AP Assembly| బడ్జెట్ సమావేశాల్లో ఉన్న థ్రిల్ పోయింది...
40 రోజులు జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు 10రోజులకు కుదించుకుపోయాయి. వాడి వేడి చర్చలు మాయం, వాకౌట్లు మాయం.
By : A.Amaraiah
Update: 2024-11-12 02:10 GMT
"ప్రజాస్వామ్యం దీర్ఘకాలంలో రాచరిక లేదా ఫ్యూడల్ వ్యవస్థల కంటే ఎక్కువ హానికరం అని నేను అనను. ప్రజాస్వామ్యం ఎన్నడూ లేదు. అలాగని ఫ్యూడలిజం లేదా రాచరికం మాదిరి మన్నికైంది కూడా కాదు. కానీ అది కొనసాగుతుంది. అయితే ప్రజాస్వామ్యం ఈ రెండింటికంటే ఎక్కువ రక్తపాతంగా ఉంటుంది. … గుర్తుంచుకోండి. హత్యలు, ఆత్మహత్యలు లేని ప్రజాస్వామ్యం ఏనాడూ లేదు. మోతాదులోనే తేడాలు.. అహంకారం, దురభిమానం లేదా అతిశయం ప్రబలినపుడు నైతికవాదులు కూడా చూస్తూ ఉండాల్సిందే.. వ్యక్తులు తమను తాము జయించుకున్నారు..." అంటారు ప్రముఖ రాజనీతిజ్ఞుడు, అమెరికా రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు జాన్ ఆడమ్స్ మాటలు అచ్చుగుద్దినట్టు సరిపోతాయేమో.
ప్రజా సమస్యలకు అద్దం పట్టాల్సిన అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష పార్టీలు లేకుండానే సాగిపోతున్నాయి. గతంలో తమిళనాడులో ఇటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పోస్టో, ప్రతిపక్ష నాయకుని హోదానో ఉంటేనే సభలో కూర్చొంటాం లేకుంటే అసెంబ్లీకి రాబోమనే సంస్కృతి 2014లో రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి అడపాదడపా కొనసాగుతూనే వస్తోంది. ప్రజా సమస్యలకు అద్దం పట్టాల్సిన అసెంబ్లీ ఇప్పుడు ఏకపక్షంగా సాగుతూ కంటి తుడుపు వ్యవహారంగా మారింది. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలున్నా రాష్ట్రాభివృద్ధి, జనసంక్షేమం, నిధుల కేటాయింపు వంటి వ్యవహారాలలో రాజకీయ పార్టీలు పంతానికి పోకుండా అసెంబ్లీలో అడుగుపెట్టేవి. పద్దులపై చర్చలు సాగేవి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి ఉండేది.
ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల్లో ఎవరెవరు ఏమేమి మాట్లాడతారనే దాని కోసం స్పీకర్లు, పాలకపక్ష నేతలు కూడా వేచి చూసేవారు. సంఖ్యాబలంతో నిమిత్తం లేకుండా సీపీఐ శాసనసభ పక్ష నాయకులుగా వ్యవహరించిన తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చెన్నమనేని రాజేశ్వరరావు, వేములపల్లి శ్రీకృష్ణ, ఇతర పార్టీల నాయకులు తెన్నేటి విశ్వనాధం, గౌత లచ్చన్న, వెంకయ్యనాయుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి వాళ్లు మాట్లాడడానికి స్పీకర్లు సమయం ఇచ్చేవారు. బడ్జెట్ ప్రంసంగాలపై సభలోనే కాకుండా సభ బయటా సమీక్షలు, చర్చలు సాగేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. తూతూ మంత్రం అయ్యాయి.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు-రాజ్యాంగ అనివార్యత కనుక- పాలకపక్షం సభను నిర్వహిస్తుంది. మెజారిటీ లేదనే పేరిటో, పాలకపక్షం అవమానాలు తప్పవనో సాకుతోనో విపక్షం బాయ్ కాట్ చేయడం సర్వసాధారణమైంది. సంయమనం పాటించాల్సిన పాలకపక్షం పంతాలకి పట్టింపులకు పోవడం, సందర్భం వచ్చినపుడు చురకలంటించాల్సిన ప్రతిపక్షం సభకు వెళ్లకపోవడం పరిపాటైంది. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు నామ్ కే వాస్తే అనే రీతిలో సాగుతున్నాయి.
2014లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 67 సీట్లు గెలిచి 44.47 శాతం ఓట్లతో నిలిచిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుని హోదాలో రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. తొలి, మలి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ మొదలు శాసనసభ పక్షనాయకుడు చంద్రబాబు వరకు అవమానాలు ఎదుర్కొన్నారు. 2016లో పార్టీ ప్లీనరీ పెట్టిన జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి రాష్ట్రంలో పాదయాత్ర ప్లాన్ చేశారు. ఆ విధంగా ఏపీ రాష్ట్ర 14వ అసెంబ్లీ కాలం ముగిసింది. టీడీపీ వాళ్లు ఏం చేస్తే అదే బడ్జెట్ అయింది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమిని చవిచూసింది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఘన విజయాన్ని నమోదు చేశారు. 49.95 శాతం ఓట్లు, 151 అసెంబ్లీ సీట్లతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. టీడీపీ కేవలం 22 సీట్లకు పరిమితమైంది. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కింది. 15వ అసెంబ్లీకి తమ్మినేని శీతారాం స్పీకర్. వైసీపీ బదులుకు బదులు తీర్చుకుంది. స్పీకర్ తమ్మినేని మొదలు జగన్ వరకు అందరూ టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును అవమానించారు. 2019,2020, 2021 బడ్జెట్ సమావేశాలకు హాజరైన టీడీపీ శాసనసభా పక్షం ఆ తర్వాత సభను బహిష్కరించింది. 2021 నవంబర్ 19న టీడీపీ అధినేత చంద్రబాబు తన భార్యను వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించారనే పేరిట- తిరిగి ముఖ్యమంత్రి హోదాలోనే సభలో అడుగుపెడతానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. దీంతో 15వ అసెంబ్లీ కూడా ప్రతిపక్షం లేకుండానే చివరి రెండేళ్ల బడ్జెట్ సమావేశాలను పూర్తి చేసింది.
ఇక, 2024లో చరిత్ర తిరగబడింది. టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించింది. 16వ అసెంబ్లీలో కూటమి ఏకంగా 164 సీట్లు గెలిచింది. వైసీపీకి 44.28 శాతం ఓట్లు వచ్చినా కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరాజయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిరోజు నుంచే అసెంబ్లీ పట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈసారి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. స్పీకర్ కావడానికి ముందు అయ్యన్నపాత్రుడు, వైసీపీ అధినేత జగన్ ఉప్పూ నిప్పులానే వ్యవహరించారు. సహజంగా స్పీకర్ అయిన తరువాత రాజకీయాలను మరచిపోయి అన్ని పార్టీలను ఆదరించడం పరిపాటి. కానీ ఇటీవలి కాలంలో అర్థాలు మారిపోతున్నాయి. చరిత్ర సరే, ఇప్పుడేంటనే ప్రశ్నే వస్తోంది గనకు స్పీకర్ కి అధికార పార్టీకి మధ్య ఉండే సన్నని పొర చెరిగిపోతోంది. ఫలితంగా చాలా అనర్థాలు వస్తున్నాయి. శాసనసభ్యునిగా ప్రమాణం చేసిన రోజు నుంచే జగన్ కి పరిస్థితి అర్థమైనట్టుంది. ఇప్పుడు ఆయన ఏకంగా- సభలో అడుగడుగునా అవమానాలు, మైక్ కటింగుల కన్నా- సభకు వెళ్లకపోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఆ మాటే చెప్పారు. సభలో చెప్పాల్సిన విషయాలను మీడియా సమావేశాల్లో చెబుతామంటున్నారు. ఇప్పుడిది వివాదాస్పదమైంది.
గతంలో తమిళనాడులో కూడా ఇదే తంతు చాలాకాలం సాగింది. అన్నాడీఎంకే పార్టీ అధినేత ఎంజీ రామచంద్రన్ ను అవమానించారని ఆయన సభను బహిష్కరించారు. ఆ తర్వాత జయలలిత కూడా అదే రీతిన సభకు దూరమయ్యారు. డీఎంకే అధినేత కరుణానిధి కూడా తనకు సభలో అవమానం జరిగిందంటూ సభకు వెళ్లలేదు. తన వస్త్రాలను లాగారని ప్రకటించిన జయలలిత ఆ తర్వాత ఏకంగా కొత్త శాసనసభనే నిర్మించారు.
తెలుగునాట కూడా అదే సంప్రదాయం కొనసాగుతుండడం యాధృచ్ఛికమే కావొచ్చు గాని ప్రతిపక్షం లేని సభను ఊహించలేం.
లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న బడ్జెట్లకి కస్టోడియన్లుగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు చట్టసభలకు దూరమైతే వాళ్లను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేసినట్టే అవుతుందని ఏఐసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పిన మాట అక్షర సత్యం. కేవలం 7 నెలల కాలానికి రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్ ను ఎటువంటి చర్చ లేకుండానే ఈ శాసనసభ ఆమోదించబోతోంది. సహజంగానే బడ్జెట్ లో ఏముంటుందో సామాన్యుడికి తెలియదు. ప్రశ్నించాల్సిన ఏకైక ప్రతిపక్షం సభను బహిష్కరించడం వల్ల ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది.
సభలో అసలు ప్రాతినిధ్యమే లేని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ మాదిరి 11 సీట్లున్న వైసీపీ సభను బహిష్కరించడం వల్ల నష్టపోయేది ఆ నియోజకవర్గాల ప్రజలే కాదు మొత్తం రాష్ట్ర ప్రజలు.
‘‘ప్రజలు ఓట్లేసింది.. అసెంబ్లీ మీద అలగడానికో, మైకు ఇస్తేనే వెళ్తానని మారాం చేయడానికో కాదు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు. మీ స్వయం కృతాపరాధం ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే.. ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం మీ అవివేకం, అజ్ఞానానికి నిదర్శనం. అసెంబ్లీ ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశం. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుకయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనడం సిగ్గు చేటు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలనే ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం" అన్నారు వైఎస్ షర్మిల. దాదాపు ఇదే అర్థంలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు కూడా జగన్ కి సలహా ఇచ్చారు.
1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితమైంది. అయినా సభకు వెళ్లింది. ఆ 26 మందే సభలో నిప్పులు చెరిగారు. ప్రజాసమస్యలపై నిలదీశారు. 2014లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 44 సీట్లకి, 2019లో 52 సీట్లే వచ్చాయి. అయినా ఆ పార్టీ తనకిచ్చిన సమయంలోనే అవమానాలను ఎదుర్కొంటునే 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా వరకు వచ్చింది.
ప్రజావాణిని వినిపించేందుకున్న ఏకైక, అతిపెద్ద, చట్టబద్ధమైన వేదిక అసెంబ్లీ. అక్కడ ఏమి చేసినా, ఏమి జరిగినా రికార్డే. అదేదీ వ్యక్తిగతం కాదు. కోట్లాది మంది తరఫున మాట్లాడాల్సిన నేతలు సభపై కినుక వహిస్తే నష్టం ప్రజలకే తప్ప నాయకులకు కాదు.