. వీటిలో కొంగ, బాతు, పక్షి జాతులకు చెందిన రూడీ షెల్టిక్ (బ్రాహ్మణ బాతు), గాడ్వాల్ (డబ్లింగ్ బాతు), నార్తర్న్ పిన్ టెయిల్ (ఉత్తరాది తోకపిట్ట), గ్రీన్ వింగ్డ్ టీల్ (పచ్చ రెక్కల తోకపక్షి), గ్రే హెడెడ్ లాప్వింగ్ (బూడిద తల పక్షి), టెర్మిక్ స్టెంట్, నార్తర్న్ షావెలర్ (పార బాతు), టఫ్టెడ్ డక్ (డైవింగ్ బాతు), ఈస్టర్న్ మార్ష్ హారియర్ (వేటాడే పక్షి), పసిఫిక్ గోల్డెన్ ప్లావెర్ (బంగారు వర్ణ రెక్కల పక్షి), గ్రేట్ క్రెస్టెడ్ గ్రీబ్ (నలుపు, నారింజ రంగుల నీటి పక్షి), రెడ్ క్రెస్టెడ్ పోకర్డ్ (ఎరుపు రంగు ఈదే బాతు), కెంటిష్ ప్లావెర్ (తెలుపు, గోధువ వర్ణ పక్షి), రోజీ స్టార్లింగ్ (గులాబీ రంగు పక్షి), గ్రీనిష్ వార్బ్లర్లు ఉన్నాయి.
ఇవి ఏటా నవంబరులో ఇక్కడకు వచ్చి ఫిబ్రవరి వరకు ఇక్కడే బస చేస్తాయి. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతానికి చేరువలో ఇవి ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. ప్రధానంగా విశాఖ పరిసర ప్రాంతాఐన ఎన్టీపీసీ యాష్ పాండ్స్, మేఘాద్రిగెడ్డ రిజర్వాయరు, మేఘాద్రిగెడ్డ దిగువ ప్రాంతం, విమానాశ్రయ పరిసరాల్లోని నీటి ప్రాంతాలు, గోస్తనీ నది ముఖద్వారం, ఈ నది ముఖద్వారం ఉత్తర ప్రాంతం, బోని చెరువు, పొడుగుపాలెం సరస్సు, తగరపువలస చెరువు, లంబసింగి తదితర ప్రాంతాలను ఈ పక్షులు తమ తాత్కాలిక విడిదికి అనువువైనవిగా ఎంచుకున్నాయి. మూడు నెలలు ఈ పక్షులు తీర ప్రాంతంలో అనువైన చెట్ల మధ్య ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. సమీపంలోని చెరువులు, చిత్తడి నేలల్లో దొరికే చేపలు, పురుగులు, కీటకాలను తింటాయి. ఇక్కడే గుడ్లను పెట్టి పొదిగాక పిల్లలతో తిరిగి పయనమవుతాయి.
తగ్గుతున్న వలస పక్షుల రాక..
గడచిన పదేళ్లలో విశాఖ పరిసరాల్లోని పది ప్రాంతాలకు ఉత్తరాది నుంచి వివిధ రకాలకు చెందిన 1,382 వలస పక్షులు వచ్చినట్టు గుర్తించారు. ఈ శీతాకాలం సీజనులో ఏటా వచ్చే పక్షులు ఈసారి సగం వరకు తగ్గినట్టు వీరు అంచనా వేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విశాఖకు చెందిన కొంతమంది పక్షి ప్రేమికులు (బర్డ్ వాచర్స్).. ఈ పక్షులు ఆవాసాలేర్పరచుకునే విశాఖ పరిసరాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల కు వచ్చిన వివిధ రకాల వలస పక్షులను పరిశీలించారు. గతంతో పోల్చుకుంటే వీటి సంఖ్య గణనీయంగా తగ్గిందని నిర్ధారణకు వచ్చారు. పైగా ఈ సీజనులో ఈ పక్షులు ఒకింత ఆలస్యంగానూ వచ్చాయని భావిస్తున్నారు. ఏటా నవంబరులో వచ్చే పక్షులు డిసెంబర్ రెండో వారం వరకూ వస్తూనే ఉన్నాయి.
ప్రతికూల పరిస్థితులే కారణం..
ఇందుకు ప్రధాన కారణం ఈ ప్రాంతంలో మునుపటిలా పచ్చదనం తగ్గిపోతుండడం, మడ అడవులు నాశనం కావడం వంటి ప్రతికూల పరిస్థితులే వలస పక్షులు రాక తగ్గడానికి ప్రధాన కారణమని పక్షి ప్రేమికులు అభిప్రాయ పడుతున్నారు. 'విశాఖలో నగరీకరణ వేగంగా జరుగుతోంది. మడ అడవులు, చెరువులు, రిజర్వాయర్లు అంతరించిపోతున్నాయి. అవి వ్యర్థాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఇంకా వాతావరణ మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో వీటి ఆవాసానికి ప్రతికూల పరిస్థితులేర్పడడం వల్ల వలస పక్షులు మునుపటిలా ఇక్కడకు రావడం లేదు. అనుకూలమైన మరో చోటను వెతుక్కుని అక్కడకు పోతున్నాయి. మా పరిశీలనలో వలస పక్షులు గతంకంటే బాగా తక్కువగా కనిపించాయి. ఈ శీతాకాలంలో వచ్చే వలస పక్షులపై చెరువులు, రిజర్వాయర్ల ప్రాంతాల్లో అటవీశాఖ సర్వే చేపట్టాలి. విశాఖ పరిసర ప్రాంతాల్లోకి మునుపటిలా వలస పక్షులు విడిది చేసే పరిస్థితిని కల్పించాలి' అని వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ త్రూ రిసెర్చి అండ్ ఎడ్యుకేషన్ (డబ్ల్యూసీటీఆర్) సభ్యుడు వివేక్ రాథోడ్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.
పదేళ్లలో విశాఖలో గుర్తించిన వలస పక్షుల వివరాలు
ఎన్టీసీపీ యాష్ పాండ్స్ | 74 |
మేఘాద్రిగెడ్డ రిజర్వాయరు | 184 |
మేఘాద్రిగెడ్డ దిగువ ప్రాంతం | 164 |
ఎయిర్పోర్టు సమీప వాటర్ బాడీస్ | 91 |
గోస్తనీ నది ముఖద్వారం | 67 |
గోస్తనీ ముఖద్వార ఉత్తర ప్రాంతం | 101 |
బోని చెరువు (ఆనందపురం) | 134 |
పొడుగుపాలెం సరస్సు | 184 |
తగరపువలస చెరువు | 106 |
లంబసింగి (అల్లూరి జిల్లా) | 167 |