ఈ శ్వేత పత్రానికి జగన్ బదులిస్తారా?
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుపై తొలి శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం విడుదల చేశారు. తాను ఐదేళ్ల కాలంలో నిర్మించిన ప్రాజెక్టు నిర్మాణాలను కూడా పనికి రాకుండా జగన్ చేశారని, తన హయాంలో రూ. 11762 కోట్లు ఖర్చు చేసి నిర్మాణం చేపడితే, జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 4167 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ప్రాజెక్టును పనికి రాకుండా చేశారని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. జగన్ మూర్ఖత్వం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతినిందని, జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం పనులు ఆపేసి, తన ఇష్టాను సారంగా కాంట్రాక్టర్లను తొలగించి, పొలవరం ప్రాజెక్టు గోదావరిలో కలిసేలా చేశారని శ్వేతపత్రంలో పేర్కొనడం విశేషం. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రం రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిశీలించేందుకు వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితులను చూస్తే కడుపు తరుక్కుపోయిందని, కళ్ల వెంట నీళ్లు వచ్చాయని శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు అనడం విశేషం.