బడి వొడిలో... ఒక టీచరమ్మ ‘యథానికలు’

ఒక టీచర్ కి బడిపిల్లలతో అనుబంధం ఎట్లా మొలకెత్తి, పెరిగి పెద్దదవుతుందో, అందులో ఎంత వ్యథ, ఆనందం, ఉద్వేగం ఉందో చూపే కాంతి నల్లూరి ‘యథానికలు’ ప్రారంభం. మొదటి భాగం

Update: 2024-09-08 06:44 GMT
నాటి పాఠశాల నేటి రూపం

“I write because I’m unhappy.”: Mario Vargas Llosa

నేను ఆనందంలో ఉన్నాను. 30 సంవత్సరాల నుంచి నాకు, నా కుటుంబానికి, మా ఇంట్లో ఉండి చదువుకున్ననా పదిమంది పిల్లలకు అన్నంపెట్టినపిల్లల గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకే కాదు,మా ఇంటి కొచ్చే ప్రజా సంఘాల వారికి, చుట్టపక్కాలకు పెట్టినదంతా వారి ద్వారానే. మేము చేసిన పెళ్లిళ్ల ఖర్చులకు, నేను చేసిన ఆర్థిక సహాయాలన్నిటికీ మూలమైన నా విద్యార్థుల గురించి వివరిస్తాను.

నాకు కూడు పెడుతున్న ఈ పిల్లలకు న్యాయం చేయాలన్నా దృక్పథంతో, నా సామాజిక కార్యక్రమాలను, వ్యక్తిగత పనులను తగ్గించు కుంటూ వచ్చాను. ఎవరన్నా ఏమి చేస్తున్నావ్ అంటే రెండు బావుల్లో ఈదుతున్న ఒకే కప్పను అనేదాన్ని. రెండు బావులేవంటే ఒకటి స్కూలు, రెండు ఇల్లు అనేదాన్ని. ఆ ఈతలకు మూల స్తంభాలైన ఆ వెలుగు నక్షత్రాల గురించి తప్పనిసరిగా చెప్పాలి.

కూడే కాదు, ఆనందోత్సాహాలను, నవ్వులను, ఆశ్చర్యాన్ని అద్భుతాలను దిగ్భ్రాంతులను ఇచ్చారు, ఆలోచనలకు అవగాహనలకు పదనుపెట్టిన ఆ బుడిబుడి చిరునవ్వుల చిన్నారుల గురించి, వారి నుంచి నేను నేర్చుకున్న అంశాలు గురించి మీతో పంచుకుంటాను. నేను నేర్పిన, చెప్పిన అంశాల నుంచి, కథల నుంచి ఆ చిన్నారులు పొందిన సంశయాలనున తీర్చడానికి నేను చాలా కృషి చేయాల్సి వచ్చేంది. వాళ్లను బడిలో, ఇసుకలో వర్షo లో, పొలాలలో తిప్పినప్పుడు వారు పొందే ఆనందోత్సాహాలను చూస్తూ మైమరిచిపోయాను. వారితో పాటు నేను పొందిన సంతృప్తిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.


ఇప్పటి పాఠశాల ఆవరణలో


 " మనకు బాగా లేకపోయినా స్కూలుకు వెళ్లిన తర్వాత అమ్మకు మనం గుర్తురానే రాం," అంటూ నాన్న. నా కన్నా మీ బడి పిల్లలే ఎక్కువని కుళ్ళు కునేది నది . "మీ విద్యార్థులే తెలివైనవాళ్ళు. మాంచి ఉన్న వాళ్ళా" నది చెణుకు లేసిన బడి గురించి ఇపుడు చెప్పాల్సిన సమయం వచ్చింది. "అవునమ్మా స్కూల్ కి వెళితే మీ అమ్మకు ఏమీ గుర్తు రావు. ఇంటిని బడి దగ్గరకు తీసుకెళ్లదుగాని, ఆ లెక్కలని ఈ లెక్కలని బడిని ఇంటికి తెచ్చిద్ది. విద్యార్థుల గురించి గొప్పగా చెప్పిది. ఎక్కడికి వెళ్లినా స్కూలుకు, విద్యార్థులకు ఏమి పనికొస్తాయోనని కళ్ళు ఎంత చేసుకుని చూస్తదని" నా సహచరుడు కూతురుకు వత్తాసులు వేసేవాడు. అయినా ఏ రోజు కా రోజు విద్యార్థులతో పొందిన ఆనందాన్ని, వారి కుటుంబాలను గురించి చెప్పకుండా ఉండలేనంత సంతోషాన్ని ఇచ్చిన ఆ పసికూనల గురించి. నీజీవితాన్ని కాంతిమయం చేసిన ఆ చిన్నారుల గురించి నలుగురికి చెప్పాలి.

పాఠశాలకు వచ్చిన అధికారులు మెచ్చుకున్నా మెడల్స ఇచ్చినా, వాటికి కారణమైన ఆ వెలుగు దారులు గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

అంతా ఆనందోత్సాహాలేనా ? వ్యథలు, దుఃఖాలు లేవా? బాధపెట్టిన అంశాలు లేవా? అంటే ఉన్నాయి. నేను పొందిన ఆనంద ఆశ్చర్య అద్భుతాలు, అవగాహనలు (భూమంతా) ముందు అవి ఎంత చిన్న దుప్పటంత.

ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. నాకు ఏది రాయాలనిపిస్తే అదే. ఎవరి పొగడ్తలు ఆశించను. జరిగిన అంశాలనే రాస్తాను. అతిశయోక్తులు, వర్ణనలు, కవితాత్మకతలు ఉండవు. నేను రచ, కవయిత్రి ని కాదు కాబట్టి. నేను అనుభించిన మెప్పు, ప్రశంసల, పతకాల వెనక ఉన్న ఆ వెలుగు దారుల గురించి మీతో పంచుకోవాలను కుంటున్నాను.

"పిల్లలకు సంబంధించిన పుస్తకములో, పిల్లల గురించి చెప్పేటప్పుడు, పిల్లల కుటుంబాల సంగతి చెప్పకుండా తప్పించుకోవడం దాదాపు అసాధ్యం" అని ఎపుడో రష్యన్ విద్యావేత్త సుహోమ్లీన్ స్కీ (Vasyl Sukhomlynsky) అన్న మాట ఇపుడు గుర్తుకు వచ్చింది.

1995 జూలై లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పట్టపు పాలెంలో టీచర్ గా జాయిన్ అయ్యాను. అన్ని పూరి గుడిసెలే. పేరుకే పాఠశాల. నాలుగు గోడలు, పైకప్పు. తలుపులు, కిటికీలకి రెక్కలు లేవు. ఊరు దాటి అరకిలోమీటర్ వెళ్లాలి. 7.30 గంటలకు ట్రైన్ దిగి, ఒకే ఒక సీటున్న వ్యాన్లో మూడు కిలోమీటర్లు వెళ్లి, అది దిగి మూడు కిలోమీటర్ల నడక. మధ్యలో ఉన్న ఊరులో బ్యాగు పెట్టేసి, అటెండెన్స్ రిజిస్టర్లు, పెన్నులు, చాక్ పీసులు పట్టుకొని స్కూలుకు వెళ్లేవాళ్ళం. లంచ్ పక్క స్కూల్ కి వచ్చి తిని, మళ్లీ స్కూల్కి (ఎపప్ర సైకిల్ మీద) వెళ్ళేవాళ్ళం.

స్కూల్లో ఒక బల్ల, ఒక కుర్చీ, అరిగిపోయిన ఒక నల్లబల్ల. కూర్చోవాలంటే వాకిలి దిగే రెండు మెట్లు. స్కూలుకు ఓపక్క ఊరంతటికీ చెందిన ఓ బావి. సముద్రపు ఘోష. ఇసుక ఎత్తి ఒంటినిండా, కళ్ళనిండా పోసే హోరుగాలి. ముప్పైమంది విద్యార్థులు, నేను, హెడ్మాస్టర్ ఏపప్ర. మాస్టర్ రానిరోజు చుక్కల్లో చందమామ లాగా నేనొక్కదాన్నే. మాకు తోడు దూరాన తాటి చెట్లు. ఎప్పుడన్నా ఓ మనిషనేవాళ్ళు కనిపించేవాళ్ళు. వర్షం వస్తే పై కప్పు ఎప్పుడు కూలుతుందొనని బిక్కుబిక్కుమని చూసుకకుంటూ, పడితే ముప్పైమందిమి సజీవ సమాదే అనుకుంటూ భయాన్ని కనపడ నీయకుండా,చదువు, పిల్లలు చెప్పే కబుర్లు, చేసే డ్యాన్సులు ఆస్వాదిస్తూ (నా భాష పిల్లలకు, పిల్లలభాష (పట్టపుబాష) నాకు అర్థమయ్యేది కాదు) కష్టపడి గాలి ఇల్లే (గాలి లేదు, గాలి ఎక్కువగా ఉంది, గంట కొట్టించు లాంటి కొన్ని పదాలు, వాక్యాలు కష్టపడి నేర్చుకున్న.) పిల్లల నుంచి నేర్చుకోవడం ఇక్కడ మొదలయ్యాను. నేను చేసిన బి.ఎడ్ కు, చదువుకున్న పుస్తకాలకు, ఇక్కడ నే చెప్పే చదువుకు ఏ సంబంధం లేదు.


ఈ చెట్లకు అవతలి వైపు సముద్రం


కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్టు, టైం వేస్టుచేయకూడదు, చెప్పాలి, నేర్పాలనే తపన. మనం చెప్పేది వాళ్లకు నచ్చదు. వాళ్ళు గాలి ఇల్లె అంటుంటే మనం "అ ఆ" అంటుంటే ఏమి నచ్చుతుంది. అక్కడక్కడ కొంతమంది మగాళ్లకు సంతకాల చదివే. మరి ఆ పాఠశాల ఎప్పటినుండి ఉందో? అక్షరాలు పదే పదే చెప్పినా అర్థమయ్యేవి కాదు. పదాలు రాయడం పిల్లలకు కష్టంగా ఉండేది. మాకు చెప్పాలన్న తపన, ఆత్రుత. ఎలా చెప్పాలో అర్థంకాక, వాళ్ళ స్థాయికి దిగటంరాక, దుఃఖం, బాధ, కోపం, నిరాశ అన్ని కలిసి ఉక్కిరిబిక్కిరిగా ఉండేది.

పెద్దలకు కట్టుబాటు ఉండేది. నాయకుడు చెప్పినట్టే ఉండాలి. పాఠశాలలో కూడా అంతే. గంట కొట్టండిరా అంటే కొట్టరు. స్కూల్ నాయకుడుకి గంట కొట్టించరా అని చెబితే, ఆ నాయక విద్యార్థి చెబితేనే గంట కొట్టేవాళ్ళు. (మగ పిల్లలే ఎక్కువగా ఉన్నారు) ఇది అర్థం చేసుకోవడానికి బోలెడంత కాలం పట్టింది. అన్నింటికీ ఆ నాయకుడే ఆధారం. పిల్లల్ని కూర్చోబెట్టు అని కూడా చెప్పాలి.

ఊరిలో ఓ గట్టి ఇల్లు కూడా లేదు. మగాళ్లు వెళితే వేటకు లేదా పేకాటకు. ఆడోళ్ళు చేపల గంపలేసుకుని అమ్మడానికి వెళ్లేవారు. యువత లుంగీలు, చొక్కాలు. పెద్దవాళ్ళు గోచిగుడ్డలతోనే. ఆ సముద్రపు వాతావరణానికి ఆఫ్రికన్స్ లాగా ఉండేవాళ్లు. సరైన ఇళ్ళు, సరైన గుడ్డలు లేవు. వర్షాలు తుఫానులప్పుడు ఎలా బ్రతుకుతారో? దిగులుగా ఏపప్రగారితో అంటే, ఊరుకోండి మేడం వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది. శ్రీరామనవమి అప్పుడు చూడాలి వాళ్ళ డబ్బు, సంబరాలు అనేవాడు. డబ్బుంటే ఇల్లు కట్టుకోవచ్చు కదా అంటే కట్టుకోరు అంతే అనేవాడు. (పట్టపు, పల్లె పాలేలు చూడటం నాకు మొదటిసారి. మాస్టర్ గారిది ఆ ఏరియానే కాబట్టి తెలుసు).

ఆ మూల ఉన్న తొమ్మిది ఊర్లలోని 9 పాఠశాలలకు 20 మందిమి బ్రహ్మాండమైన స్టాప్ వెళ్ళాం. 9 స్కూల్స్ లో ఓ ఏడు మంది సీనియర్లు ఉన్నారు. 89 లో రిక్రూట్మెంట్ తరువాత, 95 బ్యాచ్ గా మేము వెళ్ళాం. మా యువ టీచర్లతో ఆ ఊర్లన్నీ కళకళ లాడిపోయాయి. మాతోపాటు మా అల్లరిని గోలను భరిస్తూ, ఆనంద సంతోష దుఃఖాలను పంచుకుంటూ మా సీనియర్లు మాఅంత అయిపోయారు. మేమంతా సముద్రపు పొంగు, ఉప్పొంగే అలలమై పోయాం. ఏదో ఒక వంకతో ఏదో ఒక పార్టీ, ఏం లేకపోతే మెయిన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, మా అందరికీ పెద్ద దిక్కు అయిన కం.వెo(కంభంపాటి వెంకటేశ్వర్లు)ను రెచ్చగొట్టి, ఉబ్బేసి పార్టీని తీసుకునేవాళ్ళo. పేర్లు కూడా తెలుగులో షార్ట్ కట్.(దొంతు బాల సుబ్రహ్మణ్యం) దొబాసు అని. (సశేషం)

Tags:    

Similar News